Vaibhav Sooryavanshi : కల నెరవేరిన వేళ! వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా ‘జెర్సీ’..
Vaibhav Sooryavanshi Jersey : భారత క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియా జెర్సీని అందుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న చారిత్రాత్మక రికార్డును వైభవ్ బద్దలు కొట్టనున్నాడు.
ప్రపంచ క్రికెట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అద్భుత క్షణం మరికొద్ది రోజుల్లో సాకారం కాబోతోంది! బీహార్‌కు చెందిన 15 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేయడానికి సర్వం సిద్ధమైంది. ఈ శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లో వైభవ్ బరిలోకి దిగే అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టీమిండియా బ్లూ కలర్ జెర్సీలో ఈ యువ సంచలనం ఎలా ఉంటాడో చూపిస్తూ బీసీసీఐ మంగళవారం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. మొదటిసారి తన పేరు రాసి ఉన్న ఇండియన్ జెర్సీని చేతిలోకి తీసుకున్న క్షణాన వైభవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ భావోద్వేగ క్షణంలో ఈ వండర్‌కిడ్ నోట మాట రాలేదు.

తన అనుభూతిని పంచుకుంటూ, "ఈ సంతోషాన్ని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. ఏ రోజైతే నేను మొదటిసారి చేతిలోకి బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ కోసం క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టానో, ఆ రోజు కన్న కల ఈ రోజు నెరవేరింది. నా సుదీర్ఘ ప్రయాణంలో అత్యంత కీలకమైన అడుగు ఈ రోజు పడింది. నిజంగా ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను, అంతా ఒక కలలా అనిపిస్తోంది. ఆ టీ-షర్ట్‌పైన నా పేరు చూడగానే నా పెదవులపై నవ్వు ఆగలేదు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని అద్భుతాలు జీవితంలో జరిగిపోతుంటాయి. తీరా అది నిజమయ్యాక ఎలా స్పందించాలో కూడా అర్థం కాదు. సరిగ్గా నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది," అని వైభవ్ సూర్యవంశీ ఎంతో గర్వంగా, భావోద్వేగంతో చెప్పాడు.
బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో వైభవ్‌కు టీమిండియా జెర్సీ అందిన ఆ అపురూప దృశ్యం రికార్డైంది. భారత క్రికెట్ జట్టు త్రో-డౌన్ స్పెషలిస్ట్ రాఘు వచ్చి వైభవ్ రూమ్ తలుపు తట్టగా, ఆ చిన్నారి క్రికెటర్ ఎంతో వినయంతో మొదట ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాతే జెర్సీ ఉన్న బాక్స్‌ను తెరిచాడు. లోపల నుంచి టీమిండియా జెర్సీని బయటకు తీసి, చేతుల్లోకి పట్టుకుని, కాసేపు ఆ బ్లూ జెర్సీ వైపే అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆ క్షణాన్ని తన గుండెల్లో పదిలపరుచుకున్నాడు.
ఈ స్థానానికి వైభవ్ వంద శాతం అర్హుడు!
క్రికెట్ ప్రపంచం తన నుంచి ఏం ఆశించిందో వాటన్నింటినీ వైభవ్ నిజం చేసి చూపించాడు. కేవలం ఏడాది క్రితమే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ వెలుగులోకి వచ్చాడు. అయితే అది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని ఆ తర్వాత తన ఆటతో నిరూపించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన కథనంగా మారిన వైభవ్.. వెళ్లిన ప్రతిచోటా పరుగుల వరద పారించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా.. ఇలా ఏ దేశానికి వెళ్లినా అక్కడ ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతూ మెరుపు సెంచరీలు బాదాడు. మన దేశవాళీ టోర్నమెంట్లు అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లోనూ రికార్డు స్థాయి శతకాలతో చెలరేగిపోయాడు.
ఇక ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట, బౌలర్లందరూ వైభవ్ బలహీనతలను కనిపెట్టేసి ఉంటారని చాలా మంది భావించారు. కానీ మైదానంలో జరిగింది మాత్రం వేరే! రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్.. ఏకంగా 776 పరుగులు సాధించి, అతి పిన్న వయసులోనే ప్రతిష్టాత్మక 'ఆరెంజ్ క్యాప్' గెలుచుకున్న ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రేసులో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్లను వెనక్కి నెట్టడం విశేషం. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకుండా ఎవరూ ఆపలేకపోయారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు వైభవ్‌ను ఎంపిక చేయడం మినహా సెలక్షన్ కమిటీకి మరో దారి లేకుండా పోయిందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా అంగీకరించారు.
ఇక ఇటీవలే ముగిసిన త్రైపాక్షిక సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టుపై ఇండియా ‘ఎ’ తరఫున 94 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి వైభవ్ ముందే హెచ్చరికలు జారీ చేశాడు. అంతా అనుకున్నట్లు జరిగితే, మరో మూడు రోజుల్లో వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రికార్డును బద్దలు కొట్టబోతున్నాడు! టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్న 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును వైభవ్ అధిగమించనున్నాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


