LPG Shortage : మైండ్ బ్లోయింగ్ ఐడియా! గ్యాస్ కష్టాలకు చెక్- తక్కువ సమయంలో 25మందికి వంట..
Vishwaguru Chulha : అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న తరుణంలో, రాజస్థాన్‌కు చెందిన ఒక సామాన్య ఇనుప కళాకారుడు రూపొందించిన ‘విశ్వగురు చుల్హా’ వెలుగులోకి వచ్చింది. కేవలం 2 కిలోల కట్టెలతో, అర గంటలో 25 మందికి వంట చేసేలా దీనిని రూపొందించారు.
ప్రస్తుతం భారత్‌లో వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' గుండా వచ్చే గ్యాస్ షిప్‌మెంట్లు నిలిచిపోవడం ఇందుకు కారణం. మన దేశానికి అవసరమైన 85-90 శాతం దిగుమతులు ఈ మార్గం నుంచే వస్తాయి. ట్యాంకర్లు ఆలస్యం కావడంతో సిలిండర్ల కొరత మొదలై ధరలు పెరుగుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సామాన్యులకు భరోసానిస్తూ దేశీయ ఆవిష్కరణ ఒకటి వెలుగులోకి వచ్చింది.. అదే ‘విశ్వగురు చుల్హా’!

కేవలం 30 నిమిషాల్లో సుమారు 25 మందికి సరిపడా ఆహారాన్ని ఈ పొయ్యి సిద్ధం చేస్తుంది. ఒకేసారి ఉడకబెట్టడం, వేయించడం, బేకింగ్ చేయడం వంటి పనులు దీనిపై పూర్తి చేయవచ్చు. ఈ చుల్హాకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఆలోచన వెనుక ఉన్న మేధావి..
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన మహ్మద్ షేర్ ఖాన్ ఈ అద్భుతమైన పొయ్యిని రూపొందించారు. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఖాన్, వృత్తిరీత్యా ఇనుప కళాకారుడు. గత మూడు దశాబ్దాలుగా లోహాలతో ప్రయోగాలు చేస్తూ, సామాన్యుల రోజువారీ సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఆయన శ్రమించారు.
అలా పుట్టుకొచ్చిందే ఈ విశ్వగురు చుల్హా!
మహిళల కష్టాల నుంచే పుట్టిన ఆలోచన..
పల్లెల్లో మహిళలు పప్పు, రోటీలు (బాటీ) వండటానికి గంటల తరబడి పొయ్యి ముందు కూర్చోవడం, కట్టెల పొగతో ఇబ్బంది పడటం ఖాన్‌ను ఆలోచింపజేసింది. సమయాన్ని ఆదా చేస్తూ, తక్కువ ఇంధనంతో, పొగ రాని వంట పొయ్యిని తయారు చేయాలనే పట్టుదలతో ఆయన ఈ 'విశ్వగురు చుల్హా'ను ఆవిష్కరించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూడండి :
ఇది ఎలా పనిచేస్తుంది?
విశ్వగురు చుల్హాను మూడు పొరలుగా డిజైన్ చేశారు:
పై భాగం: రొట్టెలు, బ్రెడ్ లేదా పిజ్జా బేక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
మధ్య భాగం: కూరలు వేయించడానికి (ఫ్రై) లేదా గ్రిల్లింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది.
కింద భాగం: పప్పులు, సూప్‌లు లేదా ఇతర కూరలు ఉడకబెట్టడానికి వీలుగా ఉంటుంది.
ఒకే మంటపై మూడు రకాల వంటలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి వంట ప్రక్రియ చాలా వేగంగా ముగుస్తుంది.
తక్కువ కట్టెలు.. తక్కువ పొగ!
సాధారణ పొయ్యికి సుమారు 10 కిలోల కట్టెలు అవసరమయ్యే చోట, ఈ చుల్హా కేవలం 2 కిలోల కట్టెలతోనే పని పూర్తి చేస్తుంది. అంతేకాకుండా, దీని నుంచి పొగ చాలా తక్కువగా వస్తుంది. దీనితో వంటింట్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. స్థానిక వంటకాలతో పాటు అన్ని రకాల వంటలను దీనిపై సులువుగా చేసుకోవచ్చని ఖాన్ చెబుతున్నారు.
27 ఏళ్ల శ్రమ.. 10 వేలకు పైగా విక్రయాలు..
ఈ డిజైన్‌ను పూర్తి చేయడానికి ఖాన్ దాదాపు 27 ఏళ్ల పాటు ఎన్నో ప్రయోగాలు చేశారు! చివరకు 2017లో దీనికి పేటెంట్ కూడా లభించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. సాధారణ ఇళ్లతో పాటు చిన్న చిన్న హోటళ్లు, ధాబాలు కూడా దీనిని ఉపయోగిస్తున్నాయి.
కానీ ఇప్పుడు ఎల్పీజీ కొరత కారణంగా ఈ విశ్వగురు చుల్హా ప్రాముఖ్యత బయటపడింది.
సరసమైన ధర.. సరైన పరిష్కారం..
సుమారు 10,000 రూపాయల ధరకు లభిస్తున్న ఈ పొయ్యి, గ్యాస్ కొరత ఉన్న ప్రస్తుత సమయంలో మధ్యతరగతి కుటుంబాలకు, చిన్న వ్యాపారులకు వరంగా మారింది. ఇంధన ఖర్చును గణనీయంగా తగ్గించడమే దీని ప్రధాన బలం.
దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 'అద్భుతం చేశావు' అని కొందరు ఖాన్ని పొగుడుతుంటే, మరికొంతరు.. ఈ చుల్హాను కొనేందుకు ఎగబడతున్నారు. ‘ఇది ఎక్కడ దొరుకుతుంది’, 'నాకు కూడా కావాలి, దీని ధర ఎంత?' అని కామెంట్లు పెడుతున్నారు.
మరి ఈ దేశీయ ఇన్నోవేషన్‌పై మీ స్పందన ఏంటి?
గమనిక: సోషల్ మీడియాలోని సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించడం జరిగింది. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వాదనలను లైవ్ మింట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు స్వతంత్రంగా ధృవీకరించలేదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


