...
...
Next Story

PM Modi : ‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది- కానీ..’ ఇరాన్​ యుద్ధంపై పార్లమెంట్​లో ప్రధాని మోదీ..

ఇరాన్​తో అమెరికా, ఇజ్రాయెల్​ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్​లో ప్రసంగించారు. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని, కానీ ప్రజలకు సాయం చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తోందని అన్నారు.

Published on: Mar 23, 2026, 14:12:31 IST
Advertisement

పశ్చిమాసియాలో గత కొన్ని వారాలుగా జరుగుతున్న సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇరాన్​- అమెరికా, ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని వెల్లడించారు. కానీ భారత ప్రభుత్వం అన్నింటికి సిద్ధంగా ఉందని వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయ పరిస్థితులు, భారత్​ సన్నద్ధతపై సోమవారం మధ్యాహ్నం పార్లమెంట్​లో ప్రధాని కీలక ప్రసంగం చేశారు.

పార్లమెంట్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
పార్లమెంట్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా కష్టతరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. "యుద్ధం మొదలైనప్పటి నుంచి హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు చాలా సవాలుగా మారాయి. భారత్‌కు వచ్చే ముడి చమురు, గ్యాస్, ఎరువులు, అనేక నిత్యావసర వస్తువులు ఈ మార్గం ద్వారానే వస్తాయి. అయినప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది," అని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

“భారత్​ దగ్గర 5.3 మిలియన్​ మెట్రిక్​ టన్నుల పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. అదనపు నిల్వల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటితో పాటు మన చమురు కంపెనీల వద్ద ఇంకా రిజర్వులు ఉన్నాయి,” అని మోదీ వివరించారు.

41 దేశాలతో ఇంధన బంధం..

భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని మోదీ తెలిపారు. "గత కొన్నేళ్లుగా భారత్ తన ఇంధన దిగుమతి వనరులను గణనీయంగా వైవిధ్యీకరించింది (డైవర్సిఫై). ప్రస్తుతం మనం 41 దేశాల నుంచి ముడి చమురు, గ్యాస్‌ను సేకరిస్తున్నాం. దీనివల్ల ఏదైనా ఒక ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తినా, దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది," అని ఆయన వివరించారు.

పౌరుల భద్రతే ప్రథమ కర్తవ్యం..

“యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 3లక్షల 75వేల మంది భారతీయులు మన దేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. పశ్చిమాసియాలోని నేతలతో నేను స్వయంగా ఫోన్​ చేసి మాట్లాడాను. భారతీయుల భద్రతపై అందరు హామీ ఇచ్చారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కొందరు గాయపడ్డారు. ఇది అత్యంత బాధాకరం,” అని మోదీ తెలిపారు.

ప్రధాని మోదీ సమీక్ష..

అంతకుముందు, పశ్చిమాసియాలో మారుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులను, ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్​) సమావేశాన్ని నిర్వహించారు. యుద్ధం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి మంత్రులు, కార్యదర్శులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

ఆదివారం జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ప్రధాని మోదీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే భారత్‌పై పడే ప్రభావం, దాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks