Real Estate : మధ్యతరగతి ప్రజలకు షాక్- ఇండియాలో 5.4లక్షల ఇళ్ల డెలివరీ ఆలస్యం! యుద్ధం తెచ్చిన తంట..
Bengaluru Real Estate : భారతదేశంలోని టాప్ 7 నగరాల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 5.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ముడిసరుకుల ధరలు పెరిగి, ఇళ్ల డెలివరీ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని అనరాక్ నివేదిక వెల్లడించింది. ఇది మధ్యతరగతి ప్రజలపై ప్రభావాన్ని చూపించనుంది.
సొంత ఇల్లు కొనుక్కుని, ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లోకి అడుగుపెడదామా అని ఎదురుచూస్తున్న మధ్యతరగతి ప్రజలకు అంతర్జాతీయ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి! ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ.. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా వాటి డెలివరీలు ఆలస్యమైపోతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

దేశంలోని ప్రముఖ ఏడు నగరాల్లో ఈ ఏడాది (2026).. రికార్డు బ్రేక్ చేస్తూ ఏకంగా 5.4 లక్షల నివాస గృహాల నిర్మాణం పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. గత పదేళ్లల్లో హౌసింగ్ రంగంలో ఇదే అత్యంత భారీ డెలివరీ కావడం విశేషం. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయంగా నడుస్తున్న అమెరికా-ఇరాన్ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ఈ ఇళ్ల డెలివరీలు బ్రేకులు పడేలా ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, విదేశాల నుంచి రావాల్సిన సరుకుల సరఫరాలో అంతరాయాలు, నిర్మాణ రంగ ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం కష్టంగా మారే ప్రమాదం ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ తన తాజా నివేదికలో హెచ్చరించింది.
ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా సిద్ధమవుతున్న మొత్తం ఇళ్లలో కేవలం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె వంటి పశ్చిమ భారత మార్కెట్లలోనే అత్యధికంగా 57శాతం ఇళ్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం 2021, 2023 సంవత్సరాల మధ్య కాలంలో ప్రారంభమై, ప్రస్తుతం నిర్మాణ చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులే కావడం గమనార్హం.
యుద్ధం వల్ల ఎందుకు ఆలస్యం కావచ్చు?
సుదీర్ఘంగా సాగుతున్న ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలతో పాటు రవాణా (ఫ్రైట్) ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల నిర్మాణ రంగానికి అత్యంత కీలకమైన ఉక్కు (స్టీల్), అల్యూమినియం, రాగి (కాపర్), ఎలక్ట్రికల్ పరికరాలు, బిల్డింగ్ సిస్టమ్స్ వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరిగిపోతాయి. ఈ అదనపు ధరల భారం ప్రాజెక్టుల ఆర్థిక బడ్జెట్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా బిల్డర్ల లాభాలు తగ్గడమే కాకుండా, అనుకున్న సమయానికి ఇళ్లను కస్టమర్లకు అప్పగించడం (డెలివరీ టైమ్‌లైన్స్) కష్టతరంగా మారుతుంది.
ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు ఇళ్ల అప్పగింతకు (హ్యాండోవర్) దగ్గరగా ఉండటం వల్ల బిల్డర్లు ఈ ధరల హెచ్చుతగ్గుల ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇళ్ల నిర్మాణ పనులు అనుకున్నట్టే సాగుతున్నప్పటికీ, యుద్ధం గనుక మరింత కాలం సాగితే మాత్రం పనుల్లో వేగం తగ్గి, ఇళ్ల డెలివరీ ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
పశ్చిమాసియా యుద్ధం వల్ల సరుకుల సరఫరా గొలుసు దెబ్బతిని, 2026లో హౌసింగ్ రంగం తీవ్ర పరీక్షను ఎదుర్కోబోతోంది. గతంలో కరోనా మహమ్మారి వచ్చిన 2020 సంవత్సరంలో కూడా ఇలాగే జరిగింది. అప్పట్లో షెడ్యూల్ ప్రకారం 4.66 లక్షల ఇళ్లు పూర్తి కావాల్సి ఉండగా, లాక్‌డౌన్ల వల్ల కేవలం 2.14 లక్షల ఇళ్లు (46 శాతం) మాత్రమే డెలివరీ అయ్యాయి. ఆనాటి సంక్షోభాన్ని ఈ తాజా నివేదిక మరోసారి గుర్తుచేసింది.
ముంబై, పుణె, బెంగళూరులపైనే ఎక్కువ ప్రభావం?
2026లో పూర్తి కావాల్సిన మొత్తం ఇళ్లలో ముంబై, పుణె, బెంగళూరు నగరాల వాటానే ఏకంగా 70 శాతంగా ఉంది. కాబట్టి ఒకవేళ ఇబ్బందులు ఎదురైతే ఈ నగరాల్లోనే ప్రాజెక్టుల పూర్తి ఆలస్యం కావచ్చు. ఇక దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ఈ ఏడాది కేవలం 39,000 ఇళ్లు మాత్రమే పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా, గతేడాది (2025)లో దేశంలోని టాప్ 7 నగరాల్లో దాదాపు 5.19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
"మా తాజా అనరాక్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది టాప్ 7 నగరాల్లో రికార్డు స్థాయిలో 5,40,400 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. గత పదేళ్ల కాలంలో ఇదే అత్యధికం. అయితే ఈ మొత్తం డెలివరీలలో ముంబై, పుణె నగరాల వాటానే 57 శాతంగా ఉంది," అని అనరాక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు.
కోవిడ్ తర్వాత మళ్లీ అంతటి సంక్షోభమా?
"చరిత్రను పరిశీలిస్తే.. భారీ హౌసింగ్ టార్గెట్లు ఉన్న సమయంలో ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ప్రాజెక్టులను దెబ్బతీస్తుంటాయి. ఉదాహరణకు 2020 కోవిడ్ సమయంలో లాక్‌డౌన్లు, కార్మికుల వలసలు, సరుకుల కొరత వల్ల నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అనుకున్న టార్గెట్‌లో అప్పుడు సగం కూడా ఇళ్లను డెలివరీ చేయలేకపోయాం," అని ప్రశాంత్ ఠాకూర్ వివరించారు.
అయితే, ప్రస్తుత పరిస్థితి కోవిడ్ కాలం నాటి పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇప్పుడు నిర్మాణ పనులు ఎక్కడా ఆగలేదు, కార్మికుల కొరత కూడా లేదు. కానీ, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం పెరిగే ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, స్టీల్, అల్యూమినియం, కాపర్, ఎలక్ట్రికల్ సామాగ్రి ధరల రూపంలో ప్రాజెక్టులపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడటం ఖాయమని నివేదిక స్పష్టం చేసింది.
రికార్డు స్థాయి నిర్మాణానికి పశ్చిమాసియా యుద్ధం ముప్పు!
అనరాక్ రీసెర్చ్ ప్రకారం, 2017 నుంచి 2025 మధ్య కాలంలో భారతదేశంలోని టాప్ 7 నగరాల్లో దాదాపు 30.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాది అనుకున్నవన్నీ సకాలంలో పూర్తయితే 2026 సంవత్సరం రియల్ ఎస్టేట్ చరిత్రలోనే రికార్డు స్థాయి డెలివరీల సంవత్సరంగా నిలుస్తుంది.
కరోనా ముగిసిన తర్వాత 2021 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో ఇళ్ల అమ్మకాలు, కొత్త లాంచ్‌లు భారీగా పెరిగాయి. ఆ సమయంలో ప్రారంభమైన ప్రాజెక్టులే ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. అయితే, ఎంతో ఆశాజనకంగా ఉన్న ఈ రికార్డు స్థాయి డెలివరీల రంగానికి ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం పెద్ద ముప్పుగా మారిందని నివేదిక హెచ్చరించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


