UPSC Engineering Service : యూపీఎస్సీ ఈఎస్​ఈ రిజిస్ట్రేషన్​కు ఇంకొన్ని గంటలే ఛాన్స్- పూర్తి వివరాలు..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్​ఈ) 2027 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6తో ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు..

Published on: Oct 6, 2026, 10:44:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే 'ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్​ఈ) 2027' దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. దరఖాస్తు గడువు నేడు (అక్టోబర్ 6, 2026) సాయంత్రం 6 గంటలతో ముగియనుందని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది. చివరి నిమిషంలో సర్వర్ రద్దీ, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అర్హులైన అభ్యర్థులు వెంటనే అధికారిక పోర్టల్ upsconline.nic.in సందర్శించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని కమిషన్ సూచించింది.

యూపీఎస్సీ ఈఎస్​ఈ 2027 లేటెస్ట్ అప్డేట్స్...
యూపీఎస్సీ ఈఎస్​ఈ 2027 లేటెస్ట్ అప్డేట్స్...

ఈ సారి నోటిఫికేషన్ ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో సుమారు 480 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 19 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. భారత ప్రభుత్వ పరిధిలోని రైల్వే, డిఫెన్స్, సీడబ్ల్యూసీ, కేంద్ర నీటిపారుదల శాఖ వంటి అత్యున్నత విభాగాల్లో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో కొలువు తీరేందుకు ఈ పరీక్ష మార్గం సుగమం చేస్తుంది.

దరఖాస్తు విధానంలో కీలక నిబంధనలు..

యూపీఎస్సీ ఈఎస్ఈ 2027కి అప్లై చేసే క్రమంలో అభ్యర్థులు యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ (యూఆర్​ఎన్), కామన్ అప్లికేషన్ ఫారమ్ (సీఏఎఫ్) ప్రక్రియలను పూర్తి చేయాలి. దరఖాస్తును కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. వేరే ఏ మార్గంలో పంపినా దరఖాస్తులను తిరస్కరిస్తారు.

ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దానిని వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అలాగే సబ్మిషన్ పూర్తయ్యాక దరఖాస్తులో ఎలాంటి కరెక్షన్లు చేసుకోవడానికి వీలుండదని యూపీఎస్సీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి ఫారమ్ సబ్మిట్ చేసేముందే నమోదు చేసిన వివరాలన్నీ సరైనవో కాదో క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం అవసరం.

Government jobs : అలర్ట్! ఎస్బీఐ నుంచి ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ వరకు.. త్వరలో ముగియనున్న అప్లికేషన్ ప్రాసెస్

వయోపరిమితి, విద్యార్హతల వివరాలు..

వయోపరిమితి: 2027 జనవరి 1 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. 30 ఏళ్లు దాటకూడదు. అంటే అభ్యర్థులు 1997 జనవరి 2 నుంచి 2006 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

జాతీయత: అభ్యర్థులు భారతదేశ పౌరులై ఉండాలి, లేదా నేపాల్, భూటాన్ దేశస్థులై ఉండాలి.

విద్యార్హత: సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షల షెడ్యూల్..

నోటిఫికేషన్ ప్రకారం యూపీఎస్సీ ఈఎస్ఈ ప్రిలిమినరీ పరీక్షను 2027 జనవరి 31న నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశ అయిన మెయిన్స్ పరీక్షను 2027 జూన్ 18న జరుపుతారు. మెయిన్స్ నెగ్గిన వారికి ఆఖరి దశలో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More