UPSC prelims 2026 result : యూపీఎస్సీ ప్రిలిమ్స్​ ఫలితాలు విడుదల- మెయిన్స్‌కు 13,343 మంది అర్హత

UPSC prelims 2026 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు కమిషన్ వెల్లడించింది.

Published on: Jun 16, 2026, 06:02:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-2026 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది మే 24వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ప్రతిభ చాటి, తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు మొత్తం 13,343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మెయిన్స్‌కు ఎంపికైన వారి సంఖ్య స్వల్పంగా తగ్గింది! 2025 సివిల్స్ నోటిఫికేషన్‌లోని 1,087 పోస్టుల భర్తీకి గానూ గతంలో 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ అయ్యారు.

యూపీఎస్సీ ప్రిలిమ్స్​ ఫలితాలు విడుదల..
యూపీఎస్సీ ప్రిలిమ్స్​ ఫలితాలు విడుదల..

భారత పరిపాలనా సేవ (ఐఏఎస్), భారత విదేశాంగ సేవ (ఐఎఫ్​ఎస్), భారత పోలీసు సేవ (ఐపీఎస్)లతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ గ్రూప్-ఏ, గ్రూప్-బీ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ ప్రతి ఏటా ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశ ప్రిలిమ్స్ కాగా, రెండో దశలో మెయిన్స్ పరీక్ష, చివరిగా మూడో దశలో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఉంటాయి.

యూపీఎస్సీ ప్రిలిమ్స్​ ఫలితాల పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

యూపీఎస్సీ సీఎస్​ఈ ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది పద్ధతిని అనుసరించవచ్చు:

  • మొదట యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో పైన కనిపించే 'Examination' (ఎగ్జామినేషన్) ట్యాబ్‌పై క్లిక్ చేసి, అందులో 'Active Examinations' (యాక్టివ్ ఎగ్జామినేషన్స్) ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించే వివిధ పరీక్షల జాబితాలో 'Civil Services (Preliminary) Examination, 2026' లింక్‌ను వెతకండి.
  • అక్కడ అప్‌లోడ్ చేసిన పత్రాల జాబితాలో 'Written Result' (లిఖితపూర్వక ఫలితాలు) అనే ఆప్షన్ పక్కన ఒక పీడీఎఫ్ ఫైల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ఫలితాల పీడీఎఫ్ ఓపెన్ అయిన తర్వాత.. కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌లో చూసేవారైతే Ctrl+F షార్ట్‌కట్ కీని ఉపయోగించి మీ రోల్ నంబర్‌ను టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు.
  • మొబైల్‌లో చూసేవారైతే పీడీఎఫ్ ఓపెన్ చేయగానే పైన కనిపించే సెర్చ్ బార్ (లెన్స్ ఐకాన్) లో మీ రోల్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షకు ఎంపికైన వారి నంబర్లు ఈ లిస్టులో హైలైట్ అవుతాయి.

మెయిన్స్ అభ్యర్థులకు యూపీఎస్సీ కీలక ఆదేశాలు..

ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి, తమ వివరాలను అప్‌డేట్ చేయడానికి కమిషన్ ప్రత్యేక విండోను అందుబాటులోకి తెస్తోంది. మెయిన్స్ పరీక్ష ఫీజుగా అభ్యర్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మహిళలు, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

వీటితో పాటు మెయిన్స్ పరీక్ష రాయడానికి సహాయకుడి (స్క్రైబ్) వివరాలు, అసిస్టివ్ పరికరాలు లేదా పెద్ద ఫాంట్ ఉన్న ప్రశ్నపత్రం (దివ్యాంగుల కోసం) కావాలా అనే సమాచారాన్ని కూడా అభ్యర్థులు అప్‌డేట్ చేయాలి. అలాగే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష 2026 కోసం తమ కేడర్ ప్రాధాన్యతలను కూడా ఇక్కడే నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈ వివరాలను నమోదు చేయడానికి జూన్ 19 నుంచి జూన్ 28 వరకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ అందుబాటులో ఉంటుంది.

"ఫిబ్రవరి 4, 2026 నాటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిబంధనల ప్రకారం.. ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులందరూ నిర్ణీత గడువులోగా అధికారిక పోర్టల్ (https://upsconline.nic.in) లోకి లాగిన్ అయి, తమ వివరాలను అప్‌డేట్ లేదా రీ-కన్‌ఫర్మ్ చేసుకోవడం తప్పనిసరి. ఆ తర్వాతే అప్లికేషన్ ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. అప్పుడే కమిషన్ వారికి ఈ-అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారిని తదుపరి పరీక్షలకు అనుమతించబోము," అని యూపీఎస్సీ స్పష్టం చేసింది.

ఇప్పటికే అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఎలాంటి మార్పులు లేని అభ్యర్థులు కూడా ఒకసారి పోర్టల్‌లోకి లాగిన్ అయి, తమ వివరాలను వెరిఫై చేసుకున్న తర్వాతే ఫామ్ సబ్మిట్ చేయాలని, అప్పుడే మెయిన్స్ హాల్ టికెట్ జనరేట్ అవుతుందని కమిషన్ వివరించింది.

కటాఫ్ మార్కులు, కీ ఎప్పుడు విడుదలవుతాయి?

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2026కు సంబంధించిన అభ్యర్థుల మార్కులు, కటాఫ్ మార్కులు, అఫీషియల్ ఆన్సర్ కీలను ఇప్పుడే విడుదల చేయరు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 ప్రక్రియలు పూర్తిగా ముగిసి, తుది ఫలితాలు వెల్లడైన తర్వాతే వీటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని యూపీఎస్సీ స్పష్టం చేసింది.

ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా స్పష్టత కావాలంటే కమిషన్ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య 011-40303444 లేదా 24041001 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని కమిషన్ ప్రకటనలో తెలిపింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More