...
...
Next Story

US Iran war : శాంతి ఒప్పందం కుదిరింది.. హర్ముజ్ జలసంధి తెరుచుకుంది : ట్రంప్

US Iran peace deal : ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది! ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. హర్ముజ్ జలసంధిని తక్షణమే తెరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Published on: Jun 15, 2026, 05:21:46 IST
Advertisement

Strait of Hormuz : ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించే విధంగా ఒక సంచలన అప్‌డేట్ వచ్చింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం ముగిసిపోయినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (హర్ముజ్ జలసంధి) ని తక్షణమే పునఃప్రారంభిస్తున్నట్లు, అలాగే ఇరాన్‌పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

ఈ మేరకు తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫారమ్‌లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో కుదిరిన ఈ శాంతి ఒప్పందం ఇప్పుడు పూర్తిగా విజయవంతమైందని పేర్కొంటూ, ఇందులో భాగస్వాములైన అన్ని పక్షాలకు ఆయన అభినందనలు తెలిపారు.

"ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం ఇప్పుడే పూర్తయింది. అందరికీ నా అభినందనలు! హర్ముజ్ జలసంధి గుండా ఎలాంటి సుంకాలు లేకుండా ఓడల రాకపోకలను నేను పూర్తిగా అనుమతిస్తున్నాను. అదే సమయంలో ఇరాన్‌పై ఉన్న యునైటెడ్ స్టేట్స్ నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే రద్దు చేయడానికి ఆదేశాలు ఇస్తున్నాను. ప్రపంచ దేశాల ఓడలారా.. మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి. చమురు ప్రవాహాన్ని రానివ్వండి!" అని డోనాల్డ్ ట్రంప్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో..

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్.. ఈ ఒప్పందాన్ని ధృవీకరించిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

"తీవ్రమైన చర్చల తర్వాత, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా- ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో సైనిక కార్యకలాపాలను తక్షణమే. శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి," అని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

ప్రపంచ చమురు వ్యాపారంలో 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' అత్యంత కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం ముడి చమురు, సహజ వాయువులో ఐదో వంతు కేవలం ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే రవాణా అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్ ఈ కీలకమైన జలసంధిని మూసివేసింది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో పాకిస్థాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో.. అమెరికా స్పందించి ఇరాన్ నౌకాశ్రయాలపై పూర్తి నౌకాదళ దిగ్బంధనాన్ని ప్రకటించింది.

యుద్ధం కారణంగా ఈ మార్గం మూతపడటంతో అంతర్జాతీయంగా చమురు రవాణా ఖర్చులు పెరిగి, భారత్ సహా పలు దేశాల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఈ జలసంధి మళ్లీ తెరుచుకుంటోందని ట్రంప్ చెప్పడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరా పుంజుకుని, ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే, ప్రపంచంలోని అన్ని దేశాల వాణిజ్య ఓడలకు ఈ మార్గం పూర్తిగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe