US Green Card : అమెరికాలోని భారత ఐటీ ఉద్యోగులకు కోలుకోలేని షాక్! గ్రీన్ కార్డ్ ప్రాసెస్ రద్దు..

అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడానికి ఉద్దేశించిన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలను అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే నెపంతో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Published on: Oct 9, 2026, 05:43:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అమెరికాలో స్థిరపడాలని, గ్రీన్ కార్డ్ సాధించాలని కలలుకనే లక్షలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది! హెచ్-1బీ వీసాదారులకు గ్రీన్ కార్డ్ మంజూరు చేయడానికి ప్రాథమిక దశ అయిన 'పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్' (పీఈఆర్​ఎం) నుంచి ప్రధాన ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థలను అమెరికా కార్మిక శాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

గ్రీన్ కార్డ్ ప్రాసెస్ రద్దు..
గ్రీన్ కార్డ్ ప్రాసెస్ రద్దు..

ఈ ఆంక్షల జాబితాలో భారతీయ ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్​లతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్, కాప్‌జెమినీ వంటి అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి.

అమెరికన్ల ఉద్యోగాలు లాక్కుంటున్నారన్న అభియోగం!

అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. యాంటీ ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ అధిపతి, దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో కీత్ మాట్లాడారు.

"ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, కాప్‌జెమినీలను పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాము," అని కీత్ సోండర్లింగ్ స్పష్టం చేశారు. ఈ కంపెనీలకు సంబంధించిన కొత్త దరఖాస్తులను స్వీకరించబోమని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా తక్షణమే నిలిపివేస్తున్నామని వెల్లడించారు.

2009 నుంచి ఈ కంపెనీలు దాదాపు 30 లక్షల మంది విదేశీ కార్మికుల కోసం దరఖాస్తు చేశాయని, వీటి ద్వారా 2,30,000 కంటే ఎక్కువ హెచ్-1బీ వీసా ఆమోదాలు, లక్షకు పైగా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్లు పొందాయని కీత్ వివరించారు. ఈ కంపెనీల తీరు వల్ల లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.

వీసా మిల్లులు, బానిస వ్యవస్థ: విరుచుకుపడిన వైస్ ప్రెసిడెంట్

టెక్ దిగ్గజాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్. వ్యవస్థను ఎక్కువగా దుర్వినియోగం చేసిన సంస్థ మైక్రోసాఫ్ట్ అని విమర్శించారు.

"అర్హులైన అమెరికన్ ఉద్యోగులు దొరకడం లేదని సర్టిఫై చేసిన మైక్రోసాఫ్ట్, 2025లో 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. కానీ అదే సమయంలో 6,000 కంటే ఎక్కువ హెచ్-1బీ వీసాలకు ఆమోదం పొందింది. అంతేకాకుండా, తొలగించిన అమెరికన్ ఉద్యోగుల హోదాల కోసమే దాదాపు 1,000 దరఖాస్తులతో సహా మొత్తం 3,682 పీఈఆర్​ఎం అప్లికేషన్లను దాఖలు చేసింది," అని జేడీ వ్యాన్స్ విమర్శించారు.

కంపెనీలు చిన్న చిన్న పట్టణాల్లోని పత్రికల్లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి, అభ్యర్థులు స్పందించలేదనే సాకుతో అమెరికన్లను తొలగించి విదేశీయులను నియమించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. హెచ్-1బీ వీసాపై వచ్చే విదేశీ కార్మికులను "ఆధునిక బానిసలు"గా అభివర్ణించిన ఆయన, వీసా ప్రోగ్రామ్‌లను నడిపే కంపెనీలను "వీసా మిల్లులు" అని తీవ్రంగా నిందించారు.

విశ్వవిద్యాలయాల్లో జే-1 వీసాల ద్వారా రీసెర్చ్ స్కాలర్లను తీసుకొచ్చి అమెరికన్ పరిశోధకుల వేతనాలను తగ్గిస్తున్నారని కూడా వ్యాన్స్ వ్యాఖ్యానించారు.

నానాటికీ కఠినంగా ట్రంప్ విధివిధానాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో స్థానిక అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించే లక్ష్యంతో వలస విధానాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గత నెలలోనే హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ఏకంగా లక్ష డాలర్ల (రూ. 96 లక్షలకు పైగా) రుసుము విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను మరో ఏడాది పొడిగించారు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేయడం భారతీయ టెక్కీల భవిష్యత్తును మరింత అనిశ్చితిలోకి నెట్టివేసింది.

నాస్కామ్ స్పందన..

అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై భారత ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ (NASSCOM) స్పందించింది. భారతీయ ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని గత కొన్నేళ్లుగా గణనీయంగా తగ్గించుకున్నాయని తెలిపింది.

"నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కదలికను, వలస విధానాలను ఒకే కోణంలో చూడకూడదు. అమెరికాలో తాత్కాలిక నైపుణ్య కొరతను తీర్చడంలో హెచ్-1బీ వీసాలు ఎప్పటికప్పుడు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. అయితే, భారతీయ ఐటీ సంస్థలు అమెరికాలోనే స్థానిక నియామకాలను పెంచుతూ బలమైన దేశీయ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించాయి. ఇవి ఫార్చ్యూన్ 500 కంపెనీల వృద్ధికి తోడ్పడుతూ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి," అని నాస్కామ్ తమ ప్రకటనలో వివరించింది.

తెలుగు టెక్కీలపై పడే ప్రభావం..

అమెరికాలో హెచ్-1బీ వీసాలు పొందే వారిలో సింహభాగం భారతీయులే. అందులోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు ఇంజనీర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ వల్ల దశాబ్దాల తరబడి నిరీక్షిస్తున్న తెలుగు, భారత టెక్కీలకు ఈ కొత్త ఆంక్షలు పెద్ద ప్రతిబంధకంగా మారనున్నాయి. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిచిపోతే ఉద్యోగాలు మారడం, పిల్లల నివాస అర్హతలు కాపాడుకోవడం మరింత సంక్లిష్టంగా మారనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More