KKR vs GT : 6 మ్యాచుల్లో 5 ఓటములు.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ ఔట్?
IPL 2026 : ఐపీఎల్ 2026లో 3 టైమ్ ఛాంపియన్ కేకేఆర్ పరిస్థితి దారుణంగా ఉంది. శుక్రవారం జీటీతో జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఈ జట్టు ఇంకా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలపై కథనం..
KKR vs GT : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్‌కు ఇది ఆరో మ్యాచ్‌లో ఐదో ఓటమి! పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో లభించిన ఒక్క పాయింటే ఇప్పటివరకు ఆ జట్టు ఖాతాలో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో -1.149 నెట్ రన్ రేట్‌తో కోల్‌కతా ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ జట్టుకు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు అత్యంత క్లిష్టంగా మారిందనే చెప్పుకోవాలి.

మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
పోరాడిన గ్రీన్.. మెరిసిన గిల్..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌ను ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆదుకున్నాడు. 55 బంతుల్లో 79 పరుగులతో వీరోచిత పోరాటం చేయడంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. గిల్ 50 బంతుల్లోనే 86 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, గుజరాత్ 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. వరుసగా మూడో విజయాన్ని అందుకున్న గుజరాత్ టేబుల్‌లో దూసుకెళుతుండగా, కేకేఆర్ మాత్రం ఇంకా తన తొలి విజయం కోసం వేట కొనసాగిస్తూనే ఉంది.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవమేనా?
వరుస ఓటములతో కుంగిపోతున్నప్పటికీ, కేకేఆర్ ఇంకా టెక్నికల్‌గా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోలేదు.
మిగిలిన 8 మ్యాచ్‌ల్లో విజయం: కోల్‌కతా తన తదుపరి 8 మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే 17 పాయింట్లతో నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది.
ఒక్క ఓటమి ఎదురైనా: ఒక మ్యాచ్‌లో ఓడినా 15 పాయింట్లతో టాప్-4లో నిలిచే అవకాశం ఉంటుంది.
రెండు ఓటములు ఎదురైతే: ఒకవేళ మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడితే కేకేఆర్ 13 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
రహానే ఏమన్నాడంటే..
పరాజయాల పరంపర కొనసాగిస్తున్న కేకేఆర్ పరిస్థితిపై ఆ జట్టు సారథి రహానే స్పందించాడు.
“నేను కేవలం పాజిటివ్స్ చూడాలనుకుంటున్నాను. బ్యాటింగ్‌లో రెండు, మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ గ్రీన్ బాగా ఆడాడు. 180 వరకు తీసుకెళ్లాడు. ఈ స్కోర్‌ని మా బౌలర్లు చివరి ఓవర్ వరకు తీసుకెళ్లి పోరాడటం సంతోషకరం. కానీ పవర్‌ప్లేలో మా బౌలర్లు ఎక్కువ రన్స్ లీక్ చేశారు. గిల్ బాగా ఆఢాడు. డ్యూ కాస్త ఉంది. కానీ సంజాయిషీలు ఇవ్వకూడదు,” అని రహానే అన్నాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో కేకేఆర్ స్థానం ఏంటి?
ప్రస్తుతం ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక పాయింట్‌తో కేకేఆర్ పట్టికలో అడుగున (10వ స్థానంలో) ఉంది.
2. కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఏం చేయాలి?
కోల్‌కతా తదుపరి ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే సులభంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. 15 పాయింట్లు సాధించినా ఇతర జట్ల రన్ రేట్‌ను బట్టి అవకాశం ఉండవచ్చు.
3. గుజరాత్ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?
86 పరుగులతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


