...
...
Next Story

ఇన్వెస్టర్లకు షాక్​! 10శాతం పతనమైన Wipro share price- ఇప్పుడు కొనాలా? అమ్మేయాలా?

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో విప్రో షేర్లు పతనమయ్యాయి. క్యూ3 ఫలితాలు ఇందుకు కారణం. మరి ఇప్పుడు విప్రో షేర్లు కొనాలా? లేక ఉన్నవి అమ్మేయాలా? నిపుణుల మాటల్లో..

Published on: Jan 19, 2026, 10:43:36 IST
Advertisement

ఐటీ దిగ్గజం విప్రో షేర్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో క్రాష్​ అయ్యాయి. ఒకానొక దశలో 10శాతం మేర పడిపోయి రూ. 241.5 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేశాయి. ఇక ఉదయం 10:30 నిమిషాల ప్రాంతంలో విప్రో షేర్లు 6.7శాతం నష్టంతో రూ. 249.5 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి.

విప్రో షేర్లు పతనం..
విప్రో షేర్లు పతనం..

క్యూ3 ఫలితాల ప్రభావంతో విప్రో షేర్లు ఇంత భారీగా పడ్డాయి.

విప్రో క్యూ3 ఫలితాలు..

ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్​వై26) మూడో త్రైమాసిక ఫలితాలను ఇటీవలే వెల్లడించింది. అక్టోబర్-డిసెంబర్ కాలానికి గానూ కంపెనీ ఏకీకృత నికర లాభం 7శాతం తగ్గి రూ. 3,119 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ. 3,353.8 కోట్లుగా ఉండటం గమనార్హం. కొత్త లేబర్ కోడ్స్ అమలు, కంపెనీలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ ఖర్చులు వంటివి లాభాలపై ప్రభావం చూపాయి.

కొత్త లేబర్ కోడ్స్ అమలు చేయడం వల్ల కంపెనీపై ఒకేసారి రూ. 302.8 కోట్ల అదనపు భారం పడింది. దీనికి తోడు కంపెనీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టిన రీస్ట్రక్చరింగ్ ప్రక్రియ కోసం మరో రూ. 263 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని విప్రో తెలిపింది. అయితే నిర్వహణ ఆదాయం మాత్రం గత ఏడాదితో పోలిస్తే 5.5 శాతం వృద్ధి చెంది రూ. 23,555.8 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే లాభం 3.9 శాతం తగ్గగా, ఆదాయం 3.7 శాతం పెరిగింది.

"ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ బోర్డుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కీలక చర్చాంశంగా మారింది. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం మేము పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాం," అని విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని పల్లియా పేర్కొన్నారు.

అయితే, లాభాలు తగ్గినప్పటికీ వాటాదారులను కంపెనీ నిరాశపరచలేదు. ఒక్కో షేరుకు రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. దీనికి జనవరి 27ని రికార్డు తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 14లోపు ఈ నగదు ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ అవుతుంది.

విప్రో షేర్లు- నిపుణుల విశ్లేషణ..

"లేబర్ కోడ్స్ ప్రభావం వల్ల లాభాలు తగ్గినా, ఆదాయం పెరగడం వల్ల కంపెనీ పనితీరు నిలకడగా ఉన్నట్లే కనిపిస్తోంది," అని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా విశ్లేషించారు.

"సుదీర్ఘ కాలం పాటు రూ. 237 స్థాయి వద్ద కన్సాలిడేషన్ జరిగిన తర్వాత, ఇప్పుడు స్టాక్ మెల్లగా కోలుకుంటోంది. గతంలో రూ. 228 వద్ద ఉన్న సపోర్ట్ బేస్, ఇప్పుడు రూ. 250కి చేరింది. ఒకవేళ షేర్ ధర రూ. 275 దాటి స్థిరపడితే, మధ్యకాలంలో ఇది రూ. 325 వరకు వెళ్లే అవకాశం ఉంది," అని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే ఇతర కంపెనీలతో పోలిస్తే విప్రో వృద్ధి కాస్త నెమ్మదిగానే ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

మరోవైపు, నువామా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్త డీల్స్ తక్కువగా ఉండటం, నాలుగో త్రైమాసికంలో వృద్ధి మందగించే అవకాశం ఉండటంతో స్వల్పకాలంలో కంపెనీ నెమ్మదించవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ షేరును ‘హోల్డ్’ చేయవచ్చని సూచించింది.

మరోవైపు, ఏంజిల్ వన్ ఈక్విటీ టెక్నికల్ అనలిస్ట్ రాజేష్ భోసలే స్పందిస్తూ.. "ఫలితాల ప్రభావంతో విప్రో షేర్లు గ్యాప్-డౌన్‌తో ప్రారంభమై 10శాతం పైగా పడిపోయాయి. ఇంట్రాడేలో రూ. 241 కనిష్ట స్థాయిని తాకినప్పటికీ, కొంత రికవరీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ షేరు మార్కెట్​లో తక్కువ పర్ఫార్మెన్స్ చూపే అవకాశం ఉంది. దీనికి రూ. 260–265 వద్ద రెసిస్టెన్స్​ ఎదురుకావచ్చు, అలాగే రూ. 235–240 వద్ద కీలక సపోర్ట్​ ఉంది," అని తెలిపారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం ఉత్తమం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe