...
...
Next Story

US flights grounded : అమెరికాలో తీవ్ర కలకలం- టేకాఫ్ అవ్వని వేలాది విమానాలు.. 9/11 తర్వాత రెండోసారి!

సాంకేతిక లోపంతో అమెరికా గగనతలం ఒక్కసారిగా స్తంభించిపోయింది. నాలుగు గంటలకు పైగా దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను నిలిపివేయడంతో వేలాది సర్వీసులు నిలిచిపోయాయి. 9/11 దాడుల తర్వాత ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Published on: Nov 14, 2026, 08:20:17 IST
Advertisement

అమెరికా విమానయాన రంగంలో శుక్రవారం పెను సంక్షోభం తలెత్తింది. ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రాల్లో ఏర్పడిన కమ్యూనికేషన్ లోపం కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్​ఏఏ) నాలుగు గంటలకు పైగా నిలిపివేసింది. 2001లో జరిగిన 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేయడం ఇది రెండోసారి మాత్రమే కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.

అమెరికాలో ఎగరని వేలాది విమానాలు.. (Bloomberg)
అమెరికాలో ఎగరని వేలాది విమానాలు.. (Bloomberg)

అనేక గంటల తర్వాత ఈ నిషేధాన్ని ఎఫ్ఏఏ ఎత్తివేసినప్పటికీ, దీని ప్రభావం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

న్యూయార్క్, చికాగో, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల నుంచి భారత్‌కు రావాల్సిన కనెక్టింగ్ విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాశారు. విమానాల రాకపోకలను పర్యవేక్షించే ‘ఫ్లైట్‌అవేర్’ గణాంకాల ప్రకారం.. ఈ సాంకేతిక అంతరాయం వల్ల 10,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడవగా, మరో 4,000 సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి.

అసలు ఏం జరిగింది? ఎల్3హారిస్ నెట్‌వర్క్‌లో లోపం!

ప్రాంతీయ ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో తలెత్తిన "అసాధారణ పరిస్థితుల" వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. అనేక ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలపై కమ్యూనికేషన్ సమస్య ప్రభావం చూపిందని రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలిక టెలికమ్యూనికేషన్ అంతరాయం కారణంగా విమానాలను నిలిపివేశామని ఎఫ్ఏఏ వివరించింది.

'వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం ప్రకారం, ‘ఎల్3హారిస్ టెక్నాలజీస్’ పర్యవేక్షించే టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో ఈ లోపం తలెత్తింది. పైలట్లతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మాట్లాడే కీలకమైన రేడియో ఫ్రీక్వెన్సీలను ఈ నెట్‌వర్క్ నిర్వహిస్తుంది. అయితే గాలిలో ఎగురుతున్న విమానాల మధ్య సురక్షిత దూరాన్ని పర్యవేక్షించే రాడార్ ఫీడ్స్‌పై ఈ అంతరాయం ప్రభావం పడిందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఉగ్రదాడి కోణం ఉందా? హోంల్యాండ్ సెక్యూరిటీ ఏం చెప్పిందంటే?

"ఇది మాపై జరిగిన దురుద్దేశపూరిత దాడి అని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక టెలికమ్యూనికేషన్ అంతరాయం మాత్రమే," అని ముల్లిన్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే దర్యాప్తులో ఏ కోణాన్నీ కొట్టిపారేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.

విమానాశ్రయాల్లో గందరగోళం.. వారాంతపు ప్రయాణాలపై దెబ్బ

ఎఫ్ఏఏ ఆదేశాలతో అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. తదుపరి సమాచారం కోసం వేలాది మంది క్యూలలో నిలబడి ఆందోళనగా ఎదురుచూశారు. ఏవియేషన్ డేటా సంస్థ 'సిరియం' ప్రకారం, ఈ నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత 15 లక్షల మందికి పైగా ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించాల్సి ఉంది.

విమానాల షెడ్యూల్ పూర్తిగా తలకిందులు కావడంతో విమానయాన సంస్థలు వారాంతపు సర్వీసులను సైతం రద్దు చేయడం మొదలుపెట్టాయి. శనివారం ఒక్కరోజే 300కు పైగా విమానాలను రద్దు చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తదుపరి ఏం చేయాలో తెలియక విమాన సిబ్బంది సైతం అయోమయంలో పడ్డారు. ఎఫ్ఏఏ నిషేధం ఎత్తివేసినా, పేరుకుపోయిన రద్దీని క్లియర్ చేసి విమాన రాకపోకలను పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి తీసుకురావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks