Muharram 2026 : మొహర్రం అంటే ఏంటి? ఇస్లాంలో దీని ప్రాధాన్యత, విశిష్టతలేంటి?
When is Muharram 2026 : ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్ ప్రకారం మొహర్రం మొదటి, అత్యంత పవిత్రమైన మాసం. రంజాన్ తర్వాత ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఈ మాసానికి ఉన్న చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతలను, 'ఆషూరా' (మొహర్రం 10వ రోజు) విశిష్టతను ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి..
ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం.. ‘మొహర్రం’ అనేది కేవలం ఒక పండుగ కాదు.. అది ఒక పవిత్రమైన మాసం. ఇస్లామిక్ లూనార్ (చంద్ర) క్యాలెండర్‌లో ఇది మొదటి నెల. అంటే ముస్లింలకు ఇది కొత్త సంవత్సరం అన్నమాట. ముస్లిం సమాజంలో ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా ఈ మాసానికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది.

అరబిక్ పదం 'అల్-ముహర్రం' నుంచి ఈ పేరు వచ్చింది. దీని అర్థం 'నిషేధించినది' లేదా 'పవిత్రమైనది'. ఇస్లాంలో యుద్ధాలు, గొడవలు పూర్తిగా నిషేధించిన నాలుగు పవిత్ర మాసాల్లో (మొహర్రం, రజబ్, దుల్ ఖద, దుల్ హిజ్జా) ఇది మొదటిది. రంజాన్ మాసం తర్వాత ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రెండొవ మాసంగా మొహర్రాన్ని పరిగణిస్తారు.
ఇస్లాంలో మొహర్రం విశిష్టత..
1. ఇస్లామిక్ నూతన సంవత్సరం ప్రారంభం:
మొహర్రం మొదటి రోజును 'రాస్ అస్-సనా అల్-హిజ్రీయా' (ఇస్లామిక్ నూతన సంవత్సరం) గా జరుపుకుంటారు. అయితే, ఇందులో ఎలాంటి బాణాసంచా కాల్చడాలు, వేడుకలు ఉండవు. ముస్లింలు ఈ రోజును అత్యంత ప్రశాంతంగా, ప్రార్థనలతో, దైవచింతనతో, సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రారంభిస్తారు. రాబోయే ఏడాదిలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి సంకల్పం చెప్పుకుంటారు.
2. అల్లాహ్ మాసం (షహ్రుల్లా):
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మొహర్రం నెలను 'అల్లాహ్‌కు చెందిన మాసం' అని అభివర్ణించారు. ఈ నెలలో చేసే మంచి పనులకు, దానధర్మాలకు ఆధ్యాత్మికంగా గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.
3. 'ఆషూరా' దినం (10వ మొహర్రం):
మొహర్రం మాసంలో అత్యంత కీలకమైన రోజు 10వ రోజు. దీనినే ‘ఆషూరా’ అంటారు. ఈ రోజుకు సున్నీ, షియా ముస్లింలలో వేర్వేరు చారిత్రాత్మక ప్రాధాన్యతలు ఉన్నాయి:
సున్నీ ముస్లింలు: పూర్వ కాలంలో అల్లాహ్.. ప్రవక్త మూసా (మోసెస్), అతని అనుచరులను ఈజిప్ట్ చక్రవర్తి ఫారో (ఫిరౌన్) క్రూరత్వం నుం;f రక్షించడానికి ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చిన రోజుగా దీనిని స్మరిస్తారు. దీనికి కృతజ్ఞతగా ముస్లింలు మొహర్రం 9, 10 తేదీల్లో ఉపవాసాలు ఉంటారు.
షియా ముస్లింలు: క్రీస్తుశకం 680 (హిజ్రీ 61) లో కర్బలా మైదానంలో జరిగిన చారిత్రాత్మక యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ మనవడు ‘ఇమామ్ హుస్సేన్ ఇబ్న్ అలీ’, అతని అనుచరులు అమరవీరులైన (రక్తసాక్షి) రోజుగా దీనిని పరిగణిస్తారు. అందుకే షియా ముస్లింలు ఈ రోజున తీవ్ర శోకతప్త హృదయంతో స్మరణ సభలు, ఊరేగింపులు (పీర్ల పండుగ/మొహర్రం శోకదినాలు) నిర్వహిస్తారు.
ఈ ఏడాది, భారత దేశంలో ఈ 10వ రోజు అనేది జూన్ 26న వచ్చింది.
మొహర్రం మాసంలో ముస్లింల ఆచారాలు..
మొహర్రం అనేది సంబరాలు చేసుకునే సమయం కాదు, అది ఆత్మపరిశీలనకు, దైవానికి మరింత దగ్గరయ్యే సమయం. ఈ నెలలో ముస్లింలు ప్రధానంగా ఈ కింది పనులు చేస్తారు:
ఉపవాసాలు : మొహర్రం నెలలో, ముఖ్యంగా ఆషూరా (10వ రోజు) నాడు ఉపవాసం ఉండటం ఎంతో పుణ్యప్రదమైనదని భావిస్తారు. ఈ ఉపవాసం వల్ల గత ఏడాది చేసిన పాపాలు తొలగిపోతాయని ప్రవక్త పేర్కొన్నారు. ఇతర మతాల ఆచారాలకు భిన్నంగా ఉండటం కోసం 9, 10వ తేదీల్లో కలిపి రెండు రోజులు ఉపవాసం ఉండాలని ఇస్లామిక్ పండితులు సూచిస్తారు.
ఖురాన్ పఠనం, నఫిల్ ప్రార్థనలు: పవిత్ర ఖురాన్‌ను ఎక్కువగా పఠించడం, ఐదు పూటల నమాజ్‌తో పాటు అదనపు ఐచ్ఛిక (నఫిల్) ప్రార్థనలు చేయడం.
సదకా (దానధర్మాలు): పేదలకు, అవసరంలో ఉన్నవారికి స్వచ్ఛందంగా సహాయం చేయడం, అన్నదానం చేయడం.
క్షమాపణ వేడుకోవడం: గతంలో తెలిసీ తెలియక చేసిన తప్పులను ఒప్పుకుంటూ అల్లాహ్ సముఖంలో పశ్చాత్తాపం (దుఆ) ప్రకటించడం.
మొత్తంగా చెప్పాలంటే, మొహర్రం అనేది ముస్లింలు తమ జీవన విధానాన్ని ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా మార్చుకుంటూ, సరికొత్త ఆధ్యాత్మిక సంకల్పంతో కొత్త హిజ్రీ సంవత్సరంలోకి అడుగుపెట్టే ఒక గొప్ప పవిత్ర సమయం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


