Bakrid 2026 : ముస్లింలు బక్రీద్‌ని ఎందుకు జరుపుకుంటారు? గొర్రెలను ఎందుకు బలి ఇస్తారు?
Eid ul adha wishes : బక్రీద్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది దైవ భక్తికి, నిస్వార్థ త్యాగానికి నిదర్శనం. అల్లా పట్ల ప్రవక్త ఇబ్రహీం చూపిన అచంచలమైన విశ్వాసాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ బక్రీద్ విశిష్టతను, ప్రత్యేకతలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
Eid ul adha mubarak wishes : ఇస్లాం మతంలో అత్యంత పవిత్రంగా భావించే రెండు ప్రధాన పండుగల్లో ‘ఈద్-ఉల్-అజ్హా’ ఒకటి. దీనినే మనదేశంలో ‘బక్రీద్’ అని 'త్యాగాల పండుగ' అని పిలుస్తారు. మరొకటి రంజాన్ లేదా ఈద్-ఉల్-ఫితర్. వార్షిక పవిత్ర హజ్ యాత్ర ముగిసిన వెంటనే, ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ చివరి నెల అయిన 'ధు-అల్-హిజ్జా' 10వ రోజున చంద్రదర్శనం ఆధారంగా ఈ బక్రీద్‌ని జరుపుకుంటారు. మే 28, 2026న దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో బక్రీద్ వెనుక ఉన్న విశిష్టథ, ఖుర్బానీ నియమాలు, ప్రత్యేక శుభాకాంక్షలు ఇక్కడ చూడండి..

ఈద్ ఉల్ అజ్హా- బక్రీద్ చరిత్ర, ప్రాముఖ్యత..
ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం.. అల్లా ఒకసారి ప్రవక్త ఇబ్రహీంను పరీక్షించాలనుకున్నాడు. అందులో భాగంగా తన ప్రాణ సమానమైన కుమారుడు ఇస్మాయిల్‌ను బలి (త్యాగం) ఇవ్వాలని ఆదేశించాడు. దేవుని ఆజ్ఞను నెరవేర్చేందుకు ఇబ్రహీం సిద్ధపడి, కళ్లకు గంతలు కట్టుకుని కుమారుడి మెడపై కత్తి పెట్టే క్షణంలో.. అల్లా అతని భక్తికి మెచ్చి ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రె (పొట్టేలు) ప్రత్యక్షమయ్యేలా చేశాడు!
ఇబ్రహీం త్యాగానికి గుర్తుగానే ఈ పండుగనాడు 'ఖుర్బానీ' (జీవాల బలి) ఇచ్చే సాంప్రదాయం ప్రారంభమైంది. అందుకే దీనిని 'ఫెస్టివల్ ఆఫ్ శాక్రిఫైస్' అంటారు.
ఖుర్బానీ (త్యాగం) నియమాలు ఇవే:
పండుగ రోజు ఉదయాన్నే మసీదుల్లో ప్రత్యేక ఈద్ నమాజ్ పూర్తయిన తర్వాతే ఖుర్బానీ ప్రక్రియ మొదలవుతుంది. ధు-అల్-హిజ్జా 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు (మొత్తం మూడు రోజులు) ఈ త్యాగ క్రతువును నిర్వహించవచ్చు.
ఏ జంతువులను ఇవ్వాలి? గొర్రె, మేక, ఆవు, ఎద్దు లేదా ఒంటెలను ఖుర్బానీ ఇవ్వవచ్చు. గొర్రె లేదా మేక ఇస్తే అది ఒక షేర్ (వాటా) కిందకు వస్తుంది. అదే ఎద్దు, ఆవు లేదా ఒంటె అయితే ఒక జంతువుపై ఏడుగురు (7 షేర్లు) కలిసి ఖుర్బానీ ఇవ్వవచ్చు. మన దేశంలో సాధారణంగా గొర్రెలను బలి ఇస్తుంటారు.
ఆరోగ్యం ముఖ్యం: బక్రీద్ నాడు ఖుర్బానీ ఇచ్చే జంతువు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి, దానికి ఎలాంటి అంగవైకల్యం ఉండకూడదు. దానిని ఇస్లామిక్ 'హలాల్' పద్ధతిలోనే జరపాలి.
బక్రీద్ 2026- మాంసాన్ని 3 సమాన భాగాలుగా ఎందుకు పంచుతారు?
ఈద్ ఉల్ అజ్హా నాడు ఖుర్బానీ ఇచ్చిన మాంసాన్ని కేవలం తామే తినేయకుండా సమాజంలోని అందరికీ పంచాలనే నియమం ఇస్లాంలో ఉంది. ప్రతి వాటా మాంసాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తారు:
- మొదటి భాగం: తమ కుటుంబం, పిల్లల కోసం.
- రెండవ భాగం: బంధువులు, స్నేహితులు, పొరుగువారి కోసం.
- మూడవ భాగం: పేదలు, నిరుపేదలకు దానం చేయడానికి.
ఈ పవిత్రమైన రోజున ముస్లింలు సరికొత్త దుస్తులు ధరించి, కుటుంబ సభ్యులతో గడుపుతూ పరస్పరం బహుమతులు, శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) ప్రత్యేక శుభాకాంక్షలు..
మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు పంపించుకోవడానికి కొన్ని బక్రీద్ శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నాయి:
ఈద్ ముబారక్! అల్లా మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఆశీస్సులు కురిపించాలని కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులకు పవిత్ర బక్రీద్ 2026 శుభాకాంక్షలు.
ఈ ఈద్ మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యాలను నింపాలి.
హ్యాపీ బక్రీద్! మీ త్యాగాలను, ప్రార్థనలను అల్లాహ్ స్వీకరించుగాక.
ఈద్ ముబారక్! మీ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా సాగిపోవాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను.
మీకు, మీరు ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈద్-ఉల్-అజ్హా ముబారక్.
బక్రీద్ 2026 శుభాకాంక్షలు! మీకు తిరిగిలేని, ముగింపు లేని ఆనందం కోసం ప్రార్థిస్తున్నాము.
బక్రీద్ ముబారక్! జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి.
మీ ప్రియమైనవారికి మరిన్ని విషెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


