అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనలో మిగిలిన రెండేళ్ల పదవీకాలం ఎలా సాగనుందో తేల్చే కీలక ఘట్టానికి వేదిక సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక మిడ్‌టర్మ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. యూఎస్ కాంగ్రెస్‌లోని ఉభయ సభలపై ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందనే అంశంపైనే ట్రంప్ తన అజెండాను ఎంతవరకు ముందుకెళ్లగలరో ఆధారపడి ఉంది.

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం, దానివల్ల పెరిగిన ఇంధన ధరలు, తీవ్రమైన ద్రవ్యోల్బణ పరిస్థితుల నడుమ జరుగుతున్న ఈ ఎన్నికలు ట్రంప్ ప్రజాదరణకు అతిపెద్ద పరీక్షగా నిలవనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏమిటీ మిడ్‌టర్మ్ ఎన్నికలు?
అమెరికా అధ్యక్షుడి 4 ఏళ్ల పదవీకాలంలో సరిగ్గా సగానికి అంటే రెండేళ్లకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. ఈ పోరులో అధ్యక్ష పదవికి నేరుగా పోటీ ఉండదు. కానీ, పార్లమెంట్ అనదగిన 'యూఎస్ కాంగ్రెస్'లోని రెండు సభలైన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (దిగువ సభ), సెనేట్ (ఎగువ సభ) స్థానాలతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, స్థానిక ప్రతినిధులు, న్యాయమూర్తుల ఎంపికకు ప్రజలు ఓటు వేస్తారు.
యూఎస్ కాంగ్రెస్‌లోని దిగువ సభలో మొత్తం 435 స్థానాలు ఉంటాయి. వీరికి రెండేళ్ల పదవీకాలం ఉంటుంది. అందుకే ప్రతి మిడ్‌టర్మ్ ఎన్నికల్లోనూ 435 స్థానాలకూ ఓటింగ్ జరుగుతుంది. ఇక 100 స్థానాలు ఉండే సెనేట్‌లో సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. సెనేటర్లను మూడు భాగాలుగా విభజించి, ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడో వంతు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 1913లో వచ్చిన 17వ రాజ్యాంగ సవరణ తర్వాత సెనేటర్లను ప్రజలే నేరుగా ఎన్నుకుంటున్నారు.
ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లోనూ అధికార రిపబ్లికన్లదే ఆధిక్యం. సెనేట్‌లో రిపబ్లికన్లకు 53 స్థానాలు ఉండగా, డెమొక్రాట్లకు 47 స్థానాలు (డెమొక్రాట్లకు మద్దతిచ్చే ఇద్దరు ఇండిపెండెంట్లతో కలిపి) ఉన్నాయి. దిగువ సభ అయిన హౌస్‌లో రిపబ్లికన్లకు 218 స్థానాలు, డెమొక్రాట్లకు 214 స్థానాలు ఉన్నాయి.
ఈ ఎన్నికలు ఎందుకంత కీలకం?
{{/usCountry}}ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లోనూ అధికార రిపబ్లికన్లదే ఆధిక్యం. సెనేట్‌లో రిపబ్లికన్లకు 53 స్థానాలు ఉండగా, డెమొక్రాట్లకు 47 స్థానాలు (డెమొక్రాట్లకు మద్దతిచ్చే ఇద్దరు ఇండిపెండెంట్లతో కలిపి) ఉన్నాయి. దిగువ సభ అయిన హౌస్‌లో రిపబ్లికన్లకు 218 స్థానాలు, డెమొక్రాట్లకు 214 స్థానాలు ఉన్నాయి.
ఈ ఎన్నికలు ఎందుకంత కీలకం?
{{/usCountry}}అమెరికా పాలనా వ్యవస్థలో అధ్యక్షుడు అధ్యక్ష పీఠంపై ఉన్నప్పటికీ, చట్టాలు చేయడం, బడ్జెట్ ఆమోదించడం, కీలక పదవుల నియామకాలకు ఆమోదం తెలపడం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ అధ్యక్షుడి సొంత పార్టీ గనుక కాంగ్రెస్‌లో మెజారిటీ కోల్పోతే, కొత్త చట్టాలు చేయడం లేదా బడ్జెట్ పాస్ చేయడం అత్యంత సంక్లిష్టంగా మారుతుంది. అందుకే ఈ ఎన్నికలను సిట్టింగ్ అధ్యక్షుడి పనితీరుపై జరిగే 'రెఫరెండం'గా పరిగణిస్తారు.
భారత్‌లోని లోక్‌సభను ఐదేళ్ల కాల పరిమితికంటే ముందే రద్దు చేసే అవకాశం ఉన్నట్లు అమెరికా కాంగ్రెస్‌ను రద్దు చేయడం సాధ్యపడదు. ఫెడరల్ చట్టం ప్రకారం ప్రతి సరి సంవత్సరంలో నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే ఈ ఎన్నికలు జరుగుతాయి.
ఈసారి ఎన్ని స్థానాలకు పోటీ?
సాధారణ షెడ్యూల్ ప్రకారం సెనేట్‌లోని 100 స్థానాలకు గాను 33 స్థానాలకు ఈసారి ఎన్నికలు జరగాలి. కానీ ఫ్లోరిడా, ఓహియో రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా తోడవడంతో మొత్తం 35 సెనేట్ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.
ఫ్లోరిడా నుంచి 2022లో ఎన్నికైన రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో 2025 జనవరిలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో గవర్నర్ రాన్ డిసాంటిస్ అప్పటి అటార్నీ జనరల్ యాష్లే మూడీని తాత్కాలికంగా నియమించారు. అలాగే ఓహియో సెనేటర్‌గా ఉన్న జేడీ వేన్స్ 2025 జనవరిలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో, అక్కడి గవర్నర్ మైక్ డెవైన్ జెడి హస్టెడ్ను నియమించారు. ఇప్పుడు ఈ ఇద్దరు తాత్కాలిక సభ్యులు తమ స్థానాలను నిలబెట్టుకుంటారో లేదో ప్రజల తీర్పు తేల్చనుంది. వీటితో పాటు దిగువ సభలోని మొత్తం 435 స్థానాలకూ పోలింగ్ జరుగుతోంది.
ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది?
అమెరికా ఎలక్షన్ అసిస్టెన్స్ కమిషన్ (ఈఏసీ) మార్గదర్శకాల ప్రకారం ఓటర్లు మూడు పద్ధతుల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఎలక్షన్ డే నేరుగా ఓటింగ్: అత్యంత సాంప్రదాయక పద్ధతి. పోలింగ్ కేంద్రానికి వెళ్లి నేరుగా ఓటు వేయవచ్చు.
అడ్వాన్స్ ఇన్-పర్సన్ ఓటింగ్ (ఈఆర్లీ ఓటింగ్): కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల తేదీకి ముందే నిర్ణీత కేంద్రాలకు వెళ్లి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది.
మెయిల్-ఇన్ ఓటింగ్ (తపాలా ఓటు): ఓటర్లు పోస్టు ద్వారా ఓటు పంపవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఎలాంటి కారణం చెప్పకుండానే మెయిల్ ఓటు కోరవచ్చు. మరికొన్ని రాష్ట్రాల్లో అనారోగ్యం, మిలిటరీ సేవలు, దూర ప్రాంతాల్లో ఉండటం వంటి నిరూపణలు తప్పనిసరి.
ఫలితాలు ఎప్పుడు తెలుస్తాయి?
పోలింగ్ పూర్తయిన వెంటనే లెక్కించే ఓట్ల వివరాలు ప్రాథమిక సమాచారం మాత్రమే. మెయిల్-ఇన్ ఓట్లు, ప్రావిజనల్ ఓట్లు, విదేశాల్లో ఉండే సైనిక బలగాల ఓట్ల లెక్కింపునకు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉంటాయి. అన్ని ఓట్లను లెక్కించి, తనిఖీలు (ఆడిట్) పూర్తి చేసిన తర్వాతే అధికారిక ఫలితాలను ధ్రువీకరిస్తారు. దీనికి కొన్ని రోజులు లేదా వారాల సమయం పట్టవచ్చు.
సిట్టింగ్ అధ్యక్షుడికి గండమేనా?
"అమెరికా ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీకి మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం దశాబ్దాలుగా వస్తున్న ఒక క్రమబద్ధమైన ఆనవాయితీ. అధ్యక్షుడు రెండో విడత పదవీకాలంలో ఉన్నప్పుడు ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది" అని ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు నేట్ సిల్వర్ పేర్కొన్నారు.
1934 నుంచి 2018 మధ్య జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో కేవలం మూడు సార్లు మాత్రమే అధ్యక్షుడి పార్టీ దిగువ సభలో అదనపు స్థానాలను సాధించగలిగింది. 1998లో బిల్ క్లింటన్ హయాంలో మోనికా లెవిన్స్కీ స్కాండల్ నడుస్తున్నప్పటికీ డెమొక్రాట్లు బలాన్ని పెంచుకోగా, 2002లో 9/11 దాడి తర్వాత జార్జ్ డబ్ల్యూ బుష్ పట్ల ప్రజానుకూల ట్రెండ్ ఏర్పడటంతో రిపబ్లికన్లు హౌస్‌లో 8, సెనేట్‌లో 2 సీట్లు అదనంగా గెలుచుకున్నారు.
సామాన్యుల జీవితాలపై ప్రభావం ఏమిటి?
కాంగ్రెస్‌లో అధ్యక్షుడి పార్టీ మెజారిటీ కోల్పోతే రాజకీయ వివాదాలు తీవ్రమవుతాయి. బడ్జెట్ ఆమోదం పొందక ప్రభుత్వ యంత్రాంగం నిలిచిపోయే ప్రమాదం (గవర్నమెంట్ షట్ డౌన్) ఏర్పడుతుంది. ఉద్యోగులకు జీతాలు ఆగిపోవడం, నిత్యావసర సేవల్లో జాప్యం జరగడం వంటి చిక్కులు వస్తాయి. ఆరోగ్య సంరక్షణ, పన్నులు, వలసల చట్టాలు మూలనపడతాయి. దాంతో అధ్యక్షుడు శాసనసభతో సంబంధం లేకుండా 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు' జారీ చేయాల్సి వస్తుంది.
భారత లోక్‌సభ ఎన్నికలతో తేడా ఏమిటి?
భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు కేంద్రంలో ఏ ప్రభుత్వం కొలువుదీరాలో నిర్ణయిస్తాయి. సభలో మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం కూలిపోతుంది. 1999 ఏప్రిల్ 17న అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షలో ఓడిపోయి పడిపోయిన ఉదాహరణ మనకు తెలిసిందే. అలాగే 2004 ఫిబ్రవరి 6న అప్పటి ప్రధాని వాజ్‌పేయీ సూచన మేరకు రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం లోక్‌సభను గడువు కంటే 8 నెలల ముందే రద్దు చేశారు.
అయితే అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించలేవు. కాంగ్రెస్‌లో మెజారిటీ పోయినా అధ్యక్షుడు పూర్తి నాలుగు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేస్తారు. కాకపోతే ఆయన శాసన నిర్ణయాధికారాల పరిధి బాగా తగ్గిపోతుంది.