సచిన్ వివాదాస్పద ఔట్.. 22 ఏళ్లకు తప్పు ఒప్పుకొన్న అంపైర్.. జీవితంలో మర్చిపోలేనని కామెంట్లు
క్రికెట్ అంపైర్లలో స్టీవ్ బక్నార్ పేరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విషయంలో చాలా సార్లు తప్పుగా ఔట్ ఇచ్చిన అంపైర్ గా అతనికి పేరుంది. అయితే 22 ఏళ్ల తర్వాత స్టీవ్ తన తప్పు ఒప్పుకోవడం గమనార్హం.
అంపైర్ స్టీవ్ బక్నార్.. ఈ తరం క్రికెట్ ఫ్యాన్స్ ఈయన గురించి తెలిసి ఉండదు. కానీ 1990, 2000ల్లో క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులకు ఈ అంపైర్ గురించి, సచిన్ టెండూల్కర్ విషయంలో అతనిచ్చిన వివాదాస్పద ఔట్ల గురించి బాగానే తెలిసి ఉంటుంది. భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఒకానొక సమయంలో స్టీవ్ బక్నార్ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు కూడా. అయితే ఇప్పుడు స్టీవ్ తన తప్పు ఒప్పుకొన్నాడు.

వివాదాస్పద అంపైర్
79 ఏళ్ల స్టీవ్ బక్నార్ 120 పైగా టెస్టుల్లో అంపైరింగ్ చేశాడు. ప్రపంచకప్ ల్లోనూ అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అంపైర్ గా నిలిచాడు. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగానే ఉన్నాయి.
ఆ టెస్టులో
ఆస్ట్రేలియాతో జరిగిన బ్రిస్బేన్ టెస్టులో జాసన్ గిలెస్పీ బౌలింగ్‌లో సచిన్ ను స్టీవ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇవ్వడం అతిపెద్ద షాక్‌గా మిగిలిపోయింది. 2003-04లో ఆస్ట్రేలియా టూర్ కు ఇండియా వెళ్లింది. ఈ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బాలో ఓ టెస్టు జరిగింది. ఆ మ్యాచ్ లో ఓ ఓవర్లో గిలెస్పీ వేసిన ఓ బాల్ సచిన్ ప్యాడ్ కు పైన తగిలింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగానే స్టీవ్ వేలు లేపాడు. దీంతో సచిన్ సహా ఇండియన్ ఫ్యాన్స్, కామెంటేటర్లు, ఆడియన్స్ షాక్ అయ్యారు.
22 ఏళ్ల తర్వాత
గిలెస్పీ బౌలింగ్ లో సచిన్ ఎల్బీడబ్ల్యూ తీవ్ర వివాదాస్పదంగా మారింది. రిప్లేలో ఆ బంతి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ పిచ్ అయిందని, స్టంప్స్ పై నుంచి వెళ్లేదని క్లియర్ గా తేలింది. 22 ఏళ్ల తర్వాత స్టీవ్ బక్నార్ తన నిర్ణయం తప్పు అని అంగీకరించాడు. బంతి స్టంప్స్‌ను మిస్ అవుతున్నప్పుడు టెండూల్కర్‌ను ఔట్ గా ఇవ్వాల్సింది కాదని పేర్కొన్నాడు.
తప్పులు జరుగుతాయంటూ
‘‘సచిన్ టెండూల్కర్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చా. అది తప్పని తెలుసుకున్నా. ప్రతిరోజూ ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. నేనెందుకు అతన్ని ఔట్ గా ప్రకటించా? అతను నిజంగానే ఔట్ అయ్యాడా? అని ప్రశ్నించుకుంటూనే ఉంటా. జీవితంలో తప్పులు జరుగుతాయి. ఈ తప్పును జీవితంలో మర్చిపోలేను’’ అని వెస్టిండీస్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్‌తో ఇంటర్వ్యూలో బక్నార్ పేర్కొన్నాడు.
పాక్ తో మ్యాచ్ లోనూ
గబ్బా మ్యాచ్ జరిగిన రెండేళ్ల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య మరో గేమ్ లోనూ స్టీవ్ బక్నార్ సచిన్ ను తప్పుగా ఔట్ అని ప్రకటించాడు. అబ్దుల్ రజాక్ వేసిన బాల్ సచిన్ టెండూల్కర్ బ్యాట్ ను తగలకుండానే వెళ్లిపోయింది. కానీ బక్నార్ క్యాచ్ ఔట్ ఇచ్చాడు. గతంలో ఓ సారి బక్నార్ గురించి సచిన్ మాట్లాడుతూ.. ‘‘నేను బ్యాటింగ్ చేసే సమయంలో బక్నార్ చేతికి బాక్సింగ్ గ్లౌవ్స్ తొడగాలి. అలా అయితే అతను వేలు ఎత్తడు’’ అని చెప్పాడు.

E-Paper












