PF contribution : ఈపీఎఫ్ 2026 కొత్త రూల్స్‌తో మీ టేక్-హోమ్ శాలరీ పెరుగుతుందా? పెరిగితే లాభమా? నష్టమా?
EPF new rules : కేంద్ర ప్రభుత్వం ‘కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020’ కింద కొత్త ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్ 2026’ను నోటిఫై చేసింది. దీని ప్రకారం ఉద్యోగి, యాజమాన్యం చెరో రూ. 1,800 మాత్రమే తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పు మీ జీతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ చూద్దాము..
దేశంలోని కోట్లాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ) నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులు తీసుకువచ్చింది. 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020' కింద సరికొత్త 'ఈపీఎఫ్ స్కీమ్, 2026'ను కేంద్రం అధికారికంగా నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026, జూన్ 29 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ నూతన విధానం ప్రకారం.. ఉద్యోగి బేసిక్ శాలరీతో సంబంధం లేకుండా నెలకు గరిష్టంగా రూ. 1,800 మాత్రమే పీఎఫ్ ఖాతాకు మళ్లించాల్సి ఉంటుంది. యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని జమ చేయాలి. ఈ పరిమితికి మించి పొదుపు చేయాలనుకుంటే అది పూర్తిగా ఉద్యోగులు, కంపెనీల ఇష్టపూర్వక నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

గతంలో ఉన్న జీతం ఆధారిత సహకార విధానాన్ని ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ భర్తీ చేయనుంది. పాత పద్ధతిలో ఉద్యోగి బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మొత్తంలో 12 శాతాన్ని విధిగా పీఎఫ్ ఖాతాకు కట్ చేసేవారు. దీనికి ఎలాంటి గరిష్ట ఆర్థిక పరిమితి ఉండేది కాదు.
అయితే కొత్తగా వచ్చిన రూ. 1,800 క్యాప్ వల్ల నెలవారీగా చేతికొచ్చే జీతం పెరుగుతుందా లేదా అనే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది.
మీ టేక్-హోమ్ శాలరీ పెరుగుతుందా?
కొత్త రూల్స్ వల్ల ఉద్యోగుల నెలవారీ జీతం పెరిగే అవకాశం ఉందని ట్యాక్స్, ఫైనాన్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎస్‌డీ సింగ్ అండ్ అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వ్యవస్థాపకులు సూరజ్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. "గతంలో పీఎఫ్ ఖాతాకు నెలకు రూ. 1,800 కంటే ఎక్కువ నిధులు కట్ అవుతున్న ఉద్యోగులకు, ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం మినహాయింపు కేవలం రూ. 1,800 కే పరిమితం అవుతుంది. దీనివల్ల ఉద్యోగి అదనంగా వాలంటరీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెట్టుకోకపోతే, వారి శాలరీ నుంచి జరిగే డిడక్షన్లు తగ్గి చేతికొచ్చే జీతం పెరుగుతుంది," అని వివరించారు.
అయితే ఇది పూర్తిగా సదరు ఉద్యోగి సీటీసీ (కాస్ట్ టు కంపెనీ) స్ట్రక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కంపెనీలు ఇచ్చే సీటీసీ ప్యాకేజీలోనే యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ వాటా కూడా కలిసి ఉంటుంది. ఇప్పుడు కంపెనీలు తమ పీఎఫ్ భారాన్ని రూ. 1,800కి తగ్గించుకున్నాక, మిగిలిన మొత్తాన్ని ఉద్యోగికి అదనపు జీతంగా ఇస్తాయా లేదా అనేది ఆయా కంపెనీల ఉపాధి ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. కంపెనీలు ఈ అదనపు మొత్తాన్ని ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లిస్తే ప్రతి నెలా చేతికి వచ్చే డబ్బు పెరుగుతుంది.
రిటైర్మెంట్ ఫండ్‌కు భారీ గండి?
చేతికొచ్చే జీతం పెరిగినా, దీర్ఘకాలంలో ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ జీవితాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్ ప్రణవ్ సాయి ఎస్ మాట్లాడుతూ.. పీఎఫ్‌కు వెళ్లాల్సిన డబ్బు చేతికి రావడం తాత్కాలికంగా ఆనందాన్నిచ్చినా, చక్రవడ్డీ ప్రయోజనాన్ని కోల్పోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే రిటైర్మెంట్ ఫండ్ భారీగా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం:
పాత పద్ధతి: ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ. 50,000 అనుకుంటే, 12 శాతం చొప్పున ఉద్యోగి వాటా రూ. 6,000, కంపెనీ వాటా రూ. 6,000 కలిపి నెలకు మొత్తం రూ. 12,000 పీఎఫ్ ఖాతాలో జమ అయ్యేది.
కొత్త పద్ధతి : కొత్త రూల్స్ ప్రకారం బేసిక్ ఎంత ఉన్నా తప్పనిసరి పీఎఫ్ కటింగ్ కేవలం రూ. 1,800 మాత్రమే. యాజమాన్యం వాటా కూడా రూ. 1,800 కలిపితే మొత్తం నెలవారీ పెట్టుబడి రూ. 3,600 కి పడిపోతుంది (స్వచ్ఛందంగా అదనపు పీఎఫ్ చెల్లించకపోతే).
దీనివల్ల నెలవారీగా పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నిధులు గణనీయంగా తగ్గిపోతాయి. 20-30 ఏళ్ల సుదీర్ఘ కాలంలో చూసుకుంటే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ కోల్పోవడం వల్ల రిటైర్మెంట్ నాటికి చేతికి అందే పీఎఫ్ కార్పస్ సగానికి పైగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎక్కువ బేసిక్ శాలరీ ఉన్న ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే ఇప్పటికే నెలకు రూ. 1,800 లేదా అంతకంటే తక్కువ పీఎఫ్ కట్ అవుతున్న తక్కువ ఆదాయ వర్గాల ఉద్యోగులకు దీనివల్ల పెద్దగా నష్టం కానీ, లాభం కానీ ఉండదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


