Budget 2026 : ఈవీలు, గ్రీన్ ఎనర్జీపై ఫోకస్- ‘బడ్జెట్’లో వీటిపై కీలక ప్రకటనలు..
కేంద్ర బడ్జెట్ 2026 పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ మొబిలిటీకి పెద్దపీట వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, చార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఖనిజాలపై సుంకాలను రద్దు చేసింది. వాహన ప్రమాద బాధితులకు పన్ను మినహాయింపునిస్తూ కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.
భారతదేశాన్ని సుస్థిర అభివృద్ధి పథంలో నడిపించే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగాన్ని పటిష్టం చేసేందుకు సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేశారు. కాలుష్య నివారణే ధ్యేయంగా సహజ వాయువులో బయో గ్యాస్ మిశ్రమాన్ని తప్పనిసరి చేయడం ఈ బడ్జెట్‌లో ఒక కీలక మలుపు.

రవాణా రంగంలో వాడే సిఎన్జీ, గృహ అవసరాలకు వాడే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)లో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ)ని దశలవారీగా కలపడాన్ని ఈ బడ్జెట్ 2026తో కేంద్ర ప్రభుత్వం ఇకపై తప్పనిసరి చేయనుంది. దీనివల్ల శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గి, పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈవీ రంగానికి ఊతం.. ఈ-బస్సులకు ప్రాధాన్యత
"మన ప్రభుత్వం తయారీ రంగం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ-వెహికల్ వ్యవస్థను మరింత విస్తరిస్తుంది, బలోపేతం చేస్తుంది," అని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచేందుకు 'పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం' ద్వారా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆమె వెల్లడించారు.
లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి రాయితీలు..
దేశీయంగా బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈవీ బ్యాటరీల తయారీకి వాడే 35 అదనపు క్యాపిటల్ గూడ్స్ (యంత్రాలు/పరికరాలు), మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి అవసరమైన 28 రకాల పరికరాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల లిథియం-అయాన్ బ్యాటరీల ధరలు తగ్గి, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు సామాన్యులకు మరింత అందుబాటులోకి రానున్నాయి.
ఖనిజాల దిగుమతిపై పన్ను రద్దు..
పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల లభ్యతను సులభతరం చేసేందుకు కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాలు, లెడ్, జింక్‌తో పాటు మరో 12 రకాల కీలక ఖనిజాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా రద్దు చేశారు. "ఈ చర్యల వల్ల దేశీయ తయారీ రంగంలో ఖనిజాల కొరత తీరడమే కాకుండా, మన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి," అని నిర్మల వివరించారు.
ప్రమాద బాధితులకు పన్ను ఊరట
మానవతా దృక్పథంతో ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం వాహన ప్రమాద బాధితులకు సంబంధించినది. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) ద్వారా బాధిత వ్యక్తులకు లభించే పరిహారంపై వచ్చే వడ్డీకి 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు లభించనుంది. అంతేకాకుండా, ఈ వడ్డీపై టీడీఎస్‌ను కూడా రద్దు చేశారు. దీనివల్ల ప్రమాద బాధితులకు అందాల్సిన పూర్తి పరిహారం ఎటువంటి కోతలు లేకుండా నేరుగా వారి చేతికి అందుతుంది. న్యాయం కోసం వేచి చూసే బాధితులకు ఇది నిజంగా పెద్ద ఊరట.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


