Microsoft outage : మైక్రోసాఫ్ట్ సేవలకు తీవ్ర అంతరాయం.. 7 గంటలకు పైగా నిలిచిన అవుట్‌లుక్!
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ 365, అవుట్‌లుక్, టీమ్స్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. ఏడు గంటలకు పైగా సర్వర్లు మొరాయించడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీని ప్రభావం ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ సేవలపైనా పడింది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు శుక్రవారం భారీ అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365, అవుట్‌లుక్, టీమ్స్ సహా పలు కీలక అప్లికేషన్లు ఏడు గంటలకు పైగా మొరాయించడంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఈ సాంకేతిక సంక్షోభం కేవలం మైక్రోసాఫ్ట్ యాప్స్‌కే పరిమితం కాలేదు! మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్లపై ఆధారపడి పనిచేసే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి కృత్రిమ మేధస్సు సేవలపైనా దీని ప్రభావం తీవ్రంగా పడింది.

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా విశాఖపట్నం, బెంగళూరు వంటి ఐటీ కారిడార్లలో నైట్ షిఫ్టులలో పనిచేసే వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ పరిణామంతో అయోమయానికి గురయ్యారు. అమెరికా, యూరప్ క్లయింట్లతో కీలక సమావేశాలు, ఈమెయిల్ కమ్యూనికేషన్ నిలిచిపోవడంతో కార్పొరేట్ కార్యాలయాల్లో పనులకు ఆటంకం కలిగింది.
సాంకేతిక సేవల అంతరాయాలను పర్యవేక్షించే 'డౌన్‌డిటెక్టర్' గణాంకాల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో అవుట్‌లుక్ సమస్యలపై ఏకంగా 1,38,058 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ తర్వాత సంస్థ చేపట్టిన పునరుద్ధరణ చర్యలతో ఉదయం 4.30 గంటల సమయానికి ఫిర్యాదుల సంఖ్య సుమారు 34,490కి తగ్గింది.
సమస్య ఎక్కడ తలెత్తింది? మైక్రోసాఫ్ట్ ఏం చెప్పింది?
శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దెబ్బతిన్న సర్వర్లను పునరుద్ధరించేందుకు తమ ఇంజనీర్లు నిరంతరం శ్రమిస్తున్నారని, వినియోగదారులు తిరిగి కనెక్ట్ అవుతున్న కొద్దీ సేవలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని తెలిపింది. సర్వర్లలో సురక్షిత కనెక్షన్లను ఏర్పాటు చేసే ఒక కీలక ప్రక్రియపై విపరీతమైన భారం పడటమే ఈ అంతరాయానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫలితంగా సర్వర్లు వినియోగదారుల అభ్యర్థనలను స్వీకరించడం నిలిపివేశాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు కాన్ఫిగరేషన్ మార్పులను సిద్ధం చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్‌లో పేర్కొంది. ముందుగా కొన్ని ఎంపిక చేసిన సర్వర్లపై వీటిని పరీక్షించి, ఆ తర్వాత అన్ని సర్వర్లకు విస్తరించడంతో పాటు దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను రీస్టార్ట్ చేస్తున్నారు. అంతరాయం మొదలైన సమయంలో చేసిన ఒక నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ మార్పు వల్లే ఈ సమస్య తలెత్తిందా అన్న కోణంలో దానిని వెనక్కి తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించి, తక్కువ కనెక్షన్లతో సర్వర్లు స్థిరంగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షిస్తూ క్రమంగా ట్రాఫిక్‌ను అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల ఈ సమస్య రాలేదని, ఉన్న ట్రాఫిక్‌ను నిర్వహించడానికి సరిపడా సర్వర్లు అందుబాటులో లేకపోవడమే కారణమని కంపెనీ స్పష్టం చేసింది.
"మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో, ప్రధానంగా ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ (Exchange Online) వినియోగంలో యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మేము గుర్తించాము, వాటిపై దర్యాప్తు చేస్తున్నాము," అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఏయే మైక్రోసాఫ్ట్ యాప్స్‌పై ప్రభావం పడింది?
ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్, ఈమెయిల్ మౌలిక సదుపాయాలపై ఆధారపడిన అనేక సేవలు నిలిచిపోయాయి. వెబ్, డెస్క్‌టాప్, మొబైల్ యాప్స్ ద్వారా అవుట్‌లుక్ మెయిల్ బాక్స్‌లను తెరవడంలో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. ఈమెయిల్స్ చేరడంలో తీవ్ర జాప్యం జరిగింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్‌లో ఇటీవల వాడిన ఫైళ్లు ఓపెన్ కాకపోవడం, అడ్మిన్ సెంటర్‌లో కొన్ని పేజీలు లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.
మైక్రోసాఫ్ట్ కోపైలట్ సేవలకు కూడా అంతరాయం కలిగింది. వెబ్, డెస్క్‌టాప్ యాప్స్‌లో కోపైలట్ చాట్ లోడ్ కాకపోవడం, సమాధానాలు రాకపోవడంతో పాటు ఈమెయిల్స్, క్యాలెండర్లు, ఫైళ్ల వంటి కార్యాలయ డేటాను యాక్సెస్ చేసే సామర్థ్యం దెబ్బతింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో సాధారణ మెసేజింగ్, ఆన్‌లైన్ మీటింగ్స్ యథావిధిగా కొనసాగినప్పటికీ, ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్‌పై ఆధారపడే క్యాలెండర్లు, మీటింగ్ షెడ్యూలింగ్, 'ఇన్ఫర్మేషన్ బారియర్స్' వాడే సంస్థల్లో కొత్త చాట్‌ల ఏర్పాటుకు ఆటంకం కలిగింది.
వీటితో పాటు మైక్రోసాఫ్ట్ ప్లానర్, టు డూ, డిఫెండర్, పర్వ్యూ, గ్రాఫ్, ఫ్యాబ్రిక్, పవర్ బీఐ, షేర్‌పాయింట్ ఆన్‌లైన్, యూనివర్సల్ ప్రింట్, విండోస్ 365 సేవలపైనా ప్రభావం పడింది. విద్యాసంస్థలు వాడే మైక్రోసాఫ్ట్ 365 ఎడ్యుకేషన్ ఫీచర్లైన అసైన్‌మెంట్స్, రీడింగ్ ప్రోగ్రెస్, స్పీకర్ ప్రోగ్రెస్‌తో పాటు కొన్ని మైక్రోసాఫ్ట్ ఇన్‌ట్యూన్ సేవలు మొరాయించాయి. అయితే ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్‌తో సంబంధం లేని ఫీచర్లు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేశాయి.
ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సేవలకూ సెగ.. వ్యాపారాలపై ఎఫెక్ట్
మైక్రోసాఫ్ట్ అంతరాయం దాని సొంత యాప్స్‌కే పరిమితం కాకుండా, దాని మౌలిక సదుపాయాలపై ఆధారపడే థర్డ్-పార్టీ సంస్థలకూ సెగ తగిలింది. మైక్రోసాఫ్ట్ కనెక్టర్లలో తలెత్తిన సమస్య వల్ల కొత్త కనెక్షన్లు ఏర్పడటం లేదని, టూల్స్ సరిగ్గా పనిచేయడం లేదని ఓపెన్ ఏఐ ప్రకటించింది. తమ మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్‌పై అప్‌స్ట్రీమ్ ప్రొవైడర్ సమస్య ప్రభావం చూపిందని ఆంథ్రోపిక్ వెల్లడించింది.
ఈ సాంకేతిక సంక్షోభం కార్పొరేట్ వ్యాపార కార్యకలాపాలను సైతం దెబ్బతీసింది. ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీ సంస్థ ‘వర్క్‌హార్స్ గ్రూప్’ మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా తమ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటనను నవంబర్ 12 నుంచి నవంబర్ 16కు వాయిదా వేసింది. కొన్ని వారాల క్రితమే మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో సాంకేతిక లోపం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమల కార్యకలాపాలు స్తంభించాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఘటన పునరావృతం కావడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో 'మైక్రోసాఫ్ట్ 364' మీమ్స్ జాతర!
ఓవైపు ఉద్యోగులు, వ్యాపార సంస్థలు పనులు ఆగిపోయి ఆందోళన చెందుతుంటే, మరోవైపు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మైక్రోసాఫ్ట్‌పై తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏడాదిలో 365 రోజులు పనిచేయాల్సిన మైక్రోసాఫ్ట్ 365 ఒకరోజు మొరాయించడంతో చలోక్తులు విసిరారు.
"మైక్రోసాఫ్ట్ 364 వచ్చేసింది.. ఇదే మైక్రోసాఫ్ట్ కొత్త ప్రొడక్ట్," అని ఒక నెటిజన్ పోస్ట్ చేశారు. "చట్టపరంగా మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తన పేరును M364గా మార్చుకోవాలి," అని మరొకరు రాశారు.
త్వరలోనే 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6' (జీటీఏ 6) గేమ్ విడుదల కానున్న నేపథ్యంలో, నెటిజన్లు పాత మీమ్ ట్రెండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారు. "జీటీఏ 6 కంటే ముందే మరో మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని చూస్తామని అసలు నమ్మలేకపోతున్నాను," అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేశారు.
ఆధునిక కార్పొరేట్ వ్యవస్థ క్లౌడ్ మౌలిక సదుపాయాలపై ఎంతగా ఆధారపడి ఉందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


