...
...
Next Story

ట్రంప్ ఎఫెక్ట్- విదేశీ విద్యార్థులు లేక అల్లాడిపోతున్న యూఎస్ వర్సిటీలు! భారీగా పడిపోయిన ఆదాయం..

వీసా జాప్యం, కఠిన ఇమ్మిగ్రేషన్ నిబంధనల వల్ల అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల దరఖాస్తులు 50 శాతానికి పైగా తగ్గిపోయినట్లు అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ) సర్వే వెల్లడించింది. అనేక వర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Published on: Sep 20, 2026, 07:30:34 IST
Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుతో అక్కడి విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది! 2026 విద్యా సంవత్సరానికి గాను తమ వద్దకు వచ్చే విదేశీ విద్యార్థుల దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయని 50 శాతానికి పైగా అమెరికన్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్పష్టం చేశాయి. వీసా ప్రాసెసింగ్ జాప్యం, వీసాల నిరాకరణ, అమెరికా ప్రభుత్వం విధించిన కఠిన ఇమ్మిగ్రేషన్ నిబంధనలే ఇందుకు ప్రధాన కారణాలని విద్యావేత్తలు చెబుతున్నారు.

వర్సిటీల రాబడికి గండి.. బడ్జెట్లలో కోతలు!

తీవ్రంగా దెబ్బతింటున్న అమెరికా విద్యా వ్యవస్థ!
తీవ్రంగా దెబ్బతింటున్న అమెరికా విద్యా వ్యవస్థ!

అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ) నిర్వహించిన 'ఫాల్ టర్మ్ పల్స్ పాయింట్' సర్వేలో ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి. అమెరికాలోని 328 మంది ఉన్నత విద్యా సంస్థల అధిపతుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు, వీసా రద్దుల వల్ల దాదాపు 63 శాతం మంది వర్సిటీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల తమ రాబడి దెబ్బతిందని 73 శాతం వర్సిటీల ప్రెసిడెంట్లు వెల్లడించారు.

ఆదాయం తగ్గడంతో 23 శాతం కళాశాలలు పరిశోధనలు, విద్యార్థుల సహాయక కార్యక్రమాల బడ్జెట్లను తగ్గించుకున్నాయి. మరికొన్ని చోట్ల 9 శాతం కోర్సులను మూసివేయడం లేదా ఇతర కోర్సులతో విలీనం చేయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. 11 శాతం విద్యాసంస్థల్లో ఆర్థిక సాయం (ఫైనాన్షియల్ ఎయిడ్) పరిమాణం తగ్గించేశారు.

కఠినమవుతున్న వీసా నిబంధనలు..

గతంలో లాగా అమెరికా వీసా దక్కించుకోవడం ఇప్పుడు అంత సులువుగా లేదు. వీసా ఇంటర్వ్యూ స్లాట్లు లభించడంలో ఆలస్యం కావడం, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ పేరిట నెలల తరబడి వేచి చూడాల్సి రావడం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది. దీనికి తోడు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఎఫ్‌-1 వీసా విద్యార్థుల నివాస కాలంపై పరిమితులు విధించే ప్రతిపాదనలు మరింత భయాన్ని పెంచుతున్నాయి.

మన దేశం నుంచి అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు సైతం అధిక సంఖ్యలో ఉంటారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి స్టెమ్ కోర్సుల కోసం లక్షల రూపాయల రుణాలు తీసుకుని విద్యార్థులు అమెరికా బాట పడుతున్నారు.

అయితే వీసాలు ఆలస్యం కావడం వల్ల సెమిస్టర్లు రీషెడ్యూల్ చేసుకోవడం, ఒకవేళ వీసా నిరాకరణకు గురైతే తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టలేక కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. దానితో చాలామంది విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. జర్మనీ, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి దేశాలు తక్కువ ఖర్చుతో కూడిన విద్యను, సరళమైన వీసా విధానాలను అందిస్తుండటంతో అటువైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది.

వర్సిటీ ప్రవేశం దక్కినా తీరని భయం!

అమెరికా విశ్వవిద్యాలయం నుంచి ఐ-20 ఫామ్ సాధించినంత మాత్రాన ప్రయాణం ఖాయమైనట్లు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీసా అపాయింట్‌మెంట్ దొరకడం నుంచి వీసా స్టాంపింగ్ పూర్తికావడం వరకు ప్రతి దశలోనూ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థలు కూడా ఈ అనిశ్చితిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. రాబోయే రోజుల్లో వీసా విధానాలు సరళంగా మారకపోతే అమెరికా తన గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ హోదాను కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks