West Bengal Exit poll 2026: పశ్చిమ బెంగాల్లో మళ్లీ దీదీదే అధికారం.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
West Bengal Exit poll 2026: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
West Bengal Exit poll 2026: పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది.

రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు. అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110, కాంగ్రెస్ 1-3, వామపక్షాలు 0-1, బీజీపీఎమ్ 1-2, గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.
టీఎంసీ కూటమి 46.5 శాతం, బీజేపీ 41.5 శాతం, వామపక్షాలు 4.1 శాతం, కాంగ్రెస్ 2.1 శాతం, బీజీపీఎమ్ 0.7 శాతం,ఇతరులు 5.1 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.
ఎస్సీ, ఎస్టీ ఆధిపత్యం ఉండే జల్పాయ్గురి డివిజన్లో టీఎంసీ, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ డివిజన్లో బీజేపీ కొంత మెరుగ్గా ఉన్నా కూచ్ బీహార్లో బలహీనంగా ఉంది. ఇక్కడ దళితులు, గుర్ఖాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.
మైనార్టీలు అధికంగా ఉండే మాల్దా డివిజన్లో టీఎంసీ తన బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది.
ప్రెసిడెన్సీ డివిజన్లో మరోసారి టీఎంసీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తుందని సర్వేలో తేలింది. కోల్కత్తా, హౌరా, నార్త్, సౌత్ 24 పరగణ జిల్లాల్లో బీజేపీపై టీఎంసీ పై చేయి సాధించినట్లు సర్వేలో వెల్లడైంది.
బుర్దవాన్ డివిజన్లో టీఎంసీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా టీఎంసీ ఆధిపత్యమే కనిపిస్తోంది. మిడ్నాపూర్ డివిజనల్లో బీజేపీ బలోపేతమైనా ముస్లిం ప్రాంతాల్లో టీఎంసీకి కలసిస్తుందని సర్వేలో తేలింది.
దళితులు, ముస్లింల మద్దతు
సామాజిక వర్గాలుగా పరిశీలిస్తే దళితులు, ముస్లింలు టీఎంసీ వైపు మొగ్గు చూపారు. ఓబీసీలు టీఎంసీ, బీజేపీ మధ్య చీలిపోయారు. మాతూస్ సామాజిక వర్గం ‘సర్’ పై ఆగ్రహంతో బీజేపీకి దూరమయ్యారు.
ముస్లిం సామాజిక వర్గంలో ఎలాంటి చీలిక కనిపించకపోవడం టీఎంసీకి కలిసి వచ్చింది. ఏఐఎంఐఎం, జేయూపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముస్లిం ఓట్లమై ఆశలు పెట్టుకున్నా వారు బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీకే మూకుమ్మడిగా ఓటు వేశారు.
రాష్ట్రంలో 35 శాతంపైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ సీట్లు 89 కాగా, 25 శాతంపైగా ముస్లింలున్న స్థానాలను కలుపుకుంటే మొత్తం 112 స్థానాల్లో ముస్లింలు కీలకంగా ఉన్నారు.
‘సర్’ తో 90 లక్షల ఓట్లు తొలగించడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఇప్పుడు ఓటు హక్కు పోయిందని, తర్వాత రేషన్ కార్డులు, పౌరహక్కులు కూడా పోతాయనే భయం ఓటర్లలో నెలకొందని సర్వేలో తేలింది. టీఎంసీ ప్రవేశపెట్టిన లక్కీ భండార్ పథకంతో మహిళలు మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు.
బెంగాలీ సెంటిమెంట్
బీజేపీ జాతీయ వాదంపై మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ బాగా పనిచేసింది. రాష్ట్రంలో మమతా బెనర్జీకి సరితూగే నేతలు ఏ పార్టీలో లేకపోవడం టీఎంసీకి కలిసివచ్చింది. బీజేపీ నేత సువేందు అధికారి కీలకపాత్ర పోషించినా మమతా బెనర్జీకి సరితూగలేదు. కాంగ్రెస్, వామపక్షాల నుండి ఆమెకు సమానంగా ఏవరూ లేరు.
స్వాతంత్య్రానంతరం బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ ప్రజలకు సహనం, ఓర్పు ఎక్కువని స్పష్టమవుతోంది. మొదటి దశలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 25 ఏళ్ల పాటు అధికారం కట్టబెడితే, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలకు 35 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టారు. ఆ ఒరవడిలోనే టీఎంసీకి నాలుగో దఫా కూడా అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయి.
బీజేపీ టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చిన క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం లేకపోవడం ప్రతికూలంగా మారింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


