Adhika masam: అధిక మాసంలో '33' సంఖ్యకు ఉన్న విశిష్టత, అప్పాల దానంలోని అంతరార్థాన్ని తెలుసుకోండి!
Adhika masam: అధిక మాసంలో 33 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అప్పాల దానం, 33 దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి? 33 కోట్ల దేవతల అంతరార్థం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అధికమాసం లేదా పురుషోత్తమ మాసానికి మన హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. కాలగణనలో వచ్చే మార్పుల కారణంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ నెలలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా కూడా అనంతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే అధిక మాసం అంటే మనకు ముఖ్యంగా వినిపించే సంఖ్య 33. పూజల్లో, దానధర్మాల్లో ఈ సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? 33 అప్పాలను ఎందుకు దానం చేయాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

33 అప్పాల దానం
అధిక మాసంలో దీనికి చాలా విశిష్టత ఉంది. ఈ నెలలో అప్పాలను దానం చేస్తారు. ఏ దానమైనా కూడా శక్తికొద్దీ ఇస్తాం, కానీ ఖచ్చితంగా 33 అప్పాలను అధిక మాసంలో దానం ఇస్తారు. 33 కోట్ల దేవతలకు ప్రతినిధులుగా 33 రకాల దేవతా శక్తులు ఈ సృష్టిని నడిపిస్తాయి. మనం సమర్పించే ఒక్కో అప్పం ఒక్కో దేవతకు తృప్తిని ఇస్తుందని పెద్దలు అంటారు. ఈ అప్పాలను ప్లేట్‌లో పెట్టి కాదు, కంచు పాత్రలో ఉంచి దానం చేయాలి.
కంచు అనేది పవిత్రమైన లోహం. ఇది దానం చేయడం వలన దానగ్రహీతకు సానుకూల శక్తి కలుగుతుంది. అప్పాల పైన కొంచెం నెయ్యి వేసి, తాంబూలంతో కలిసి బ్రాహ్మణుడికి సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కోర్టు సమస్యలు కూడా తీరిపోతాయని నమ్మకం.
33 దీపాలు
అధిక మాసంలో దీపారాధన చేస్తే జ్ఞానోదయం కలుగుతుంది. ఈ నెలలో 33 దీపాలను వెలిగిస్తే వంశంలో ఉన్న పితృదేవతల అనుగ్రహం లభించి, పితృదోషాలు తొలగిపోతాయని చెబుతారు. సూర్య, చంద్ర గ్రహాల స్థితి కూడా బలపడుతుంది. పితృదేవతల అనుగ్రహం కలగాలంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 33 దీపాలను వెలిగించి, నది తీరంలో లేదా ఆలయంలో సమర్పిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. సంతానం కోసం ఎదురుచూసే వారికి కూడా ఇది బాగా పనిచేస్తుందని విశ్వసిస్తారు.
33 దేవతలు ఎవరు?
33 కోట్లు అంటే పెద్ద సంఖ్య అనుకుంటారు. కానీ వేదాల ప్రకారం 33 రకాల శక్తులు ఉన్నాయని చెబుతారు. అధిక మాసంలో ఈ శక్తులన్నింటినీ ఏకం చేసి విష్ణువుకి అంకితం చేసే కాలంగా భావిస్తారు.
8 వసువులు
భూమి, అగ్ని, నీరు, వాయు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇవి ప్రకృతి శక్తులు.
11 రుద్రులు
శరీరంలోని ఐదు ప్రాణాలు, ఐదు కర్మేంద్రియాలు, ఆత్మ.
12 ఆదిత్యులు
ఏడాదిలో 12 నెలలకు ప్రతినిధులుగా ఉండే సూర్యుని రూపాలు.
2 అశ్విని దేవతలు. వీరు దైవ వైద్యులు.
శరీరం, కాలం, ప్రకృతి, ఆరోగ్యం.. ఈ నాలుగును శాసించే శక్తులే ఈ 33 దేవతలు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


