అతి వేగం ఇంత ప్రమాదకరం- ట్రక్కుని ఢీకొట్టిన బొలెరో, గాల్లో పల్టీలు కొట్టి..
యూపీ గోరఖ్‌పూర్ వారణాసి హైవేపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన భయంకర దృశ్యం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఓ ట్రక్కును ఓ బొలేరో వెనుక నుంచి బలంగా ఢీకొట్టి, పలుమార్లు గాల్లో పల్టీలు కొట్టింది!
అతి వేగం ఎంత ప్రమాదకరమో కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా దేశంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది! ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్–వారణాసి హైవేపై శనివారం ఉదయం ఓ ఫ్లైఓవర్‌పై అతి వేగంతో దూసుకెళుతున్న ఓ బోలెరో కారు, ముందు వెళుతున్న ఒక చిన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఘటన వివరాలు..
శనివారం ఉదయం 6:15 గంటల సమయంలో మఝ్‌గవాన్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇంత జరిగిన తర్వాత కూడా అందరు ప్రాణాలతో ఉండటం చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి!
ఈ షాకింగ్ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు వేగంగా వస్తున్న బోలెరో అదుపు తప్పి, దాని ముందు వెళుతున్న టాటా మ్యాజిక్ ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు క్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రమాదం ధాటికి బోలెరో కారు గాల్లోకి ఎగిరి, పల్టీలు కొట్టి, తిరిగి చక్రాలపైనే నిటారుగా నిలబడింది. ఈ మొత్తం వ్యవహారం కేవలం కొన్ని సెకన్లలోనే జరిగింది. కారు ఆగిన వెంటనే దాని డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:
ఈ ప్రమాదం కారణంగా టాటా మ్యాజిక్‌లో లోడ్ చేసిన సరుకులు రోడ్డుపై పడిపోయాయి. దీనితో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
అంబర్‌నాథ్ ఫ్లైఓవర్ ప్రమాదంలో నలుగురు మృతి
ఇదిలా ఉండగా, అంతకుముందు జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదాన్ని 'హిందుస్థాన్ టైమ్స్' నివేదించింది. ముంబై శివార్లలోని అంబర్‌నాథ్ ఫ్లైఓవర్పైన కారు అదుపు తప్పి అనేక మోటార్‌సైకిళ్లను ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో కారు డ్రైవర్‌తో పాటు బైక్‌లపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదం ధాటికి మోటార్‌సైకిల్ నడుపుతున్న వారిలో ఒకరు ఫ్లైఓవర్ పైనుంచి కిందకు ఎగిరిపడ్డారు!
అంబర్‌నాథ్ పోలీసుల నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదంలో ఉన్న టాటా నెక్సాన్ కారు స్థానిక శివసేన నాయకుడు ప్రమోద్ చౌబే పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన భార్య, శివసేన నాయకురాలు, మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి అయిన కిరణ్ చౌబే ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కారు అతి వేగంగా ప్రయాణిస్తుండగా డ్రైవర్ అదుపు కోల్పోయాడు. ఫలితంగా ఈ కారు ఎదురుగా వస్తున్న లేన్‌లోకి దూసుకెళ్లి, అనేక మోటార్‌సైకిళ్లను ఢీకొట్టింది. ఈ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, కారు డ్రైవర్ స్టీరింగ్ వద్దే మృతి చెందగా, ఒక బైక్ ఫ్లైఓవర్ మీది నుంచి ఎగిరి కిందపడింది. మరో ఇద్దరు బైకర్లు అక్కడికక్కడే మరణించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


