ఇంటర్వ్యూల రద్దుతో భారత్‌లో హెచ్-1బీ వీసాదారుల పడిగాపులు! నెలల తరబడి నిరీక్షణ తప్పదా?
కఠినమైన సోషల్ మీడియా తనిఖీల పేరుతో ఇండియాలో అనేక హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా రాయబార కార్యాలయం రద్దు చేసింది. వీసా రెన్యువల్ కోసం ఇండియాకు వచ్చిన వారిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అనేక నెలలు ఇండియాలోనే ఉండిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
భారతదేశంలోని వేలాది మంది హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు అమెరికా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది! ఈ డిసెంబర్ నెలలో జరగాల్సిన వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా రద్దు చేస్తూ, వాటిని ఏకంగా కొన్ని నెలల పాటు వాయిదా వేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన కఠినమైన 'బ్యాక్‌గ్రౌండ్ చెక్', 'సోషల్ మీడియా స్క్రీనింగ్' నిబంధనల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 15 తర్వాత అపాయింట్‌మెంట్‌లు ఉన్న వారు ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీరిలో కొందరికి ఏకంగా అక్టోబర్ 2026 నాటి తేదీలను రీషెడ్యూల్ చేయడం గమనార్హం!
ఈ విషయంపై భారత్‌లోని అమెరికా ఎంబసీ ఇప్పటికే దరఖాస్తుదారులను హెచ్చరించింది.
"మీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయినట్లు మీకు మెయిల్ వస్తే, కొత్త తేదీన మాత్రమే రావాలి. పాత తేదీ ప్రకారం ఎంబసీ లేదా కన్సులేట్‌కు వస్తే లోపలికి అనుమతించము," అని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది.
చిక్కుల్లో ఐటీ ఉద్యోగులు..!
హెచ్-1బీ వీసా రెన్యువల్లో కోసం స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో, ఈ ఇంటర్వ్యూల కోసం ఇప్పటికే అమెరికా నుంచి భారత్ చేరుకున్న వందలాది మంది ఐటీ నిపుణులు ఇప్పుడు ఇక్కడే చిక్కుకుపోయారు. వారి వద్ద చెల్లుబాటు అయ్యే వీసా స్టాంపింగ్ లేకపోవడంతో తిరిగి అమెరికా వెళ్లి తమ ఉద్యోగాల్లో చేరడం సాధ్యం కావడం లేదు.
కేవలం హెచ్-1బీ మాత్రమే కాకుండా ఇతర వీసా కేటగిరీల ఇంటర్వ్యూలను కూడా సోషల్ మీడియా ప్రొఫైల్స్ తనిఖీ పేరుతో వాయిదా వేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఎంతమంది ప్రభావితం అయ్యారు? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
న్యాయ నిపుణులు ఏమంటున్నారు?
"ప్రస్తుతం వీసా స్టాంపింగ్ ప్రక్రియ ఒక గందరగోళంగా మారింది. ముందస్తు సమాచారం లేకుండా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసి, నెలల తరబడి వాయిదా వేయడం వల్ల వ్యాపార సంస్థలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు," అని హ్యూస్టన్‌కు చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ అసహనం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వలస విధానాల్లో భాగంగా హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులు, ప్రొఫైల్‌లను ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్సీఐఎస్) గణాంకాల ప్రకారం, మొత్తం హెచ్-1బీ అప్లికేషన్లలో భారతీయుల వాటానే 71 శాతం ఉంటుంది. కాబట్టి ఈ తాజా నిర్ణయం భారతీయ టెక్కీలపై పెను ప్రభావం చూపనుంది.
మరోవైపు, సెప్టెంబర్ నెలలో ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వుల ప్రకారం, హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా ఒక లక్ష డాలర్లకు (సుమారు రూ. 84 లక్షలు) పెంచడం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది.
గూగుల్ హెచ్చరికలు..
తాజా పరిణామాల మధ్య టెక్ దిగ్గజం గూగుల్ తమ హెచ్-1బీ వీసా ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలను మానుకోవాలని, లేదా నెలల తరబడి దేశం బయటే ఉండే ప్రమాదం ఉందని పేర్కొంది.
గూగుల్ సంస్థ ప్రతియేటా వేల సంఖ్యల్లో హెచ్-1బీ వీసా వర్కర్లను నియమించుకుంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


