అదరగొట్టిన విన్‌ఫాస్ట్! భారతీయులకు మరో రెండు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఎలక్ట్రిక్ కార్లు..
వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'విన్‌ఫాస్ట్' భారత మార్కెట్లో సత్తా చాటుతోంది. భారత్ ఎన్సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఆ కంపెనీకి చెందిన వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్లు అత్యున్నతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
భారత ఆటోమొబైల్ కస్టమర్లకు మరో రెండు బెస్ట్ సేఫ్టీ ఆప్షన్స్ లభించాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘విన్ ఫాస్ట్’ తన బ్రాండ్ విలువను మరింత పెంచుకుంటూ, తన ఎస్‌యూవీ లైనప్‌లో భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేసింది. ఇటీవలే జరిగిన భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టుల్లో ఆ సంస్థకు చెందిన వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్లు రెండూ అత్యున్నతమైన 5-స్టార్ రేటింగ్ సాధించాయి.

పెద్దల రక్షణ (అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్)తో పాటు పిల్లల భద్రత (చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్) విషయంలోనూ ఈ కార్లు అద్భుతమైన పనితీరును కనబరిచాయి. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
విన్ ఫాస్ట్ వీఎఫ్7: రక్షణలో మేటి..
2025లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు ఇటీవలే వెల్లడయ్యాయి. 2,493 కిలోల బరువున్న ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్7 ఎస్‌యూవీ, భద్రతలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
పెద్దల రక్షణ: దీనికి 32 పాయింట్లకు గాను 28.54 పాయింట్లు లభించాయి. ముఖ్యంగా సైడ్ ఇంపాక్ట్ టెస్టులో 16కి 16 పాయింట్లు సాధించడం విశేషం.
పిల్లల రక్షణ: 49 పాయింట్లకు గాను 45.25 పాయింట్లు సాధించింది. 18 నెలల, 3 ఏళ్ల వయసున్న చిన్నారులకు అత్యుత్తమ రక్షణ కల్పిస్తున్నట్లు పరీక్షల్లో వెల్లడైంది.
భద్రతా ఫీచర్లు: ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ చెస్ట్, సైడ్ పెల్విస్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా వస్తున్నాయి. దీనితో పాటు ఈఎస్సీ, పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు రక్షణ కవచంలా పనిచేస్తాయి.
విన్ ఫాస్ట్ వీఎఫ్6: బడ్జెట్‌లో భద్రత..
వీఎఫ్7 తరహాలోనే ఈ వీఎఫ్6 కూడా 5-స్టార్ రేటింగ్‌తో అదరగొట్టింది. 2,252 కిలోల బరువున్న ఈ కారు కూడా కుటుంబాలకు అత్యంత సురక్షితమైన ఎంపికగా నిలిచింది.
స్కోరు వివరాలు: పెద్దల రక్షణలో 27.13 (32కి), పిల్లల రక్షణలో 44.41 (49కి) పాయింట్లను సాధించింది.
సైడ్ ఇంపాక్ట్: సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్టులో ఈ ఎస్‌యూవీ 16కి 16 పాయింట్లు సాధించి, పక్క నుంచి జరిగే ప్రమాదాల్లో ప్రయాణికులు సురక్షితంగా ఉంటారని నిరూపించింది.
సేఫ్టీ కిట్: వీఎఫ్7 మాదిరిగానే ఇందులో కూడా అన్ని రకాల ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, సీట్ బెల్ట్ రిమైండర్లు వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.
"విన్ ఫాస్ట్ వీఎఫ్7, వీఎఫ్6 సాధించిన ఈ 5-స్టార్ రేటింగ్, కస్టమర్ల భద్రత పట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనం," అని కంపెనీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. కేవలం విలాసం, టెక్నాలజీ మాత్రమే కాదు.. ప్రాణాలకు రక్షణ ఇచ్చే విషయంలోనూ తాము రాజీ పడబోమని ఈ ఫలితాల ద్వారా విన్ ఫాస్ట్ నిరూపించింది.
ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో హ్యుందాయ్, కియాను వెనక్కి నెట్టి (డిసెంబర్ 2025) నాలుగో స్థానంలో విన్‌ఫాస్ట్ నిలిచిన నేపథ్యంలో, ఈ భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలు ఇండియాలో సంస్థ ప్రదర్శనకు మరింత ఊతం అందిచే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


