ఇక వాట్సాప్​లో కూడా సబ్​స్క్రిప్షన్​ ప్లాన్! ఈ ఎక్స్​క్లూజివ్​ ఫీచర్స్​తో..

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ త్వరలో 'ప్రీమియం సబ్‌స్క్రిప్షన్' ప్లాన్‌ను తీసుకొస్తోందని సమాచారం. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చినట్లుగా యాప్ థీమ్స్, ఐకాన్స్ మార్చుకోవడంతో పాటు మరిన్ని ప్రత్యేక ఫీచర్లను పొందవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Jan 30, 2026, 09:30:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాట్సాప్ ఒక కొత్త 'ఆప్షనల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్'పై పని చేస్తోందని సమాచారం. దీని ద్వారా యూజర్లకు కొన్ని ఎక్స్​క్లూజివ్​ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఈ ప్లాన్ ప్రధానంగా పర్సనలైజేషన్, ప్రొడక్టివిటీ టూల్స్​పై దృష్టి పెట్టనుంది. అయితే, వాట్సాప్​లోని ప్రాథమిక మెసేజింగ్ ఫీచర్లు మాత్రం ఎప్పటిలాగే ఉచితంగానే ఉంటాయి. మెటా యాజమాన్యంలోని ఈ ప్లాట్‌ఫారమ్, ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాట్సాప్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ ధర, లభ్యత, ఇందులో ఉండే పూర్తి ఫీచర్ల జాబితా ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

వాట్సాప్​లో కూడా సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​?
వాట్సాప్​లో కూడా సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​?

సబ్‌స్క్రైబర్‌లకు ప్రత్యేక స్టిక్కర్లు, థీమ్స్..

వాట్సాప్ అండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.4.8లో ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు సంబంధించిన పాపప్ మెసేజ్‌ను 'వాబీటాఇన్​ఫో' అనే ఫీచర్ ట్రాకర్ గుర్తించింది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉన్నందున, బీటా యూజర్లు కూడా దీనిని ఇప్పుడే వాడలేరు. రాబోయే కాలంలో ఒక ‘వెయిట్‌లిస్ట్’ సిస్టమ్ ద్వారా ఈ ప్లాన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రాగానే వెయిట్‌లిస్ట్‌లో చేరిన వారికి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వారు డబ్బులు కట్టాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.

ఈ ప్రీమియం ప్లాన్‌లో లభించే మొదటి ఫీచర్లలో ఎక్స్‌క్లూజివ్ స్టిక్కర్లు, కొత్త యాప్ థీమ్స్, మూడు కంటే ఎక్కువ చాట్‌లను పిన్ చేసుకునే సౌకర్యం ఉండవచ్చని తెలుస్తోంది. వీటితో పాటు చాట్ రింగ్‌టోన్స్, యాప్ ఐకాన్‌ను మనకు నచ్చిన విధంగా మార్చుకునే (కస్టమైజ్​) ఆప్షన్లను కూడా వాట్సాప్ సిద్ధం చేస్తోంది. దీనివల్ల యాప్ చూడటానికి ఎలా ఉండాలి, ఎలా వినిపించాలి అనే దానిపై యూజర్లకు మరింత నియంత్రణ లభిస్తుంది.

రానున్న రోజుల్లో ఫీడ్ బ్యాక్ ఆధారంగా వాట్సాప్ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​లో మరిన్ని ఫీచర్లను చేర్చే అవకాశం ఉంది. అలాగే అభివృద్ధి దశలో ఉన్న కొన్ని ఫీచర్లను మార్చడం లేదా తొలగించే అవకాశమూ ఉంది.

ఈ పెయిడ్ ప్లాన్​ వల్ల యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు. మీరు డబ్బులు కట్టినా కట్టకపోయినా, ప్రైవసీ ప్రొటెక్షన్​ ఫీచర్లు అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రీమియం ప్లాన్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించలేదు. అదే సమయంలో ఈ వాట్సాప్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​​ ధరలు ఇంకా ఖరారు కాలేదు. ఇవి ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉండే అవకాశం ఉంది.

రానున్న రోజుల్లో వీటిపై మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More