అమెరికా మధ్యంతర ఎన్నికలు 2026: ట్రంప్ అధికారానికి ఎందుకు ముప్పు ఏర్పడుతోంది?
అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగుతుందా లేదా డెమోక్రాట్లు పైచేయి సాధిస్తారా అనేది ఈ ఎన్నికల్లో తేలనుంది.
నవంబర్ 3న అమెరికా వ్యాప్తంగా మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మూడో వంతు సెనేట్ స్థానాలకు, ప్రతినిధుల సభ (House of Representatives) లోని అన్ని స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఫలితాలు వైట్ హౌస్‌లో ఎవరు కూర్చుంటారనేది తేల్చకపోయినా, రాబోయే రెండేళ్లపాటు ట్రంప్ నిర్ణయాలకు చట్టసభల మద్దతు లభిస్తుందా లేదా అనేది మాత్రం ఈ ఎన్నికల ద్వారానే స్పష్టమవుతుంది.
ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభల్లో రిపబ్లికన్లకే మెజారిటీ ఉంది. అయితే, ఈ ఆధిపత్యాన్ని వారు నిలబెట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోందని బ్రిటిష్ థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్‌కు చెందిన బ్రూస్ స్టోక్స్ విశ్లేషించారు. ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ రికార్డు స్థాయిలో పడిపోవడం, ఇరాన్ యుద్ధం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై ఓటర్లలో అసంతృప్తి పెరగడమే రిపబ్లికన్ల అవకాశాలను దెబ్బతీస్తోందని ఆయన తన కథనంలో పేర్కొన్నారు.
"చట్టసభల్లో కనీసం ప్రతినిధుల సభనైనా డెమోక్రాట్లు తమ గుప్పెట్లోకి తీసుకునే అవకాశం ఉంది" అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లు స్టోక్స్ తెలిపారు.
అమెరికా కాంగ్రెస్ పాత్ర ఏంటి?
అమెరికాలో ప్రతి నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. కానీ మధ్యంతర ఎన్నికలు ప్రతి రెండేళ్లకోసారి వస్తాయి. ఈ ఏడాది నవంబర్ 3న జరగనున్న ఎన్నికలు అమెరికా ప్రభుత్వంలో చట్టాలు చేసే కాంగ్రెస్‌కు సంబంధించినవి. ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, సెనేట్‌లోని మూడోవంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
అమెరికా ప్రభుత్వంలో చట్టసభలు కీలక పాత్ర పోషిస్తాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించే అధికారం కాంగ్రెస్‌కు ఉంటుంది. చట్టాలు చేయడం, యుద్ధాన్ని ప్రకటించడం వంటి అత్యంత కీలకమైన అధికారాలు చట్టసభల చేతుల్లోనే ఉంటాయి. అందుకే మెజారిటీ సాధించిన పార్టీకే ఇక్కడ పూర్తి పట్టు లభిస్తుంది. కాంగ్రెస్‌లో బలాబలాలు మారితే అధ్యక్షుడి పాలనపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఈసారి ఎన్నికలు ఎందుకు కీలకం?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మధ్యంతర ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌తో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధ ప్రభావం వాషింగ్టన్‌తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపైనా పడింది.
"యుద్ధం వల్ల అమెరికాకు ఎలాంటి నష్టం జరగదు" అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఎన్ని స్థానాలకు పోలింగ్?
ప్రతినిధుల సభ సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. కాబట్టి అందులోని 435 స్థానాలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి ప్రతినిధుల సంఖ్యను నిర్ణయిస్తారు.
సెనేటర్ల పదవీకాలం ఆరేళ్లు. కాబట్టి సెనేట్‌లోని 100 స్థానాల్లో మూడో వంతు, అంటే 35 స్థానాలకు మాత్రమే ఈసారి పోలింగ్ జరగనుంది. ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు ఉంటారు. ఒకే రాష్ట్రానికి చెందిన ఇద్దరు సెనేటర్లకు ఒకే ఏడాది ఎన్నికలు రాకుండా జాగ్రత్తపడతారు.
