Aritificial Intelligence : 'ఐటీ ఉద్యోగులు ఇక వేరే ఉపాధి వెతుక్కోవడం మంచిది'

ఆర్టిఫీషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొత్త శిఖరాలను తాకుతున్న వేళ.. ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై జోహో కో-ఫౌండర్​ శ్రీధర్ వేంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. కోడింగ్ రాకపోయినా ఏఐతో యాప్స్ రూపొందుతున్న తరుణంలో, ఐటీ ఉద్యోగులు వేరే ఉపాధి గురించి ఆలోచించాలని సూచించారు.

Published on: Feb 06, 2026 2:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్టిఫీషీయల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) ప్రభావం రోజురోజుకు పెరుగుతూ, కోట్లాది మంది ఉద్యోగులపై “లేఆఫ్స్”​ భారం పడుతున్న తరుణంలో.. జోహో కో-ఫౌండర్​ శ్రీధర్​ వెంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఐటీ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా కోడింగ్​ చేసే వారు (తనతో సహా) ఇక వేరే ఉపాధిని వెతుక్కోవాలని సూచించారు. కోడింగ్‌లో ఒక్క లైన్ కూడా తెలియకపోయినా, కేవలం ఏఐని ఉపయోగించి ఓ వ్యక్తి 'భగవద్గీత' యాప్‌ను అభివృద్ధి చేయడంపై వేంబు ఈ మేరకు స్పందించారు.

జోహో కో-ఫౌండర్​ శ్రీధర్​ వెంబు..
జోహో కో-ఫౌండర్​ శ్రీధర్​ వెంబు..

అసలేం జరిగింది?

“నాకు రోజు భగవద్గీత చదవాలని ఉండేది. కానీ దానికి సరైన యాప్​ దొరకలేదు. అందుకే నేను సొంతంగా తయారు చేసుకున్నా. అసలు కోడింగ్​లో సింగిల్​ లైన్​ కూడా రాయలేని నేను వారంలో ఐఓఎస్​ యాప్​ని తయారు చేశాను,” అని అనిశ్​ మూంకా అనే వ్యక్తి తన ఎక్స్​ అకౌంట్​లో పోస్ట్​ చేశారు.

దీనిపై శ్రీధర్​ వెంబు ఈ విధంగా స్పందించారు.

"ఆ పోస్ట్‌లో పేర్కొన్నది భగవద్గీత యాప్ గురించి. ఆంత్రోపిక్ సంస్థ తమ ‘క్లాడ్ ఏఐ’తో ఏకంగా ఒక పూర్తి స్థాయి ‘సీ కంపైలర్’ను నిర్మించింది. ఇది ఎంతమాత్రం సామాన్యమైన ఇంజనీరింగ్ విజయం కాదు," అని వేంబు రాశారు.

"ఈ తరుణంలో, మనలో ఎవరైతే కోడింగ్ రాయడం ద్వారా జీవనం సాగిస్తున్నారో, వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఆలోచించడం ఉత్తమం. ఇందులో నన్ను నేను కూడా చేర్చుకుంటున్నాను. నేను ఈ మాట ఆందోళనతో చెప్పడం లేదు, భవిష్యత్తును ప్రశాంతంగా అంగీకరిస్తూ, దానిని స్వీకరిస్తూ చెబుతున్నాను," అని ఆయన వివరించారు.

ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఏఐ విప్లవం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే అంశంపై గూగుల్ ‘జెమినీ’ చాట్‌బాట్‌తో జరిపిన సుదీర్ఘ చర్చను వేంబు ఈ సందర్భంగా పంచుకున్నారు.

'పోస్ట్-లేబర్ ఎకానమీ' (శ్రమతో పనిలేని ఆర్థిక వ్యవస్థ)లో సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే అంశంపై జెమినీతో ఆయన జరిపిన వాదనలను పంచుకున్నారు.

"ఒక అత్యంత తెలివైన ఆర్థిక తత్వవేత్తగా ఏఐ సమాధానాలు ఇచ్చింది. అదే సమయంలో, తన పనిని తానే విమర్శించుకోమని నేను చెప్పినప్పుడు, ఆ పనిని కూడా అద్భుతంగా చేసింది," అని కొనియాడారు.

చాట్‌బాట్‌తో జరిపిన చర్చ ఆధారంగా భవిష్యత్తు రెండు రకాలుగా ఉండవచ్చని వేంబు అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా ఈ టెక్నాలజీ ఎవరి ఆధీనంలో ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఒకవేళ అది 'ఆశావాద వెర్షన్' అయితే.. టెక్నాలజీ అనేది మానవ జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే అవుతుందని, తద్వారా మనుషులు తమ జీవితం, కుటుంబం, మట్టి, నీరు, ప్రకృతి, కళలు, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసంపై దృష్టి సారించే వీలుంటుందని అన్నారు. అదే సమయంలో 'నిరాశావాద వెర్షన్' అయితే అది 'కేంద్రీకృత నియంత్రణ'కు దారితీస్తుందని హెచ్చరించారు.

సోషల్ మీడియా స్పందనలు..

ఈ వైరల్​ పోస్ట్​పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వేంబు విశ్లేషణతో ఒక వర్గం ఏకీభవిస్తుండగా, ఏఐ కోడింగ్ రాయడం అంటే మానవ సృజనాత్మకతకు అంతం కాదని మరికొందరు వాదిస్తున్నారు.

ఒక వినియోగదారు స్పందిస్తూ.. "కోడింగ్ ఏజెంట్లు ఇప్పుడు మానవ ప్రోగ్రామర్ల కంటే చాలా శక్తివంతమైనవి. అయితే అవి ప్రొడ్యూస్​ చేసే వాటిని, అచ్చుగుద్దినట్టు మనం ఎప్పుడు అంగీకరిగలము? అన్నదే అసలు ప్రశ్న," అన్నారు.

మరొకరు స్పందిస్తూ.. "నిజమే సార్.. ఇది మాకు ఇతర విషయాలపై దృష్టి పెట్టడానికే అవకాశాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా పని వల్ల చాలా కలలను నెరవేర్చుకోలేకపోయిన నా లాంటి వారికి ఇది చాలా మంచి విషయం," అని రాశారు.

"అన్వేషించడానికి ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉంది. నిర్మించాల్సినవి ఎన్నో ఉన్నాయి. సాస్ ముగింపు అంటే మానవ సృజనాత్మకత ముగిసినట్లు కాదు," అని మూడవ వ్యక్తి వ్యాఖ్యానించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More