...
...
Next Story

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు రద్దు: ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

అమెరికా ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్‌లను ట్రంప్ యంత్రాంగం ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేసింది. కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

Updated on: Aug 26, 2026, 07:35:19 IST
Advertisement

అమెరికాలో స్థిరపడాలనుకునే ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులు, అపాయింట్‌మెంట్‌లను తాత్కాలికంగా రద్దు చేసింది. విదేశాంగ శాఖ చేపట్టిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త నిబంధనలపై అధికారులకు శిక్షణ

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు రద్దు: ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం (File)
అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు రద్దు: ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం (File)

ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసే క్రమంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించింది. అమెరికా ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం ఉన్న (Public Charge) దరఖాస్తుదారులను ప్రాథమిక దశలోనే గుర్తించి నిరోధించడానికి కాన్సులర్ అధికారులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీ అధికారులు ప్రతీ వీసా అపాయింట్‌మెంట్‌ను మరింత నిశితంగా, ఒకే విధమైన ప్రామాణికతతో పరిశీలించేలా ఈ గ్లోబల్ ట్రైనింగ్ ప్లాన్ చేశారు.

గ్లోబల్ ట్రైనింగ్ సాకుతో రద్దు

ఈ శిక్షణా కార్యక్రమం దృష్ట్యా ఇప్పటికే ఖరారైన ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు దరఖాస్తుదారులకు ఈమెయిళ్లు అందుతున్నాయి. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంబసీలలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ప్రారంభించాం. అధికారుల శిక్షణ కోసం వీసా సేవల అపాయింట్‌మెంట్‌లలో మార్పులు చేస్తున్నాం" అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది. అయితే, ఈ శిక్షణ ఎంతకాలం సాగుతుంది, రీషెడ్యూల్ చేసిన అపాయింట్‌మెంట్‌లు మళ్లీ ఎప్పుడు కేటాయిస్తారనే దానిపై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు.

ఇమిగ్రేషన్‌పై ట్రంప్ సర్కార్ కఠిన వైఖరి

ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చట్టబద్ధ, అక్రమ ఇమిగ్రేషన్ రెండింటిపైనా తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. అమెరికా ఆర్థిక వనరులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విదేశీయులు ఆధారపడకుండా నిరోధించడమే లక్ష్యంగా నిబంధనలు సవరిస్తున్నారు. విమాన టికెట్లు, ఇంటర్వ్యూ ప్లాన్లు సిద్ధం చేసుకున్న వేలాది మంది వీసా అభ్యర్థులు ఈ ఆకస్మిక నిర్ణయంతో తీవ్ర గందరగోళంలో పడ్డారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe