School fees : ఎల్‌కేజీ చదువుకు రూ. 2.72 లక్షలు! 'ట్వింకిల్​ ట్వింకిల్​.. నేర్పించేందుకు అంతేందుకు?'

viral kindergarten fee slip : విదేశీ విద్యకు లక్షల్లో ఖర్చు చేస్తుండటం చూస్తూనే ఉంటాము. కానీ ఎల్​కేజీ, యూకేజీకే రూ. 2.7లక్షల ఫీజు కట్టించుకుంటే? సోషల్​ మీడియాలో ప్రస్తుతం వైరల్​ అవుతున్న ఒక పోస్ట్​ దేశంలో.. మధ్యతరగతి ప్రజలకు దూరమవుతున్న చదువుకు అద్దంపడుతోంది.

Published on: Apr 25, 2026, 10:43:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

LKG school fees : నేటి కాలంలో విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయిందనే విమర్శలకు అద్దం పట్టేలా తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం కిండర్ గార్టెన్ (ఎల్​కేజీ/ యూకేజీ) చదువు కోసం ఒక పాఠశాల ఏకంగా రూ. 2.72 లక్షల వార్షిక ఫీజును వసూలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫీజు రశీదు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించి, దేశవ్యాప్త చర్చకు దారితీసింది.

ఎల్​కేజీ ఫీజు రూ. 2.72 లక్షల ఫీజు!
ఎల్​కేజీ ఫీజు రూ. 2.72 లక్షల ఫీజు!

ఫీజుల మోత.. దేనికి ఎంత?

వైరల్ అవుతున్న ఆ స్క్రీన్‌షాట్ ప్రకారం, ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి:

అడ్మిషన్ ఫీజు: రూ. 48,000 (ఇందులో రూ. 15,000 తిరిగి ఇచ్చే అడ్మిషన్ ఫీజు, రూ. 33,000 కాషన్ డిపాజిట్).

వార్షిక ఫీజు: రూ. 2,24,718 (ట్యూషన్ ఫీజు, లైబ్రరీ ఛార్జీలు, జింఖానా ఖర్చులు కలిపి).

మొత్తం ఖర్చు: రూ. 2,72,718.

ట్విస్ట్ ఏంటంటే.. ఇది కేవలం ప్రాథమిక ఫీజు మాత్రమే! స్కూల్ బస్సు, యూనిఫాం, షూస్, సాక్స్, క్యాంటీన్ ఖర్చులు దీనికి అదనం. ఇవన్నీ కలిపితే ఏడాదికి ఒక చిన్నారి చదువు కోసం సుమారు 3 లక్షల రూపాయలకు పైగానే ఖర్చు చేయాల్సి వస్తోంది.

మధ్యతరగతి ప్రజలు కేవలం ఎల్​కేజీకే ఇంత మొత్తంలో ఎలా ఖర్చు చేయగలరు అని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఫీజును వెంటనే చెల్లించాల్సి ఉండటం గమనార్హం.

సోషల్ మీడియాలో ఆగ్రహం: మధ్యతరగతికి చదువు దూరం?

ఈ ఫీజు వివరాలు చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

"పిల్లవాడు అప్పుడే అక్షరాలు నేర్చుకుంటుంటే, ఇంత భారీ ఫీజులు వసూలు చేయడం దారుణం. ఇది విద్యనా లేక కార్పొరేట్ దందానా?" అని ఒక యూజర్ ప్రశ్నించారు.

మరికొందరు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. "మొదటి తరగతికే ఇంత ఉంటే, హైస్కూల్, కాలేజీకి వెళ్లేసరికి సామాన్యుడు చదువు చెప్పించగలడా?" అని ఆవేదన చెందుతున్నారు. నాణ్యమైన విద్య అనేది కేవలం ధనవంతులకే పరిమితం అవుతోందని మధ్యతరగతి వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.

“ట్వింకిల్​ ట్వింకిల్​ లిటిల్​ స్టార్​ నేర్పించడానికి ఇంతెందుకు?” అని మరొకరు కామెంట్​ చేశారు.

ప్రభుత్వ నియంత్రణ ఎక్కడ?

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. నగరాల్లో అద్దెలు, కూరగాయల ధరలు, ఆరోగ్య ఖర్చులు ఇప్పటికే సామాన్యుడి నడ్డి విరుస్తుంటే, ఇప్పుడు ఈ 'ఫీజుల భయం' మధ్యతరగతి కుటుంబాల ఆందోళనను మరింత పెంచుతోంది.

ఖరీదైన పాఠశాలల్లో చేర్పించినంత మాత్రాన నాణ్యమైన విద్య లభిస్తుందనే గ్యారెంటీ లేదని, ఇది కేవలం ఒక స్టేటస్ సింబల్‌గా మారుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. కిండర్ గార్టెన్ ఫీజు ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటి?

కార్పొరేట్ పాఠశాలలు తమ క్యాంపస్‌లో అందించే ఏసీ క్లాస్‌రూమ్స్, విదేశీ సిలబస్, అధునాతన క్రీడా సౌకర్యాల పేరుతో ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి.

2. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టాలు ఉన్నాయా?

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ కమిటీలు ఉన్నాయి. అయితే, వీటి అమలులో అనేక లొసుగులు ఉండటం వల్ల ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More