చరిత్ర ఏం చెబుతోంది?
మధ్యంతర ఎన్నికల్లో తమ విజయావకాశాలపై డెమోక్రాట్లు ఉత్సాహంగా ఉండగా, రిపబ్లికన్లలో మాత్రం కాస్త ఆందోళన కనిపిస్తోందని సీబీఎస్ (CBS) న్యూస్ నివేదించింది. 1930ల నుంచి జరిగిన ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, అధికార పార్టీకే కాంగ్రెస్‌లో ఎక్కువ స్థానాలు గల్లంతయ్యాయి.
అయితే బిల్ క్లింటన్ (1998), జార్జ్ డబ్ల్యూ బుష్ (2002) హయాంలో మాత్రమే అధికార పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. అప్పట్లో ఆ ఇద్దరు అధ్యక్షులకు ప్రజల్లో భారీ మద్దతు ఉండటమే దానికి కారణం. ప్రస్తుతం ట్రంప్ రేటింగ్స్ చూస్తుంటే రిపబ్లికన్లకు అది ఏమాత్రం శుభవార్త కాదు.
ఎవరికి ఎన్ని స్థానాలు కావాలి?
435 స్థానాలున్న ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ ఉంది. కమిటీ చైర్మన్లను నియమించే, చట్టాలను రూపొందించే ఈ సభను తమ అధీనంలోకి తీసుకోవాలంటే డెమోక్రాట్లకు కనీసం 218 స్థానాలు అవసరం కాగా, ప్రస్తుతం వారి బలం 212గా ఉంది.
కేవలం 21 స్థానాల్లో మాత్రమే గట్టి పోటీ ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తుండగా, డెమోక్రాట్లు 220 నుంచి 230 స్థానాలు గెలుచుకుని సునాయాసంగా మెజారిటీ సాధిస్తారని చాథమ్ హౌస్ నివేదిక పేర్కొంది.
"ప్రస్తుతం తమకున్న స్థానాలను నిలబెట్టుకుంటే, ప్రతినిధుల సభను కైవసం చేసుకోవడానికి డెమోక్రాట్లకు మరో నాలుగు స్థానాలు చాలు," అని సీబీఎస్ నివేదించింది. సెనేట్‌లో పట్టు సాధించాలన్నా రిపబ్లికన్ల చేతుల్లో ఉన్న నాలుగు రాష్ట్రాలను డెమోక్రాట్లు గెలుచుకోవాలి. అయితే సెనేట్ స్థానాలకు రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించాల్సి ఉన్నందున ఇది ప్రతినిధుల సభ కంటే కష్టమైన పనే.
"ఈసారి ఎన్నికలు జరుగుతున్న 35 సెనేట్ స్థానాల్లో 10 కంటే తక్కువ స్థానాల్లో మాత్రమే హోరాహోరీ పోరు నెలకొంది" అని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నట్లు సీబీఎస్ తెలిపింది. నార్త్ కరోలినా, మైనే రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఓహియో, అలాస్కా, అయోవా, టెక్సాస్ రాష్ట్రాల్లోనూ సెనేట్ స్థానాలను నిలబెట్టుకోవడం వారికి సవాలుగా మారింది. మరోవైపు మిచిగాన్, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రాల్లో డెమోక్రాట్లకు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.
ట్రంప్ పరిస్థితి ఏంటి?
మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పేరు బ్యాలెట్‌లో లేకపోయినప్పటికీ, ఆయనను పక్కనపెట్టి ఎన్నికలను ఊహించలేం. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వే ప్రకారం ట్రంప్ ప్రజాదరణ 37 శాతానికి పడిపోయింది. 1990 తర్వాత మధ్యంతర ఎన్నికల ముందు అత్యల్ప రేటింగ్ పొందిన అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. 61 శాతం మంది ఓటర్లు ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు.
1950 తర్వాత, 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్ కు మాత్రమే 40 శాతం కంటే తక్కువ (37 శాతం) రేటింగ్ వచ్చింది. ఆ ఏడాది రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో 30, సెనేట్‌లో 6 స్థానాలను కోల్పోయారు. ప్రజాదరణ తగ్గినప్పటికీ, గట్టి పోటీ ఉన్న స్థానాల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానని ట్రంప్ ప్రకటించారు. కానీ, కొంతమంది అభ్యర్థులు మాత్రం ట్రంప్‌ను తమ ప్రచారానికి దూరంగా ఉంచాలని వైట్ హౌస్‌ను రహస్యంగా కోరుతున్నట్లు పొలిటికో వెల్లడించింది.
ఓటర్లకు ముఖ్యమైన అంశాలేంటి?
ప్రస్తుతం ఓటర్లను ప్రధానంగా వేధిస్తున్న సమస్య జీవన వ్యయం పెరగడమేనని పలు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు, ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల పెరిగిన నిత్యావసరాల ధరలే ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా మారాయి.
అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే మధ్యంతర ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. "ఎన్నికల రోజున తమ ఓటర్లను బూత్‌లకు రప్పించడంలో ఏ పార్టీ ముందుంటుందో వారిదే అంతిమ విజయం" అని బ్రూస్ స్టోక్స్ విశ్లేషించారు. ట్రంప్ ప్రాబల్యాన్ని తగ్గించాలన్న కసితో డెమోక్రాట్లు పని చేస్తుండగా, కాంగ్రెస్ డెమోక్రాట్ల చేతికి వెళితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే భయాన్ని కల్పించడం ద్వారా ఓట్లు రాబట్టాలని రిపబ్లికన్లు ప్రచారం చేస్తున్నారు.
ట్రంప్ ముందున్న సవాళ్లు
కాంగ్రెస్‌పై పట్టు: ప్రస్తుతం కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ రిపబ్లికన్ల మెజారిటీతో ట్రంప్ పాలన సాగుతోంది. ఈ మెజారిటీని నిలబెట్టుకుంటే ఆయన అనుకున్న చట్టాలను సులభంగా ఆమోదించుకోవచ్చు. ఏ ఒక్క సభలో మెజారిటీ కోల్పోయినా ఆయనకు కష్టాలు తప్పవు.
చట్టాల ఆమోదం: పన్నులు, ప్రభుత్వ నిధులు, రుణ పరిమితి వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ నిర్ణయమే ఫైనల్. ప్రతినిధుల సభ డెమోక్రాట్ల చేతుల్లోకి వెళితే, కొత్త పన్నులు, వ్యయానికి సంబంధించిన రిపబ్లికన్ల నిర్ణయాలను వారు అడ్డుకోవచ్చు.
దర్యాప్తులు: ప్రతినిధుల సభను డెమోక్రాట్లు కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ కమిటీల ద్వారా ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది.
సెనేట్ అధికారాలు: ట్రంప్ నామినేట్ చేసే న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల నియామకాలకు సెనేట్ ఆమోదం తప్పనిసరి.
నిధుల కేటాయింపు: ప్రభుత్వ వ్యయంపై ప్రతినిధుల సభదే ఆధిపత్యం. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వ నిధులు, రుణ పరిమితుల పెంపుపై రెండు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ జరిగే అవకాశం ఉంది.
రిపబ్లికన్లు ఓడిపోతే ట్రంప్‌ను గద్దె దించుతారా?
ఈ ఎన్నికల్లో ట్రంప్ పేరు బ్యాలెట్‌లో లేదు. ఒకవేళ కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు ఓడిపోయినంత మాత్రాన ట్రంప్ అధ్యక్ష పదవికి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ ప్రతినిధుల సభను డెమోక్రాట్లు కైవసం చేసుకుంటే, ఆయనపై విచారణ జరిపే అధికారం దక్కుతుంది. అవసరమైతే ట్రంప్‌పై అభిశంసన (Impeachment) తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా వారికి ఉంటుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


