అధిక జ్యేష్ఠ మాసం 2026: 36 రోజుల పాటు పెళ్ళి ముహుర్తాలు లేవు.. ఈ నెలలో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఎందుకు చేయకూడదో తెలుసా?
2026లో అధిక జ్యేష్ఠ మాసం రాకతో తెలుగు నెలల సంఖ్య 13కు చేరింది. మే 17 నుంచి జూన్ 18 వరకు శుభకార్యాలకు విరామం ప్రకటించారు పండితులు. అసలు ఈ అధిక మాసం అంటే ఏమిటి? పెళ్లిళ్లకు ఇది ఎందుకు పనికిరాదో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సాధారణంగా మనకి మొత్తం తెలుగు నెలలు 12 వస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం 13 వచ్చాయి. అధిక జ్యేష్ఠ మాసం రావడంతో ఈ ఏడాది 13 తెలుగు నెలలు వచ్చాయి. అయితే అధిక జ్యేష్ఠ మాసంలో కొన్ని తప్పులు చేయకూడదు. అధిక జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్లు కూడా ఉండవు. అసలు అధిక జ్యేష్ఠ మాసంలో ఎందుకు శుభకార్యాలు జరుపుకోకూడదు, పెళ్లిళ్లు చేసుకోకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక జ్యేష్ఠ మాసంలో కొన్ని పనులు చేయకూడదు
వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కొన్ని శుభకార్యాలను ఈ నెలలో చేయకూడదు. 36 రోజుల పాటు పెళ్లిళ్లు కూడా చేయకూడదు. మే 13 నుంచి ముహుర్తాలు లేవు. పైగా మే 17 నుంచి జూన్ 18 వరకు అధిక మాసం. మే 17 నుంచి జూన్ 18 వరకు శుభకార్యాలు చేయకూడదు. అయితే మళ్లీ జూన్ 19 నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభం అవుతాయి. ఇక ఎందుకు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్లు చేయకూడదనే విషయాన్ని తెలుసుకుందాం.
ఈ ఏడాది మే 17, ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం మొదలు కాబోతోంది. చాంద్రమానం ప్రకారం చూస్తే సంవత్సరానికి 354 రోజులు ఉంటాయి. సౌరమానం ప్రకారం 365 రోజులు ఉంటాయి. రెండిటి మధ్య వచ్చే 11 రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అధిక మాసం అనేది వస్తుంది. ఏడాదికి 11 రోజులు చొప్పున మూడు సంవత్సరాలకు 30 రోజులు పైగా తేడా వస్తుందని భావిస్తారు.
సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించినప్పుడు సూర్య సంక్రమణం జరుగుతుంది. అయితే సంక్రమణం జరగని నెలను అధిక మాసం అంటారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ నెలకు అధిపతి శ్రీమహావిష్ణువు. చైత్రమాసం నుంచి ఆశ్వయుజ మాసం మధ్యలో అధిక మాసం అనేది వస్తుంది.
ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం
2026లో చూస్తున్నట్లయితే, మే 17 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. అధిక మాసంలో కొన్ని శుభకార్యాలు నిషిద్ధం. కానీ సత్యనారాయణ స్వామి వ్రతం, నవగ్రహ హోమాలు, శాంతి పూజలు వంటివి చేసుకోవచ్చు.
శ్రాద్ధ కర్మలను అధిక జ్యేష్ఠ మాసంలో చెయ్యచ్చా?
అధిక మాసంలో ఎవరైనా మరణిస్తే, అధిక మాసంలో పిండరహితంగా, శుద్ధ మాసంలో పిండసహితంగా శ్రాద్ధ కర్మలు చేయొచ్చని శాస్త్రం చెబుతోంది. అధిక జ్యేష్ఠ మాసంలో ప్రతిరోజూ ఒక దీపాన్ని వెలిగిస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని చెబుతారు.
పెళ్లిళ్లు ఇందుకే చెయ్యకూడదు
పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం ఏంటంటే, సూర్యుడు వెలుగుతోనే ప్రపంచమంతా నడుస్తోంది. శుక్రుడు, దేవగురువు బృహస్పతికి మధ్య గదిలో సూర్యుడు ఉంటాడు. కనుక సూర్యుని ప్రభావం సక్రమంగా లేని సమయంలో పెళ్లిళ్లు వంటివి జరపకూడదని పండితులు తెలుపుతున్నారు. ఈ నెల రోజుల్లో శుభకార్యాలను వాయిదా వేయడం జరుగుతుంది. జూన్ 18 తర్వాత శుభకార్యాలు మొదలవుతాయి. అప్పటివరకు వివాహాది శుభకార్యాలు జరపకూడదు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


