...
...
Next Story

H-1B, L-1 వీసా పొడిగింపు రుసుము పెంపు: ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్

అమెరికాలో హెచ్-1బీ, ఎల్-1 వీసాల పొడిగింపు ప్రక్రియపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఫీజులను పెంచింది. 50 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలు ఇకపై ప్రతి పొడిగింపు పిటిషన్‌కు వేల డాలర్ల అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Published on: Aug 10, 2026, 20:45:59 IST
Advertisement

అమెరికాలో స్థిరపడి ఉద్యోగాలు కొనసాగించాలని భావిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వీసాల పొడిగింపు పిటిషన్లపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) నిబంధనలను సవరించింది. ఒకే కంపెనీలో పనిచేస్తూ వీసా కాలపరిమితిని పొడిగించుకునే ఉద్యోగులకు కూడా ఇకపై అదనపు రుసుములు వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఫీజుల మోత ఎవరికి? ఎంత పడుతుంది?

H-1B, L-1 వీసా పొడిగింపు రుసుము పెంపు: ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్
H-1B, L-1 వీసా పొడిగింపు రుసుము పెంపు: ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్

హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన తుది ఉత్తర్వుల ప్రకారం, అర్హత కలిగిన ప్రతి హెచ్-1బీ పొడిగింపు పిటిషన్‌కు $4,000 (సుమారు రూ. 3.35 లక్షలు), ప్రతి ఎల్-1 పొడిగింపు పిటిషన్‌కు $4,500 (సుమారు రూ. 3.77 లక్షలు) అదనంగా చెల్లించాలి. అయితే ఈ భారం అమెరికాలోని అన్ని కంపెనీలపైనా పడదు.

అమెరికాలో కనీసం 50 మంది ఉద్యోగులు ఉండి, వారి మొత్తం సిబ్బందిలో 50 శాతానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులే ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రధానంగా భారతీయ ఐటీ దిగ్గజాలు, గ్లోబల్ టెక్ కన్సల్టింగ్ సంస్థలు ఈ పరిధిలోకి వస్తాయి.

9/11 బయోమెట్రిక్ ఫీజు విస్తరణ

గతంలో ఈ 9/11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజును కేవలం కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు లేదా కంపెనీ మారినప్పుడు మాత్రమే వసూలు చేసేవారు. ఒకే కంపెనీలో కొనసాగుతూ వీసా వ్యవధిని పెంచుకునే పిటిషన్లకు దీని నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఇప్పుడు డీహెచ్‌ఎస్ ఈ మినహాయింపును తొలగించింది.

"చట్టబద్ధమైన నిబంధనల అంతర్లీన అర్థాన్ని సరిచేస్తూ ఈ సవరణ చేశాం. అర్హత కలిగిన కంపెనీలు వీసా పొడిగింపు పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు 9/11 బయోమెట్రిక్ ఫీజును కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది" అని DHS తన ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ అదనపు రుసుమును కేవలం యాజమాన్యాలే (Employers) చెల్లించాలని, ఉద్యోగుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని డీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. ఒకవేళ కంపెనీలు చెల్లించడానికి వెనుకాడితే ఉద్యోగులే స్వయంగా ఆ డబ్బు కట్టవచ్చా అన్న ప్రతిపాదనను కూడా డీహెచ్‌ఎస్ తోసిపుచ్చింది.

యాజమాన్యాలు ఈ ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుంటే, అది పరోక్షంగా భారతీయ నిపుణులపై ప్రభావం చూపుతుంది. వీసాలను తరచుగా పొడిగించడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారితే, కంపెనీలు విదేశీ ఉద్యోగులను కొనసాగించడానికి వెనుకాడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రీన్ కార్డ్ నిరీక్షణలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్న వారికి ఇది మరొక సవాలుగా మారనుంది.

అయితే ఈ ఆందోళనలను డీహెచ్‌ఎస్ కొట్టిపారేసింది. ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు, ఇతర వ్యయాలతో పోలిస్తే ఈ ఫీజు చాలా స్వల్పమైనదని పేర్కొంది. దశాబ్ద కాలంగా హెచ్-1బీ వీసాలకు ఉన్న డిమాండ్ వార్షిక కోటాను మించిపోతోందని, కాబట్టి ఈ నిబంధన వల్ల విదేశీ నిపుణుల నియామకాలు ఏమాత్రం తగ్గవని అభిప్రాయపడింది.

భారతీయులపై పడే ప్రభావం ఎంత?

అమెరికా ఏటా మంజూరు చేసే సుమారు 85,000 హెచ్-1బీ వీసాల్లో ఏకంగా 70 శాతం భారతీయ నిపుణులకే దక్కుతున్నాయి. అదే సమయంలో దాదాపు 10 లక్షల మంది భారతీయులు ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకుని వేచి చూస్తున్నారు.

ఈ నిబంధన నిర్దిష్ట దేశస్తులను లక్ష్యంగా చేసుకుని తెచ్చింది కాదని DHS స్పష్టం చేసింది. బయోమెట్రిక్ ఫీజు నిబంధనలను అమెరికన్ కాంగ్రెస్ రూపొందించిందని, గ్రీన్ కార్డ్ దరఖాస్తులతో ఈ సవరణకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఆమోదంలో ఉన్న వీసాలు కలిగిన ఉద్యోగులకు తక్షణమే ఎలాంటి ముప్పు లేదు. అయితే కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులను దీర్ఘకాలం కొనసాగించాలంటే మున్ముందు ఈ అదనపు వ్యయాన్ని భరించక తప్పదు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe