...
...
Next Story

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి: కిటికీలు ధ్వంసం.. ఒకరి అరెస్ట్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓహియోలోని నివాసంపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ఇంటి కిటికీలను పగులగొట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో వాన్స్ కుటుంబం ఇంట్లో లేదు.

Published on: Jan 05, 2026 06:34 PM IST
Advertisement

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంలో కలకలం రేగింది. ఓహియోలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి: కిటికీలు ధ్వంసం.. ఒకరి అరెస్ట్ (REUTERS File)
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి: కిటికీలు ధ్వంసం.. ఒకరి అరెస్ట్ (REUTERS File)

సీఎన్ఎన్ (CNN) కథనం ప్రకారం, సిన్సినాటిలోని వాన్స్ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అదృష్టవశాత్తు ఆ సమయంలో ఉపాధ్యక్షుడు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేరు. నిందితుడు ఇంటి లోపలికి ప్రవేశించలేదని, కేవలం బయటి నుండే కిటికీలను పగులగొట్టాడని ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.

కిటికీలు ధ్వంసం.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్

స్థానిక వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. ఈ దాడిలో ఇంటి వెలుపలి కిటికీల అద్దాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలం వద్ద అద్దపు ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల భద్రతను పర్యవేక్షించే 'సీక్రెట్ సర్వీస్' బలగాలు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

నిందితుడిని తొలుత సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అదుపులోకి తీసుకోగా, అనంతరం సిన్సినాటి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. "ఉపాధ్యక్షుడి వ్యక్తిగత నివాసానికి సంబంధించిన కిటికీలను పగులగొట్టి, ఆస్తి నష్టం కలిగించినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం" అని అధికారులు వెల్లడించారు. ఉపాధ్యక్షుడిని లేదా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

వాన్స్ వెళ్ళిన కొద్ది గంటల్లోనే..

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత వారం సెలవుల నిమిత్తం తన సొంత పట్టణమైన సిన్సినాటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నమే ఆయన అక్కడి నుండి బయలుదేరారు. ఆయన వెళ్ళిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై అటు జేడీ వాన్స్ కార్యాలయం గానీ, ఇటు వైట్ హౌస్ గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe