LPG Gas Cylinder : గ్యాస్ సిలిండర్ల కొరత- నగరంలో హోటల్స్ బంద్? వ్యాపారుల్లో ఆందోళన..
Bengaluru hotels closed : పశ్చిమాసియా యుద్ధ మేఘాల ప్రభావం భారతీయ వంటగదిపై పడింది. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో బెంగళూరులోని హోటళ్లు మంగళవారం (మార్చి 10) నుంచి మూతపడే ముప్పు పొంచి ఉంది. మరోవైపు, దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ ధర రూ. 60, కమర్షియల్ ధర రూ. 115 మేర పెరిగింది.
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు భారతీయ హోటల్, ఆహార రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అకస్మాత్తుగా ఏర్పడిన అంతరాయం కారణంగా మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా బెంగళూరులోని హోటళ్లు మంగళవారం నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం!

గ్యాస్ సిలిండర్ల కొరత- బెంగళూరులో హోటళ్ల బంద్ హెచ్చరిక!
సోమవారం నుంచి హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో, మంగళవారం (మార్చి 10) నుంచి నగరంలోని హోటళ్లను మూసివేసే అవకాశం ఉందని ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ ప్రకటించింది.
“గ్యాస్ సరఫరాలో 70 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చమురు కంపెనీలు గతంలో హామీ ఇచ్చాయి. కానీ అకస్మాత్తుగా సరఫరా నిలిపివేయడం హోటల్ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ. కేంద్ర మంత్రులు వెంటనే స్పందించి, కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించి మాకు మద్దతు తెలపాలి,” అని అసోసియేషన్ తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలే ఈ సరఫరా నిలిపివేతకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
కోల్‌కతా, ముబైలోనూ ఇదే పరిస్థితి: రెస్టారెంట్లు, బేకరీలపై ప్రభావం..
ఈ ప్రభావం కేవలం బెంగళూరుకే పరిమితం కాలేదు. కోల్‌కతాలోని రెస్టారెంట్లు, బేకరీలు కూడా ఎల్పీజీ గ్యాస్ కొరతతో అల్లాడుతున్నాయి. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నాన్-డొమెస్టిక్ (కమర్షియల్) ఎల్పీజీ పంపిణీని నిలిపివేయడంతో వ్యాపారులు ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాడుతున్నారు. సరఫరా పునరుద్ధరించకపోతే హోటల్ పరిశ్రమ కుప్పకూలడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటు ముంబైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
“ఇంకో రెండు రోజుల్లో గ్యాస్ సిలిండర్ల కొరతను పరిష్కరించకపోతే ముంబైలోని అన్ని రెస్టారెంట్లు మూసుకుపోతాయి,” అని ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ శెట్టి తెలిపారు.
ఇదే జరిగితే వ్యాపారులకు కోట్లల్లో నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు..
ఒకవైపు సరఫరా కొరత వేధిస్తుంటే, మరోవైపు పెరిగిన ధరలు వినియోగదారులపై భారంగా మారాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం:
డొమెస్టిక్ (వంట గ్యాస్) సిలిండర్: రూ. 60 పెంపు.
కమర్షియల్ సిలిండర్: రూ. 115 పెంపు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం గత 11 నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్‌లో చివరిసారిగా ధర రూ. 50 మేర పెరిగింది. మధ్యప్రాచ్య యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
నగరాల వారీగా కొత్త ధరలు (నాన్-సబ్సిడీ):
ముంబై - రూ. 912.50
చెన్నై- రూ. 928.50
కోల్‌కతా- రూ. 939.00
దిల్లీలో- రూ. 1883
భారత్ ‘సురక్షిత’ స్థితిలో ఉందా?
చమురు సరఫరాకు జీవనాధారంగా ఉన్న హోర్ముజ్ జలసంధి (ఇది ఇరాన్ చేతుల్లో ఉంటుంది) గుండా సరఫరాకు ఆటంకాలు కలగవచ్చనే ఆందోళనలు ఉన్నప్పటికీ, భారత్ ప్రస్తుతం సురక్షితమైన స్థితిలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా తగినంత గ్యాస్ అందుబాటులో ఉండేలా ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం రిఫైనరీలను ఆదేశించింది. భారత్‌కు ప్రస్తుతం వివిధ దేశాల నుంచి ఇంధన సరఫరా అందుతోందని, కాబట్టి నిల్వల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఇటీవలే పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


