Telangana : గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త - ఆర్థిక సంఘం నిధులు విడుదల

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. తొలి విడతగా రూ. 259.36 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Published on: Feb 05, 2026 5:09 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇటీవలనే ఎన్నికలు పూర్తి కాగా… సర్పంచ్ లు, ఉపసర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. దీంతో పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం… గ్రామ పంచాయతీలకు శుభవార్తను చెప్పింది. తొలి విడతగా ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 259.36 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీలకు నిధులు విడుదల
పంచాయతీలకు నిధులు విడుదల

నిధులు విడుదల…

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం… తెలంగాణకు దాదాపు రూ. 3,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొదటి విడత కింద రూ. 259.36 కోట్లును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి వెళ్తాయి. మిగిలిన నిధులను దశలవారీగా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

నిజానికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా కాలం వాయిదా పడుతూ వచ్చాయి. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు నిధులు రావాల్సి ఉన్నప్పటికీ… ఎన్నికల జాప్యం కారణంగా అవి నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లను విడుదల చేస్తామని కేంద్రం పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చింది. దీంతో చాలా గ్రామ పంచాయతీలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. చిన్న చిన్న పనులు చేసేందుకు కూడా పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక పాలనాధికారులు ఇబ్బందులు పడ్డారు.

ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పలుమార్లు కేంద్రానికి కూడా విజ్ఞపులు చేశారు. కానీ ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టం చేయాలని… మార్చి 31 లోపు పూర్తి కాకపోతే నిధుల విడుదల ఆగిపోయే అవకాశం ఉందని కూడా కేంద్రం హెచ్చరించింది.

ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం… ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపింది. బీసీ రిజర్వేషన్లతో పాటు పలు అంశాలను పక్కనపెట్టి… ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది. గత ఏడాది డిసెంబర్ లో 3 విడతల్లో ఎన్నికలను పూర్తి చేసింది. ఆ తర్వాత వెంటనే సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారాలను కూడా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్నిచోట్ల తప్పితే …. అన్ని గ్రామాల్లోనూ పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఆర్థిక సంఘం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు అయింది.