...
...
Next Story

Recruitment reforms : యూపీఎస్సీ, ఎస్​ఎస్సీ రిక్రూట్​మెంట్​లో భారీ సంస్కరణలు- ఇక వేగంగా ఉద్యోగాల భర్తి..

యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ నియామక ప్రక్రియలను మరిన్ని పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు కేంద్రం సంస్కరణలు చేపట్టింది. నియామకాల గడువు తగ్గించడంతో పాటు ఏఐ వెరిఫికేషన్, డిజిటల్ విధానాలను అందుబాటులోకి తెచ్చినట్లు రాజ్యసభలో కేంద్రం ప్రకటించింది.

Published on: Aug 1, 2026, 05:45:43 IST
Advertisement

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్సీ) ద్వారా చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది! ఈ పరీక్షల్లో మరింత పారదర్శకత, భద్రత, వేగం పెంచేందుకు అనేక పరిపాలనా, సాంకేతిక సంస్కరణలు చేపట్టినట్లు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గురువారం రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

యూపీఎస్సీ, ఎస్​ఎస్సీ రిక్రూట్​మెంట్​ సంస్కరణలు..
యూపీఎస్సీ, ఎస్​ఎస్సీ రిక్రూట్​మెంట్​ సంస్కరణలు..

నియామక ప్రక్రియలో ఆలస్యాన్ని నివారించి, కమిషన్ల పట్ల అభ్యర్థులకు నమ్మకాన్ని పెంచడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. గ్రూప్-బీ (నాన్ గెజిటెడ్), గ్రూప్-సీ పోస్టులకు ఇంటర్వ్యూలను తొలగించడం వల్ల ఎంపిక ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, వేగంగా సాగుతోందన్నారు.

ఎస్‌ఎస్సీలో తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణలు..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో భద్రతను, పారదర్శకతను పెంచేందుకు సమగ్ర సాంకేతిక మార్పులు అమలు చేశారు.

తగ్గిన నోటిఫికేషన్ గడువు: గతంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేసరికి 15 నుంచి 18 నెలల సమయం పట్టేది. ఇప్పుడు పరీక్షల దశలను కుదించి, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) ప్రవేశపెట్టడం వల్ల ఈ సమయాన్ని 6 నుంచి 8 నెలలకు తగ్గించారు.

ఈ-డోసియర్ వ్యవస్థ: సర్టిఫికెట్ల సమర్పణ సురక్షితంగా, వేగంగా జరగడానికి ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు.

మెరిట్‌కు ప్రాధాన్యం: మెరిట్ ఆధారంగా పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం 'స్లైడింగ్ మెకానిజం' తీసుకొచ్చారు. దీనివల్ల ఏ ఒక్క ఖాళీ కూడా వృథా కాదు.

ఆన్సర్ కీ, మార్కులు ఆన్‌లైన్‌లో: తాత్కాలిక, తుది ఆన్సర్ కీలను విడుదల చేయడం, అభ్యంతరాల రుసుమును తగ్గించడం, అభ్యర్థుల మార్కులను ఆన్‌లైన్‌లో ప్రదర్శించడం ద్వారా పారదర్శకత పెంచారు.

యూపీఎస్సీలో ఏఐ టెక్నాలజీ, కొత్త సదుపాయాలు..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తనిఖీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అభ్యర్థులు ఎన్నిసార్లు హాజరయ్యారనే వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఏఐ ఆధారిత తనిఖీ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.

ఫోటో, ఫేస్ అథెంటికేషన్: ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా ఉండేందుకు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని అమల్లోకి తెచ్చారు.

మోడ్యులర్ అప్లికేషన్ పోర్టల్: దరఖాస్తు ప్రక్రియను అత్యంత సరళంగా మార్చారు.

దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయం: దివ్యాంగులు కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా కేటాయించేలా సదుపాయం కల్పించడంతో పాటు, పరీక్షా కేంద్రాల సంఖ్యను విస్తరించారు. సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఇవే కాకుండా, సెల్ఫ్ అటెస్టేషన్ ఆధారంగా ప్రొవిజనల్ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి, ఆరు నెలల వ్యవధిలో కుల, ప్రవర్తనా ధృవీకరణ పత్రాలను పరిశీలించే వెసులుబాటు కల్పించామని మంత్రి తెలిపారు. మిషన్ మోడ్‌లో ఖాళీల భర్తీ చేపడుతూ, 'రాష్ట్రీయ రోజ్‌గార్ మేళా' ద్వారా ఇప్పటికే లక్షలాది మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని రాజ్యసభకు వివరించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe