మట్టి శివలింగాన్ని ఎలా చేయాలి.. ? పూజ విశిష్టత, నిమజ్జన నియమాలేంటి..?

శ్రావణ మాసంలో పార్థివ శివలింగ పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించడం వల్ల కలిగే శుభఫలితాలు, పాటించాల్సిన నియమాలను శివపురాణం ఆధారంగా తెలుసుకోండి.

Published on: Aug 4, 2026, 07:43:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో భోళాశంకరుని అనుగ్రహం కోసం భక్తులు రకరకాల నోములు, పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పవిత్ర రోజుల్లో శివలింగానికి జలాభిషేకం చేయడం ఎంత ఫలాన్ని ఇస్తుందో, పార్థివ శివలింగాన్ని (మట్టితో చేసిన శివలింగం) తయారు చేసి ఆరాధించడం కూడా అంతే విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మహాలింగానికి చేసే రుద్రాభిషేకంలోనూ ఈ మట్టి శివలింగ ఆరాధనకే ప్రాధాన్యత ఇస్తారు.

శివపురాణం
శివపురాణం

అసలు శివపురాణం ప్రకారం పార్థివ శివలింగాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి….? పూజ పూర్తయిన తర్వాత ఆ శివలింగాన్ని ఏం చేయాలి? తయారీలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శివ పురాణం స్పష్టం చేస్తున్న దాని ప్రకారం…. మట్టితో చేసిన శివలింగాన్ని లేదా శివుని రూపాన్ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మానవుని కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా అకాల మరణ భయం నుంచి విముక్తి లభిస్తుంది.

  • పాప ప్రక్షాళన : శివుని పార్థివ రూపాన్ని విధివిధానంగా ఆరాధించడం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. జీవితంలోని సకల దుఃఖాలు, కష్టాలు తొలిగిపోతాయి.
  • ఐశ్వర్యం - మోక్ష ప్రాప్తి : ఈ పూజ వల్ల భక్తులకు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు లభించడమే కాకుండా, పునర్జన్మ లేని మోక్ష మార్గం సుగమమవుతుంది.
  • జగత్ పితరుల అనుగ్రహం : శివపురాణంలో పార్వతీ దేవిని జగజ్జననిగా, పరమశివుడిని జగత్పితగా వర్ణించారు. ఈ దంపతులను పార్థివ రూపంలో సేవించే వారిపై వారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి.

ముఖ్య నియమాలు…

మట్టి శివలింగాన్ని తయారు చేసేటప్పుడు కొన్ని శాస్త్రోక్తమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

  • శివలింగ నిర్మాణం కోసం ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, పవిత్రమైన స్థలం నుంచి తీసిన మట్టిని మాత్రమే ఉపయోగించాలి.
  • శివలింగాన్ని తయారు చేసే సమయంలో సాధకుడు తన ముఖాన్ని తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉంచుకోవాలి.
  • పార్థివ శివలింగం పరిమాణం మరీ పెద్దదిగా ఉండకూడదు. ఇంట్లో పూజించేటప్పుడు ఇది బొటనవేలు ఎత్తు లేదా గరిష్టంగా 12 వేళ్ల ఎత్తు మించకుండా చూసుకోవడం శ్రేయస్కరం.

పార్థివ శివలింగాన్ని ఆరాధించిన తర్వాత దాని నిమజ్జన ప్రక్రియ చాలా కీలకమైనది. శాస్త్ర నియమాల ప్రకారం పూజ పూర్తయిన వెంటనే లేదా అదే రోజు సూర్యాస్తమయానికి ముందే శివలింగాన్ని నది, చెరువు లేదా పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయాలి. పార్థివ శివలింగాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంచడం గానీ… మరుసటి రోజు వరకు ఉంచడం గానీ శుభప్రదం కాదని పండితులు స్పష్టం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More