US Iran War: ఒకవైపు శాంతి చర్చలు- మరోవైపు బాంబుల వర్షం! ఇరాన్​కు ట్రంప్ సీరియస్ వార్నింగ్..

Strait of Hormuz Crisis : ఇరాన్​పై అమెరికా మళ్లీ దాడి చేసింది! ఈసారి దక్షిణ ఇరాన్​లోని బోట్లు, మిసైల్ లాంచ్​ కేంద్రాలను టార్గెట్​ చేసుకుంది. ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.

Published on: May 26, 2026, 11:19:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

US Iran war news : అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మూడు నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఒకవైపు ఖతార్ రాజధాని దోహాలో హై-లెవల్ శాంతి చర్చలు జరుగుతుండగానే.. మరోవైపు ఉద్రిక్తతలు ఒక్కసారిగా ముదిరాయి. దక్షిణ ఇరాన్‌లోని మిసైల్ లాంచ్ కేంద్రాలతో పాటు, మైన్లు (సముద్రపు బాంబులు) అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ సైనిక బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం సరికొత్త వైమానిక దాడులకు తెగబడింది. 'ఆత్మరక్షణ' కోసమే తాము ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు నిల్వలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్..

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఏప్రిల్ 8 నుంచి తాత్కాలిక సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) కొనసాగుతున్నప్పటికీ, తాజా దాడులు ఆ ఒప్పందాన్ని ప్రమాదంలోకి నెట్టాయి. గ్లోబల్ ఎనర్జీ సప్లైకి అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' జలమార్గం సమీపంలో ఈ ఘర్షణ చోటుచేసుకోవడం మరింత ఆందోళనకర విషయం.

ఈ అంతర్జాతీయ సంక్షోభానికి సంబంధించిన తాజా పరిణామాలను ఇక్కడ తెలుసుకోండి..

1. బందర్ అబ్బాస్ నౌకా స్థావరంపై అమెరికా దాడి

యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి టిమ్ హాకిన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ దళాల నుంచి తమ సైన్యానికి పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికే ఈ దాడులు జరిగాయి.

లక్ష్యాలు: దక్షిణ ఇరాన్‌లోని కీలక ఓడరేవు నగరం, ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరమైన ‘బందర్ అబ్బాస్’ సమీపంలో అమెరికా విరుచుకుపడింది. అక్కడ ఇరాన్ క్షిపణి లాంచ్ సైట్లను ధ్వంసం చేయడంతో పాటు, జలమార్గంలో మైన్లు అమర్చడానికి చూస్తున్న బోట్లను అడ్డుకుంది.

ఇరాన్ స్పందన: బందర్ అబ్బాస్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ సైన్యం (ఐఆర్​జీసీ) ధృవీకరించింది. శతృదేశాల దాడులను తిప్పికొట్టడానికి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యాయని పేర్కొంది.

2. ఇరాన్ వెనక్కి తగ్గేదే లేదు: సుప్రీం కౌన్సిల్ లీడర్ ఖరారు

ఒకవైపు చర్చలు జరుగుతున్నా, ఇరాన్ కొత్త హార్డ్-లైనర్ నేత, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లీడర్ మహ్మద్ బాగేర్ జోల్గాద్ర్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్‌లపై తమ పోరాటంలో "వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు. తమ సాహసోపేతమైన నిరోధకత ద్వారా శత్రువును ఇప్పటికే మోకాళ్లపైకి తెచ్చామని ఆయన వ్యాఖ్యానించారు.

3. దోహాలో శాంతి చర్చలు - ట్రంప్ 'యురేనియం' కండిషన్!

ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దోల్నాసర్ హెమ్మతిలు దోహాలో ఖతార్ ప్రధానితో కలిసి అమెరికాతో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌ను తిరిగి తెరవడం, ఫ్రీజ్ అయిన ఇరాన్ నిధుల విడుదలపై చర్చలు జరుగుతున్నా, ఇప్పుడప్పుడే ఒప్పందం కుదిరేలా లేదని ఇరాన్ ప్రతినిధులు తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వార్నింగ్..

దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌కు డెడ్‌లైన్ విధించారు. "ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఎన్‌రిచ్డ్ యురేనియం (అణు ఇంధనం) ను వెంటనే అమెరికాకు అప్పగించి నాశనం చేయాలి, లేదా అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ సమక్షంలో ఇరాన్‌లోనే దానిని పూర్తిగా ధ్వంసం చేయాలి," అని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇది 'గ్రేట్ డీల్' అయినా కావాలి లేదా అసలు ఒప్పందమే ఉండదని ట్రంప్ హెచ్చరించారు.

అంతేకాకుండా మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించే ‘అబ్రహం అకార్డ్స్’ ఒప్పందంపై సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా సంతకం చేయడం తప్పనిసరి అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు తాము ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోబోమని సౌదీ, ఖతార్ దేశాలు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. అటు పాకిస్థాన్ కూడా దీనిని వ్యతిరేకిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More