ఈరోజే భాద్రపద పౌర్ణమి.. ముహూర్తం, పూజా విధానం, దానం, విష్ణు పూజ ప్రాముఖ్యత పూర్తి వివరాలు!

భాద్రపద పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజున పుణ్యస్నానం, దానధర్మాలు, శ్రీ మహావిష్ణువు పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, ఉపవాసం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

Published on: Sep 26, 2026, 08:27:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో పౌర్ణమి తిథికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పూజలు, వ్రతాలు, పుణ్య స్నానాలు, దాన ధర్మాలు చేయడానికి ఈ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ భాద్రపద పౌర్ణమి కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భాద్రపద పౌర్ణమి రోజు ఆచరించాల్సిన ఆచారాలు, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

ఈరోజే భాద్రపద పౌర్ణమి.. ముహూర్తం, పూజా విధానం, దానం, విష్ణు పూజ ప్రాముఖ్యత పూర్తి వివరాలు! (AI)
ఈరోజే భాద్రపద పౌర్ణమి.. ముహూర్తం, పూజా విధానం, దానం, విష్ణు పూజ ప్రాముఖ్యత పూర్తి వివరాలు! (AI)

పౌర్ణమి తిథి సమయం, ముహూర్తం

పంచాంగం ప్రకారం, భాద్రపద శుక్ల పౌర్ణమి తిథి సెప్టెంబర్ 25 రాత్రి 11:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 26 రాత్రి 10:18 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రామాణికంగా తీసుకుని సెప్టెంబర్ 26న శనివారం రోజున పౌర్ణమి వ్రతం ఆచరించనున్నారు. రాత్రి సమయాల్లో తిథి ప్రారంభమైనప్పటికీ, ప్రధాన పూజా కార్యక్రమాలు, వ్రతాలు మాత్రం 26వ తేదీనే జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.

పవిత్ర స్నానాలు, దాన ధర్మాల ప్రాముఖ్యత

  1. పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. వీలైతే సమీపంలోని పుణ్య నదులలో స్నానం ఆచరిస్తారు. అది కుదరని పక్షంలో ఇంట్లోని నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు.
  2. స్నానం ముగించిన తర్వాత స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించాలి.
  3. అనంతరం తమ శక్తి కొద్దీ నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం, ఫలసాయం అందించడం శ్రేయస్కరం.
  4. హిందూ ధర్మంలో దానం అంటే కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం కూడా పుణ్యమేనని పెద్దలు చెబుతారు.

శ్రీ మహావిష్ణువు పూజతో సకల శుభాలు

భాద్రపద పౌర్ణమి రోజున జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఉదయాన్నే పూజా గదిని శుభ్రం చేసి, విష్ణుమూర్తి ప్రతిమ లేదా ఫోటో ముందు దీపం వెలిగించాలి. ఆ తర్వాత భగవంతుడిని స్మరిస్తూ భక్తితో పూజించాలి. ఈ పర్వదినాన విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ప్రత్యేక మంత్రాలు జపించడం వల్ల మనసులోని కల్మషాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండే భక్తులు తమ శక్తికి తగినట్లుగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు.

చంద్ర దర్శనం, అర్ఘ్య ప్రధానం

పౌర్ణమి అనగానే చంద్రుని వెలుగు కళ్ల ముందు కదలాడుతుంది. ఈ రోజు రాత్రి వేళ చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత పాలు కలిపిన నీటితో అర్ఘ్య సమర్పించడం ఆనవాయితీ. చంద్రుడిని పూజించడం ద్వారా ఇంట్లో సుఖ శాంతులు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. పౌర్ణమి రాత్రి చంద్రుని కిరణాలు మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని, మానసిక ప్రశాంతతను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఎవరైనా తమ కుటుంబ ఆచారాలు, సాంప్రదాయాలకు తగినట్లుగానే ఈ పూజలు చేసుకోవాలి.

పితృపక్షానికి ముందు ఎందుకంత విశేషం?

పితృపక్షాల సమయంలో పెద్దలకు తర్పణాలు విడిచే పెట్టే సాంప్రదాయం వుంది. అందుకే చాలా కుటుంబాలు ప్రత్యేక పూజలు, దానాలు నిర్వహించి పితృదేవతల ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. విష్ణు పూజ, వ్రతం, చంద్ర అర్ఘ్యం వంటివి పౌర్ణమి ప్రధానమైన క్రతువులుగా భావిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More