...
...
Next Story

50 శాతం ఉద్యోగాలు పోతాయి.. కానీ కొత్తవి వస్తాయి: హెచ్‌సీఎల్ మాజీ సీఈఓ వ్యాఖ్యలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భవిష్యత్తులో 50 శాతం ఉద్యోగాలు కనుమరుగవుతాయని, అయితే అదే స్థాయిలో కొత్త అవకాశాలు వస్తాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ పేర్కొన్నారు. భారతీయ డేటా భద్రత, స్వదేశీ ఏఐ మోడల్స్ ఆవశ్యకతపై ఆయన కీలక హెచ్చరికలు జారీ చేశారు.

Published on: Feb 16, 2026, 18:32:46 IST
Advertisement

టెక్నాలజీ ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈఓ, సంపర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వినీత్ నాయర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏఐ ప్రభావంతో 50 శాతం ఉద్యోగాలు పోతాయనేది వాస్తవమే అయినా, దానికి సమానంగా కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మారనున్న ఉద్యోగాల ముఖచిత్రం

హెచ్‌సీఎల్ వినీత్ నాయర్
హెచ్‌సీఎల్ వినీత్ నాయర్

ఢిల్లీలో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో పాల్గొన్న వినీత్ నాయర్, రాబోయే మార్పులను విశ్లేషించారు. "మనం స్పష్టంగా గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఆటోమేషన్ కారణంగా ప్రస్తుతమున్న ఉద్యోగాల్లో 50 శాతం పోతాయి. కానీ, టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మరో 50 శాతం కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. టెక్నాలజీ సాయంతో సృష్టించబడే ఉద్యోగాల సంఖ్య చాలా పెద్దది" అని ఆయన వివరించారు.

భారత్ ఇప్పటివరకు టెక్నాలజీని కేవలం అనుసరించే (Follower) స్థాయిలోనే ఉందని, అయితే ఇప్పుడు ఏఐ ద్వారా ప్రపంచాన్ని కొత్తగా ఆవిష్కరిస్తూ టెక్నాలజీని శాసించే (Leader) స్థాయికి ఎదుగుతోందని ఆయన కొనియాడారు.

ప్రైవేట్ కంపెనీలపై ఆశలు వద్దు.. స్టార్టప్‌లే దిక్కు

ఉద్యోగాల కల్పన విషయంలో వినీత్ నాయర్ కీలక సూచనలు చేశారు. ప్రైవేట్ కంపెనీలు కేవలం లాభాల కోసమే పని చేస్తాయని, అవి భారీగా ఉద్యోగాలను కల్పిస్తాయని ఆశించడం కేవలం ఒక 'కల' మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.

"ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల కల్పన జరగాలంటే భారీ ఎత్తున స్టార్టప్‌లు రావాలి. ప్రభుత్వం ఇప్పటికే స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది, అది మరింత వేగవంతం కావాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతీయ డేటా.. విదేశీ మోడల్స్: ఒక హెచ్చరిక

"విదేశీ కంపెనీలు మన డేటాను వాడుకోవడానికి అనుమతించాలా వద్దా అనేది ఒక పెద్ద చర్చ. ఒకవేళ అనుమతించకపోతే మనకు డేటా ఉంటుంది కానీ, దాన్ని వాడే టెక్నాలజీ (LLMs) మన దగ్గర లేదు. కాబట్టి, మన దేశంలోనే ప్రపంచ స్థాయి ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి టెక్ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. లేదంటే వచ్చే పదేళ్లలో భారత్ తన పోటీ తత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది" అని ఆయన హెచ్చరించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe