ట్రంప్​ మరో సంచలన నిర్ణయం.. H-1B వీసా లాటరీ వ్యవస్థ రద్దు

అమెరికాలోని డొనాల్డ్​ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్​-1బీ లాటరీ వ్యవస్థను రద్దు చేసి.. నైపుణ్యం, అత్యధిక వేతనం ప్రాతిపదికన వీసాలు కేటాయించాలని నిర్ణయించింది.

Published on: Dec 24, 2025, 06:48:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్కీలకు డొనాల్డ్​ ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. హెచ్-1బీ వర్క్ వీసాల ఎంపికలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న 'లాటరీ' విధానాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో అభ్యర్థుల నైపుణ్యం, వారికి చెల్లించే వేతనం ఆధారంగా వీసాలను కేటాయించే కొత్త నిబంధనలను ప్రవేశపెడుతున్నట్టు మంగళవారం స్పష్టం చేసింది.

హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థను రద్దు చేసిన ట్రంప్​! (AP)
హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థను రద్దు చేసిన ట్రంప్​! (AP)

హెచ్​-1బీ వీసా- అధిక నైపుణ్యానికే ప్రాధాన్యం..

"అత్యున్నత నైపుణ్యాలు ఉండి, ఎక్కువ వేతనం పొందే విదేశీ కార్మికులకే హెచ్​-1బీ వీసాల కేటాయింపులో ఇక నుంచి ప్రాధాన్యత ఇస్తాం," అని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్​ఎస్​) మంగళవారం ప్రకటించింది. అమెరికన్ కార్మికుల వేతనాలను, వారి పని పరిస్థితులను, ఉద్యోగ అవకాశాలను కాపాడటమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది.

హెచ్​-1బీ వీసా- ఎప్పటి నుంచి అమలు?

ఈ కొత్త నిబంధనలు 2026, ఫిబ్రవరి 27 నుంచి అమలులోకి రానున్నాయి. 2027ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ల నుంచి ఈ మార్పులు వర్తిస్తాయి. ప్ర

ప్రస్తుతం ఏటా 65,000 సాధారణ వీసాలు, అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారికి అదనంగా మరో 20,000 వీసాలను జారీ చేస్తున్నారు.

హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థను తొలగించేందుకు యోచిస్తున్నట్టు డీహెచ్​ఎస్​ గత సెప్టెంబర్​లోనే హింట్​ ఇచ్చింది! ఈ మేరకు ఒక ప్రతిపాదన చేసింది. ఫిడ్​బ్యాక్​ కోసం ఈ ప్రతిపాదనను పబ్లిక్​ డొమైన్​లో ఉంచుంది. ఫిడ్​బ్యాక్​ ఆధారంగా హెచ్​-1బీ లాటరీ వ్యవస్థను తొలగించి, జీతం ఆధారిత విధానాన్ని తీసుకొస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

హెచ్​-1బీ లాటరీ విధానంపై విమర్శలు..

ప్రస్తుతం ఉన్న 'రాండమ్ సెలక్షన్' (లాటరీ) పద్ధతి వల్ల అనేక మంది యజమానులు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. "తక్కువ నైపుణ్యం ఉన్న విదేశీయులను కూడా తక్కువ జీతాలకే తీసుకువచ్చి అమెరికా శ్రామిక శక్తికి నష్టం కలిగిస్తున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకే 'వెయిటెడ్ సెలక్షన్' విధానాన్ని తెస్తున్నాం," అని అధికారులు పేర్కొన్నారు.

అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్​సీఐఎస్​) ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న విధానాన్ని అమెరికన్ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని విమర్శించారు. "అమెరికన్ కార్మికులకు చెల్లించాల్సిన దానికంటే తక్కువ వేతనానికే విదేశీయులను దిగుమతి చేసుకుంటున్నారు. కొత్త విధానం వల్ల అమెరికా కంపెనీలు అధిక నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే తీసుకోవడానికి ఆసక్తి చూపుతాయి. ఇది అమెరికా పోటీతత్వాన్ని మరింత పెంచుతుంది," అని ఆయన వివరించారు.

హెచ్​-1బీ వీసా ప్రోగ్రామ్​కి సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చి, అమెరికన్లను- అమెరికా వ్యాపారులను రక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కఠినంగా హెచ్​-1బీ నిబంధనలు..

అమెరికాలో ఉద్యోగం కోసం భారతీయులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులకు జీవనాధారంగా ఉన్న హెచ్​-1బీ వీసా వ్యవస్థలో ట్రంప్​ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే వీసా ఫీజును ఏకంగా 100,000 డాలర్ల (సుమారు రూ. 84లక్షలు)కు పెంచేసి షాక్​ ఇచ్చింది!

ఇప్పుడు ఏకంగా హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థేకే స్వస్తి పలికేసింది ట్రంప్​ ప్రభుత్వం.

ట్రంప్​ కొత్త ప్రకటనలు, నిబంధనలు అమెరికాలోని అనేక కంపెనీలను, ముఖ్యంగా టెక్​ రంగంలో సంస్థలను, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి, కేవలం అదృష్టం మీద ఆధారపడి అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇకపై నిరాశే ఎదురుకానుంది! అత్యున్నత ప్రతిభ, భారీ జీతం ఆఫర్ ఉన్న వారికి మాత్రమే అగ్రరాజ్యం తలుపులు తెరవనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More