$200 మార్కుకు క్రూడాయిల్? ప్రపంచాన్ని వణకిస్తున్న యెమెన్ హెచ్చరిక

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. సౌదీ అరేబియా దాడులు ఆపకపోతే బాబ్ అల్-మందేబ్, హార్ముజ్ జలసంధులను ఏకకాలంలో మూసివేస్తామని యెమెన్ హెచ్చరించడంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభ భయాలు మొదలయ్యాయి.

Published on: Jul 14, 2026, 11:11:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గల్ఫ్ దేశాల్లో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణకిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ సంక్షోభం నడుమ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'బాబ్ అల్-మందేబ్' జలసంధిని మూసివేస్తామని యెమెన్ సంచలన హెచ్చరిక చేసింది. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడాయిల్) ధర బ్యారెల్‌కు ఏకంగా 200 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

హూతీల ఆధ్వర్యంలోని వార్తా ఛానల్ 'అల్-మసీరా టీవీ' ప్రసారం చేసిన వీడియో నుండి సేకరించిన ఈ చిత్రం, యెమెన్‌లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణాన్ని ఒక ప్రక్షేపకం (projectile) ఢీకొట్టడాన్ని చూపిస్తోంది. (AP)
హూతీల ఆధ్వర్యంలోని వార్తా ఛానల్ 'అల్-మసీరా టీవీ' ప్రసారం చేసిన వీడియో నుండి సేకరించిన ఈ చిత్రం, యెమెన్‌లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణాన్ని ఒక ప్రక్షేపకం (projectile) ఢీకొట్టడాన్ని చూపిస్తోంది. (AP)

వ్యూహాత్మక కూటమితో మూసివేత

యెమెన్‌కు చెందిన అన్సరుల్లా (హుతీ) ఉద్యమ రాజకీయ విభాగ సభ్యుడు మహ్మద్ అల్-ఫరా ఈ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ 'ప్రెస్ టీవీ' ఈ వివరాలను వెల్లడించింది. తమ దేశంలోని పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా దాడులను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

"పరిస్థితులు ఇలాగే ముదిరితే, వ్యూహాత్మక కూటమి ద్వారా బాబ్ అల్-మందేబ్, హార్ముజ్ జలసంధులను మూసివేస్తాం. దీనివల్ల చమురు ధరలు బ్యారెల్‌కు ఏకంగా 200 డాలర్లకు చేరి ప్రపంచ దేశాలకు కోలుకోలేని షాక్ ఇస్తాయి" అని అల్-ఫరా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు.

గ్లోబల్ ట్రేడ్‌కు ఊపిరిలాంటి జలమార్గాలు

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన రెండు జలమార్గాలు ఏకకాలంలో మూతబడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యం ఈ మార్గాల పైనే ఆధారపడి సాగుతోంది.

బాబ్ అల్-మందేబ్ జలసంధి: ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లను కలిపే ఈ మార్గం సూయజ్ కాలువకు దక్షిణ ద్వారంగా పనిచేస్తుంది. ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య దేశాల మధ్య వాణిజ్యానికి ఇది అత్యంత కీలకం. దీని వెడల్పు అత్యంత ఇరుకైన చోట కేవలం 29 కిలోమీటర్లు మాత్రమే. రోజూ దాదాపు 88 లక్షల బ్యారెళ్ల ముడిచమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచ సముద్ర రవాణాలో 10 నుంచి 12 శాతం వాణిజ్యం దీనిపైనే ఆధారపడి ఉంది.

హార్ముజ్ జలసంధి: ఇక్కడి నుంచి రోజూ దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో ఐదో వంతు (20 శాతం) ఈ జలసంధి గుండానే వెళ్తుంది.

గల్ఫ్ దేశాలు అంతర్జాతీయ మార్కెట్లకు ముడిచమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) ఎగుమతి చేయడానికి ఈ రెండే ప్రధాన మార్గాలు.

మారనున్న రవాణా దారులు.. పెరగనున్న ఖర్చులు

ఒకవేళ ఈ రెండు జలసంధులు మూతబడితే, చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు ఆఫ్రికా దక్షిణ కొన వద్ద ఉన్న 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆసియా-ఐరోపా దేశాల మధ్య ప్రయాణ సమయం మరో 12 నుంచి 15 రోజుల పాటు పెరుగుతుంది.

ప్రయాణ సమయం పెరగడంతో ఇంధన వినియోగం, బీమా ప్రీమియంలు, రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోతాయి. పర్యవసానంగా కేవలం క్రూడాయిల్, ఎల్‌ఎన్‌జీ మాత్రమే కాకుండా ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా కూడా తీవ్రంగా ఆలస్యమవుతుంది.

సౌదీ - యెమెన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణలు

సౌదీ అరేబియా మళ్లీ తమపై దాడులకు దిగుతోందని యెమెన్ ఆరోపిస్తోంది. సనా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని రియాద్ దాడులు చేస్తోందని, ఇది కొనసాగితే తాము కూడా దాడులను తీవ్రం చేస్తామని యెమెన్ హెచ్చరిస్తోంది. తాము ఇప్పటికే సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ ఎయిర్ బేస్, అభా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు యెమెన్ దళాలు ప్రకటించాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More