Nissan SUVs : నిస్సాన్ బిగ్ ప్లాన్- భారతదేశంలో 3 కొత్త గ్రాండ్ ఎస్‌యూవీలు..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించేందుకు జపాన్ కార్ తయారీ దిగ్గజం నిస్సాన్ వేగంగా పావులు కదుపుతోంది. 3-వరుసల సీటింగ్ ఎస్‌యూవీ, లగ్జరీ ఆఫ్-రోడర్ 'పాట్రోల్', అలాగే టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా 'టెర్రానో' రీ-ఎంట్రీ సహా నిస్సాన్ తీసుకొస్తున్న 3 కొత్త మోడళ్ల వివరాలు ఇక్కడ చూడండి..
భారత కార్ల మార్కెట్లో పట్టు బిగించేందుకు జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. జులైలో లాంచ్ చేసిన ‘టెక్టాన్’ సక్సెస్ ఉత్సాహంతో దేశీయ మార్కెట్లోకి వరుసగా మూడు సంచలనాత్మక ఎస్‌యూవీలను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రసిద్ధ మోడల్ 'టెర్రానో' పునరాగమనంతో పాటు గ్లోబల్ లగ్జరీ ఎస్‌యూవీ 'పాట్రోల్' కారు కూడా త్వరలోనే భారత రోడ్లపై సందడి చేయనుంది.

ఆల్కజార్‌తో తలపడేందుకు 3-రో ఎస్‌యూవీ..
టెక్టాన్ మోడల్‌ను విజయవంతంగా పరిచయం చేసిన నిస్సాన్.. 2027 నాటికి మేడ్ ఇన్ ఇండియా ప్రాతిపదికన మరో కొత్త సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీని తీసుకురానుంది. టెక్టాన్ కంటే పైన పొజిషన్ చేయనున్న ఈ కారును ప్రధానంగా పెద్ద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని 3-వరుసల సీటింగ్‌తో రూపొందిస్తున్నారు. ఇది నేరుగా హ్యుందాయ్ ఆల్కజార్, టాటా సఫారీ వంటి మోడళ్లకు బలమైన పోటీని ఇస్తుంది.
దాదాపు 4.6 మీటర్ల పొడవు, 2.7 మీటర్ల వీల్‌బేస్‌తో రానున్న ఈ కారు వెనుక ప్రయాణికులకు విశాలమైన స్థలాన్ని అందిస్తుంది. 7-సీటర్ ఆప్షన్‌తో పాటు మధ్య వరుసలో క్యాప్టెన్ సీట్లతో 6-సీటర్ అవతార్‌లో కూడా ఇది లభించే అవకాశముంది. ఇందులో 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చనున్నారు. ఇది 161 హెచ్‌పీ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, డ్యూయల్-వెట్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను ఇందులో అందించనున్నారు.
ల్యాండ్ క్రూజర్‌కు పోటీగా 'పాట్రోల్'
వచ్చే ఏడాది ఆరంభంలోనే నిస్సాన్ తమ అత్యంత ప్రతిష్టాత్మక ఫుల్-సైజ్ ఎస్‌యూవీ ‘పాట్రోల్’ను సీబీయూ మార్గంలో నేరుగా భారత్‌కు దిగుమతి చేయనుంది. టయోటా ల్యాండ్ క్రూజర్ 300కి పోటీగా ఉండే ఈ కారులో ఏకంగా 8 మంది ప్రయాణించవచ్చు.
ఈ కారులో 22-ఇంచుల భారీ అల్లాయ్ వీల్స్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ట్విన్ 14.3-ఇంచ్ కాక్‌పిట్ డిస్‌ప్లేలు, కలర్ హెచ్‌యూడీ, మసాజ్ ఫీచర్ ఉన్న జెరో-గ్రావిటీ సీట్లు, వెనుక సీట్ల కోసం 12.8-ఇంచ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, 12-స్పీకర్ల క్లిప్ష్ సౌండ్ సిస్టమ్‌ను అందించనున్నారు. సేఫ్టీ కోసం ఇన్విజిబుల్ హుడ్ వ్యూ, ప్రొపైలట్, లేన్ కీప్ అసిస్ట్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.
ఇందులోని వీఆర్35 3.5-లీటర్ ట్విన్-టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్ ఏకంగా 425 హెచ్‌పీ పవర్, 700 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్, 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఈ కారు ఎంతటి కఠినమైన రహదారులనైనా సులువుగా దాటగలదు.
2029 నాటికి టెర్రానో రీ-ఎంట్రీ!
భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ ఏకచ్ఛత్రాధిపత్యానికి చెక్ పెట్టేందుకు నిస్సాన్ 'టెర్రానో' పేరును మళ్లీ తెరపైకి తెస్తోంది. 2028లో అంతర్జాతీయంగా పరిచయం కానున్న ఈ డి-సెగ్మెంట్ ఎస్‌యూవీని, 2029 నాటికి మన దేశంలో కంప్లీట్లీ నాక్డ్ డౌన్ కిట్ల రూపంలో అసెంబుల్ చేయనున్నారు.
ఫ్రాంటియర్ ప్రో ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడే ఈ కారు ఐసీఈ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌లో కూడా లభించనుంది. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన మైలేజ్ కోరుకునే వారికి ఈ పవర్-ప్యాక్డ్ హైబ్రిడ్ వెర్షన్ అద్భుతమైన ఎంపికగా మారనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


