Adhika Masam: అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు ఎలా వచ్చింది? ఈ నెలలో చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి!
Adhika Masam: అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని ఎందుకు పిలుస్తారు? ఈ నెలలో దానధర్మాలు చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ గాథను ఈ కథనంలో చదవండి.
ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ సంవత్సరం మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. సూర్య సంక్రమణం ఏ నెలలో జరగదో ఆ నెలను అధిక మాసం అంటారు. చాంద్రమానానికి, సౌరమానానికి మధ్య ఉండే 11 రోజుల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది.

మే 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. జూన్ 16 తర్వాత నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. అయితే ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం, మల మాసం అని కూడా అంటారు. ఎందుకు అలా అంటారు? దాని వెనుక కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక మాసం
ప్రతి ఏడాదికి 12 నెలలు ఉంటాయి. సూర్య చంద్ర గమనాలను సమన్వయం చేసే క్రమంలో అదనపు నెలను అధిక మాసంగా పరిగణించడం జరుగుతుంది. శుభకార్యాలు వంటివి ఈ నెలలో చేయరు. కేవలం ఆధ్యాత్మిక సాధనకు ఈ నెల చాలా పవిత్రమైనది.
మలమాసం అని ఎందుకంటారు?
సూర్య గమనం లేని కారణంగా దీనిని మలినమైన మాసం లేదా మల మాసం అని అంటారు. ఈ కాలంలో ప్రాపంచిక సుఖాలకు సంబంధించిన గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు లాంటి కార్యాలను జరపరు. అందుకే దీనిని వేడుకలకు దూరంగా ఉంచే మాసంగా చూడడం జరుగుతుంది.
పురుషోత్తమ మాసం అనే పేరు ఎలా వచ్చింది? వెనక కథ ఏంటి?
పురాణాల ప్రకారం చూసినట్లయితే ప్రతి నెలకి కూడా ఒక అధిదేవత ఉంటారు. అధిక మాసానికి ఎవరు అధిపతి లేరు. అందుకనే దీనిని తక్కువ చేసి చూడడం మొదలు పెట్టారు. అప్పుడు నిరాశ చెందిన అధిక మాసం శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకోగా, విష్ణుమూర్తి కరుణించాడు. “ఈ నెలకి నేనే అధిపతిగా ఉంటాను. నా పేరైన పురుషోత్తమ పేరుతోనే ఈ మాసం పిలవబడుతుంది” అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి అధిక మాసం పురుషోత్తమ మాసంగా ప్రసిద్ధిగాంచింది. ఈ నెలలో చేసే భక్తి కార్యాలకు అనంతమైన ఫలితాలు లభిస్తాయని స్వామి స్వయంగా చెప్పారు.
అధిక మాసంలో వీటిని పాటిస్తే తిరుగు ఉండదు
అధికమాసంలో చేసే దానధర్మాలకు, పూజలకు విశేష ఫలితాలు అందుతాయి. ఈ నెలలో పాటించాల్సిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.జపం
“ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని ఎక్కువసార్లు జపిస్తే ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.
2.దీప దానం
సాయంసమయంలో దేవుడి దగ్గర దీపాన్ని వెలిగిస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది.
3.పురాణ పఠనం
అధిక జ్యేష్ఠ మాసంలో భాగవతం, విష్ణు సహస్రనామం లేదా పురుషోత్తమ మాస మహత్యాన్ని చదివితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో పుణ్యం కలుగుతుంది.
4.దానధర్మాలు
ఈ నెలలో చేసే దానధర్మాలకు ఎంతో ఫలితం లభిస్తుంది. అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. 33 అరిసెలతో వాయినాన్ని దానంగా ఇస్తే కూడా మంచిది.
ఈ నెలలో పొరపాటున కూడా వీటిని చేయకండి
- ఈ నెలలో విలాసాలకు, అహంకారానికి దూరంగా ఉండాలి.
- కొత్త ఇల్లు కట్టడం, నిశ్చితార్థాలు, వివాహాలు, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేయకూడదు.
- మాంసాహారం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ సాత్విక జీవనాన్ని గడపాలి.
- అధిక మాసం అంటే కేవలం ఒక నెల పెరగడమే కాదు, మన పుణ్యాన్ని పెంచుకునే అవకాశం కూడా.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


