ఇరాన్‌పై అమెరికా ప్రతికార దాడులు: ఎయిర్ డిఫెన్స్, టెలికాం టవర్లు ధ్వంసం
అంతర్జాతీయ జలాల్లో తమ డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్‌పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఇరాన్‌లోని వ్యూహాత్మక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, టెలికాం టవర్లపై క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ఒక్కసారిగా రాజుకున్నాయి. తమ నిఘా డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్‌పై అమెరికా కన్నెర్ర చేసింది. శని, ఆదివారాల్లో ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై అమెరికా వాయుసేన ప్రతికార దాడులు (Self-defence strikes) జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాటు ఒక టెలికాం టవర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అమెరికాకు చెందిన 'ఎమ్‌క్యూ-1' (MQ-1) నిఘా డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తుండగా ఇరాన్ కూల్చివేయడమే ఈ తాజా ఘర్షణకు కారణమైంది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దాడులను ధృవీకరించింది. ఇరాన్ దూకుడుకు సమాధానంగానే గోరుక్, ఖేష్మ్ దీవుల్లోని డ్రోన్ నియంత్రణ కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో అమెరికా సైనికులెవరికీ ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేసింది.
"కాల్పుల విరమణ అమలులో ఉన్న సమయంలో ఇరాన్ సాగించిన అకారణ దూకుడుకు సమాధానంగా.. అమెరికా ఆస్తులను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి సెంట్‌కామ్ నిరంతరం పనిచేస్తుంది" అని అమెరికా సైనిక విభాగం స్పష్టం చేసింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతిస్పందన
మరోవైపు, ఇరాన్ సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చింది. అమెరికా డ్రోన్ తమ ప్రాంతీయ వైమానిక పరిధిలోకి ప్రవేశించిందని, శత్రుత్వ చర్యలకు పాల్పడే ఉద్దేశంతోనే అది వచ్చిందని, అందుకే దానిని కూల్చివేసినట్లు సమర్థించుకుంది.
సిరిక్ దీవిలోని తమ టెలికాం టవర్‌పై అమెరికా జరిపిన దాడికి ప్రతికారంగా.. అమెరికాకు చెందిన ఒక కీలక వైమానిక స్థావరాన్ని తాము కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ సోమవారం ప్రకటించింది. అయితే ఆ స్థావరం ఎక్కడ ఉందనేది ఇరాన్ వెల్లడించలేదు. అమెరికా గనుక మరోసారి సైనిక చర్యకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమ తదుపరి ప్రతిస్పందన పూర్తిగా భిన్నమైన రీతిలో ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
కాల్పుల విరమణ ఉన్నప్పటికీ..
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ అంతర్గతంగా విభేదాలు సమసిపోలేదు. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరింది. శాశ్వత శాంతి కోసం చర్చలు సాగుతున్న తరుణంలోనే ఈ వైమానిక దాడులు జరిగాయి.
తమపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన బిలియన్ల కొద్దీ డాలర్ల చమురు ఆదాయాన్ని విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీనికి అమెరికా అంగీకరించకపోవడంతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


