UPSC CSE 2026 : యూపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల.. ఈ పని చేయకపోతే అనర్హతే !

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కీలక అప్‌డేట్. యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. డిసెంబర్ 7 నుంచి మొదలయ్యే ఇంటర్వ్యూల తేదీలు, ముఖ్య నిబంధనలు ఇక్కడ చూడండి..

Published on: Nov 18, 2026, 12:20:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశ అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సాధించాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. 'యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్​ఈ) 2026' తుది దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటి ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా తమ ఇంటర్వ్యూ తేదీలను చూసుకోవచ్చు.

యూపీఎస్సీ సీఎస్​ఈ 2026 లేటెస్ట్ అప్డేట్స్.. (HT_PRINT)
యూపీఎస్సీ సీఎస్​ఈ 2026 లేటెస్ట్ అప్డేట్స్.. (HT_PRINT)

కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, యూపీఎస్సీ సివిల్స్ 2026 ఇంటర్వ్యూలు 2026 డిసెంబర్ 7న ప్రారంభమై 2027 ఫిబ్రవరి 12న ముగుస్తాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9:00 గంటలకు, మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులు మధ్యాహ్నం 1:00 గంటకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలోని షాజహాన్ రోడ్‌లో ఉన్న యూపీఎస్సీ ప్రధాన కార్యాలయం 'ధోల్‌పూర్ హౌస్' వేదికగా ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఏటా వందలాది మంది అభ్యర్థులు సివిల్స్ తుది జాబితాలో మెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది యూపీఎస్సీ పరీక్షలు పాసైన అభ్యర్థులు.. దిల్లీకి వెళ్లేందుకు ఇప్పటి నుంచే రైలు, విమాన టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ షెడ్యూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

నవంబర్ 25లోగా ఆ పని చేయకపోతే అనర్హతే!

సివిల్స్ 2026 మెయిన్స్‌లో అర్హత సాధించిన మొత్తం 2,526 మంది అభ్యర్థుల రోల్ నంబర్ల వారీగా పర్సనాలిటీ టెస్ట్ షెడ్యూల్‌ను యూపీఎస్సీ రూపొందించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే అభ్యర్థులకు కమిషన్ ఒక అత్యంత కీలకమైన నిబంధనను గుర్తుచేసింది. అర్హత సాధించిన అభ్యర్థులందరూ 2026 నవంబర్ 11 నుంచి నవంబర్ 25వ తేదీలోపు కమిషన్ వెబ్‌సైట్‌లో తమకు సంబంధించిన అవసరమైన వివరాలను ఆన్‌లైన్‌లో పూరించి, అప్‌డేట్ చేసి సమర్పించాలి. నిర్ణీత గడువు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థులకు ఈ-సమ్మన్ లెటర్ జారీ చేయమని, వారిని పర్సనాలిటీ టెస్ట్‌కు అనుమతించబోమని యూపీఎస్సీ తేల్చి చెప్పింది.

ప్రయాణ ఖర్చుల రీయింబర్స్‌మెంట్ నిబంధనలు..

యూపీఎస్సీ సివిల్స్ 2026 ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులను కమిషన్ రీయింబర్స్ చేస్తుంది. అయితే ఈ రీయింబర్స్‌మెంట్ కేవలం మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని సెకండ్ క్లాస్ / స్లీపర్ క్లాస్ టికెట్ ఛార్జీలకు మాత్రమే పరిమితమని కమిషన్ స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు తమ ప్రయాణ టికెట్లను భద్రపరుచుకుని నిబంధనల ప్రకారం క్లెయిమ్ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ సివిల్స్ 2026 ఇంటర్వ్యూ షెడ్యూల్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులు కింది దశలను అనుసరించి తమ షెడ్యూల్‌ను సులభంగా పొందవచ్చు:

  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in సందర్శించండి.
  • హోమ్ పేజీలో కనిపించే 'UPSC Civil Services Exam 2026 Interview Schedule' లింక్‌పై క్లిక్ చేయండి.
  • వెంటనే తెరపై ఒక కొత్త పీడీఎఫ్ ఫైల్ తెరుచుకుంటుంది; అందులో మీ రోల్ నంబర్ ఆధారంగా ఇంటర్వ్యూ తేదీ, సెషన్ వివరాలు చూసుకోండి.
  • భవిష్యత్ అవసరాల కోసం ఆ పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఒక ప్రింట్ కాపీ దగ్గర ఉంచుకోండి.

మెయిన్స్ పరీక్షల నేపథ్యం.. తుది పోరుకు సమయం ఆసన్నం!

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ పర్సనాలిటీ టెస్ట్‌కు అర్హులు. యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను 2026 ఆగస్టు 21, 22, 23, 29, 30 తేదీల్లో రెండు షిఫ్టులలో నిర్వహించింది. మొదటి షిఫ్ట్ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగింది.

ఆ ఫలితాలను కమిషన్ నవంబర్ 5, 2026న ప్రకటించగా, అందులో 2,526 మంది ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు. ఈ తుది అంకాన్ని కూడా విజయవంతంగా దాటితే అఖిల భారత సర్వీసుల్లో అడుగుపెట్టే కల నెరవేరుతుంది.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి.

యూపీఎస్సీ ఇంటర్వ్యూ షెడ్యూల్​ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More