...
...
Next Story

IMD rain alert : 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఈశాన్య రుతుపవనాల రాకతో బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. అక్టోబర్ 26 నాటికి తీవ్ర తుపానుగా మారనున్న అల్పపీడనం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకొస్తోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దక్షిణాదిన వర్షాలు పడనున్నాయి. ఆ వివరాలు..

Published on: Oct 24, 2026, 08:15:55 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల ప్రజలను, ముఖ్యంగా తీరప్రాంత వాసులను వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి అధికారికంగా ప్రవేశించిన వేళ బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న అల్పపీడనం సముద్రంలో వేగంగా బలపడుతోంది. దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడన ద్రోణి అక్టోబర్ 26 నాటికి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

కేరళలో భారీ వర్షాల అనంతరం తీసిన ఫొటో.. (PTI)
కేరళలో భారీ వర్షాల అనంతరం తీసిన ఫొటో.. (PTI)

ఈ తుపాను వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపునకు పయనించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.

అక్టోబర్ 26న తుపానుగా రూపాంతరం!

దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం రాబోయే 24 నుంచి 48 గంటల్లో మరింత తీవ్రమై అక్టోబర్ 26 నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాల సమీపానికి చేరుకుంటుంది.

ఈ తుపాను ధాటికి తీరప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని సమయాల్లో గాలుల వేగం గంటకు 70 కిలోమీటర్లకు చేరుకుంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కోస్తాంధ్ర, రాయలసీమకు పొంచి ఉన్న ముప్పు..

ఈశాన్య రుతుపవనాల ప్రభావం, తుపాను గమనం కారణంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్టోబర్ 25 నుంచి 28 మధ్య కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకించి అక్టోబర్ 27, 28 తేదీలలో కోస్తాంధ్ర ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది.

ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, దక్షిణ అంతర్గత కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అక్టోబర్ 24 నుంచి 26 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు.

మరోవైపు ఈ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పైనా తీవ్రంగా ఉండనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలు, పూర్బా మేదినీపూర్, పశ్చిమ్ మేదినీపూర్, జార్గ్రామ్, పురూలియా, బాంకురా జిల్లాల్లో అక్టోబర్ 28 నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కోల్‌కతా నగరంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పడిపోవడమే కాకుండా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని ఐఎమ్‌డీ తెలిపింది.

మత్స్యకారులకు అత్యవసర హెచ్చరిక..

సముద్రంలో తీవ్రమైన అలజడి, అల్లకల్లోల పరిస్థితులు నెలకొననున్న దృష్ట్యా మత్స్యకారులకు వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 26 నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షిత తీరాలకు తిరిగి రావాలని స్పష్టం చేసింది.

తీర ప్రాంత నివాసితులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటించాలని ప్రభుత్వం కోరింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks