ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి.. చంద్రగ్రహణం వేళ రాఖీ కట్టొచ్చా? శ్రావణ పౌర్ణమిపై పూర్తి వివరాలు!

శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ పండుగతో పాటు అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత శ్రావణ మాసంలో ఇలాంటి గ్రహణం ఏర్పడుతున్నట్లు సమాచారం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 28న శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగను నిర్వహించనున్నారు. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు.

Published on: Aug 20, 2026, 04:01:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం పవిత్రతకు పెద్దపీట వేస్తారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. శివాలయాలు శివనామస్మరణతో మార్మోగే ఈ రోజునే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్‌ పండుగను కూడా జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ రోజున ఆకాశంలో ఒక అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.

ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి.. చంద్రగ్రహణం వేళ రాఖీ కట్టొచ్చా? శ్రావణ పౌర్ణమిపై పూర్తి వివరాలు!
ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి.. చంద్రగ్రహణం వేళ రాఖీ కట్టొచ్చా? శ్రావణ పౌర్ణమిపై పూర్తి వివరాలు!

సరిగ్గా ఇదే రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుండటంతో దేశవ్యాప్తంగా భక్తుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా గ్రహణ సమయాల్లో శుభకార్యాలు, పూజలు నిషిద్ధం కాబట్టి, ఈ పండుగపై దాని ప్రభావం ఏంటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపుతున్నారు.

18 ఏళ్ల తర్వాత అరుదైన యోగం

ఖగోళ గణాంకాల ప్రకారం, శ్రావణ మాసంలో ఇలా చంద్రగ్రహణం ఏర్పడటం దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2008లో సావన్‌ మాస అమావాస్య, పౌర్ణమి సమయాల్లో ఇలాంటి గ్రహణాల యోగం కనిపించింది. ఈసారి ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ ఏడాదికి చివరిది కావడం గమనార్హం. ఇది పాక్షిక చంద్రగ్రహణంగా ఖగోళ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తేదీలపై స్పష్టత.. పండుగ ఎప్పుడంటే?

హిందూ పంచాంగం ప్రకారం, పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం 09:09 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం 09:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఆగస్టు 28వ తేదీనే శ్రావణ పూర్ణిమ వేడుకలు, రాఖీ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ పవిత్ర రోజున నదీ స్నానాలు, దానధర్మాలు, ప్రత్యేక పూజలకు విశేషమైన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈసారిక రాఖీ పండుగకు ఎలాంటి భద్రతో పాటు అశుభ సమయాల అడ్డంకులు కూడా లేవు. భద్ర కాలం సూర్యోదయానికి ముందే ముగిసిపోవడంతో రోజంతా సోదరీమణులు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు అనుకూలమైన సమయం కుదిరింది.

భారత్‌లో గ్రహణం ప్రభావం శూన్యం

చంద్ర గ్రహణం ఏర్పడుతున్నప్పటికీ, భారత్‌లో ఉన్నవాళ్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 28న ఉదయం 06:53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:32 గంటలకు ముగిసే ఈ గ్రహణం పగటిపూట రావడం, ఆ సమయంలో మన వైపు చంద్రుడు క్షితిజానికి దిగువన ఉండటం వల్ల ఇది గోచరించదు.

అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. మన దేశంలో గ్రహణ దృశ్యమానత లేకపోవడం వల్ల సూతక సూత్రాలు, నిబంధనలు ఇక్కడ వర్తించవు. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా యథావిధిగా స్నానాలు, దానాలు, రాఖీ వేడుకలు జరుపుకోవచ్చని పండితులు స్పష్టం చేస్తున్నారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More