TN floor test : 'అసెంబ్లీ' గండాన్ని గట్టెక్కిన విజయ్- నూతన సీఎంకి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు
TN floor test : తమిళనాడు అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నూతన సీఎం, టీవీకే చీఫ్ విజయ్.. తన మెజారిటీని నిరూపించుకున్నారు. ఆయన ప్రభుత్వానికి మద్దతుగా 144మంది నిలిచారు. వీరిలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెబల్స్ కూడా ఉన్నారు.
ఉత్కంఠభరితంగా సాగిన తమిళనాడు అసెంబ్లీ విశ్వాస తీర్మానంలో నూతన ముఖ్యమంత్రి విజయ్ విజయం సాధించారు. మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ఆయన తన మెజారిటీని ప్రదర్శించారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీకి 118 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, విజయ్ అంతకంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతును కూడగట్టగలిగారు.

విజయ్‌కు అండగా నిలిచిన పార్టీలు..
మే 4న విడుదలైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి 10 సీట్లు తక్కువయ్యాయి. అయితే, చిన్న పార్టీలు విజయ్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించాయి
టీవీకే : 105 (విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒకటి వదులుకున్నారు, స్పీకర్ ఓటు వేయకూడదు)
కాంగ్రెస్ : 5
సీపీఐ : 2
సీపీఎం : 2
ఐయూఎంఎల్ : 2
వీసీకే : 2
ఏఎంఎంకే : 1 (రెబల్ వర్గం)
అన్నాడీఎంకే రెబల్ వర్గం- 25
అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌కు కలిసొచ్చిన వేళ!
విశ్వాస పరీక్ష సమయంలో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) తమ ఎమ్మెల్యేలందరూ విజయ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించారు. అయితే, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఒక వర్గం మాత్రం తిరుగుబాటు చేసింది. వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. పళనిస్వామి మాటను కాదని వారు విజయ్‌కు ఓటు వేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఫలితంగా అన్నాడీఎంకే భవితవ్యంపై ఇప్పుడు విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు మరో ప్రతిపక్ష పార్టీ డీఎంకే (59) ఈ విశ్వాస పరీక్ష నుంచి వాకౌట్ చేసింది. అన్నాడీఎంకేలోని మిగిలిన ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు.
తొలి అడుగులోనే సత్తా చాటిన విజయ్!
మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్, మే 13 లోపు మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించారు. ఒకవైపు ఎన్నికల ఫలితాల్లో ఒక్క ఓటు తేడాతో గెలిచిన తిరుపత్తూరు ఎమ్మెల్యే సీనివాస సేతుపతి విషయంలో కోర్టు చిక్కులు ఉన్నప్పటికీ, ఇతర పార్టీల మద్దతుతో విజయ్ ఈసారి సులభంగానే గండం గట్టెక్కారు.
అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో గెలిచిన అనంతరం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయని వారి కోసం కూడా తన ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
“నా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ఈ ప్రభుత్వం.. నా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిది కూడా. విజిల్ (టీవీకే ఎన్నికల చిహ్నం) చరిత్రను మార్చేసింది. నాది మైనారిటీల ప్రభుత్వం. మైనారిటీల రక్షణకు కృషిచేస్తాను,” అని ఆయన అన్నారు.
సుమారు ఆరు దశాబ్దాల పాటు తమిళనాడును ఏలిన ద్రవిడ పార్టీల (డీఎంకే, అన్నాడీఎంకే) ఆధిపత్యానికి తెరదించుతూ, విజయ్ ఈ విశ్వాస పరీక్షలో నెగ్గి అసెంబ్లీలో తన బలమెంటో చాటారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


