చాణక్య నీతి: అలాంటి బంధువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.. మీ ప్రతి బలహీనతను మీరు సద్వినియోగం చేసుకోవచ్చు!
ప్రతి బంధువు లేదా పరిచయస్తుడు మన శ్రేయస్సే కోరుకుంటాడని భావించకూడదు. కొందరు వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వాటిని మనకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఆచార్య చాణక్యుడు వ్యక్తిగత సమాచారం పంచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమాజంలో మనం కలిసే ప్రతీ ఒక్కరూ శ్రేయోభిలాషులుగా ఉండాలని లేదు. ముఖ్యంగా బంధువర్గంలో కొందరు పైకి ఎంతో ఆప్యాయంగా పలకరించినట్లు కనిపిస్తారు. కానీ, అంతర్గతంగా మన బలహీనతలు, వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడమే వారి ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. సంపాదన ఎంత?, ఇంట్లో సమస్యలేంటి?, పిల్లలు చదువులో ఎలాంటి మార్కులు తెచ్చుకుంటున్నారు? వంటి వివరాలను ఆరా తీసి, తద్వారా వాటిని మనకు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తుంటారు.

ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పినట్లుగా, కష్టకాలంలో బయటి శత్రువుల కంటే స్వంత మనుషుల వల్లే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మనవారితో వ్యవహరించేటప్పుడు ఎప్పుడూ ఒక అప్రమత్తత అవసరం.
సమాచారాన్ని తగ్గించండి.. భద్రతను పెంచండి
ఈ తరహా ఈర్ష్య పడే బంధువులు మన జీవితంలోని ప్రతీ చిన్న విషాదాన్ని లేదా సమస్యను ఒక ఆయుధంలా మలుచుకుంటారు. మన సమస్యను వారి ముందు ఏకరువు పెట్టామంటే, వారికి మనమే స్వయంగా ఆయుధాన్ని అందించినట్లవుతుంది.
అందుకే ఎవరితోనూ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మానేయాలి. ఎవరైనా మీ సంపాదన గురించో, ఇబ్బందుల గురించో అడిగితే.. "దేవుడి దయ వల్ల అన్నీ సజావుగా సాగుతున్నాయి" అని క్లుప్తంగా ముగించండి. సమాచారం ఎంత తక్కువగా ఇస్తే, మీ జీవితం అంత సురక్షితంగా ఉంటుంది.
మౌనమే అతిపెద్ద సమాధానం
ఎవరైనా మీకు వ్యంగ్యంగా మాట్లాడినా లేదా అందరిలోనూ చిన్నచూపు చూసే ప్రయత్నం చేసినా, వెంటనే ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించండి. అలాంటి ఈర్ష్యపరులకు మీ నిజం తెలుసుకోవడం కంటే మీ అసహనం, ఆవేశం కావాలి. మీరు కేవలం చిరునవ్వుతో మౌనంగా ఉండిపోతే అదే వారికి అతిపెద్ద ఓటమి అవుతుంది. అనవసర వాదనలకు దిగడం వల్ల వారి కడుపుమంట మరింత పెరుగుతుంది తప్ప ఒరిగేదేమీ లేదు. సంక్షోభ సమయంలో బుద్ధిమంతులు సంయమనంతో ఉండాలని చాణక్యుడు సూచిస్తున్నారు.
వినయంతోనే సమస్యలకు చెక్
కొన్ని సందర్భాల్లో మితిమీరిన వినయమే బలమైన సమాధానం అవుతుంది. నలుగురిలో ఎవరైనా మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడితే, అత్యంత గౌరవప్రదంగా బదులివ్వండి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత పెంచుతుంది. పైగా అవతలి వ్యక్తి తన ప్రవర్తనకు తానే సిగ్గుపడేలా చేస్తుంది. "మీరు చెప్పింది కూడా నిజమే కావచ్చు" అంటూ తేలికగా తీసుకుంటే వారి దురుద్దేశం నీరుగారిపోతుంది. ఎలాంటి గొడవలకు తావులేకుండా ఈ పద్ధతిలో పరిస్థితులను చక్కదిద్దుకోవచ్చు.
లక్ష్య సాధన నిశ్శబ్దంగా ఉండాలి
మీ భవిష్యత్తు ప్రణాళికలు లేదా గోల్స్ ఎవరికీ ముందే చెప్పకండి. ఎవరికీ ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూపోతే, మీ విజయమే సమాధానం చెబుతుంది. ఈర్ష్యపరులు మీ ప్లాన్స్ ముందుగానే తెలుసుకుని మీ దారిలో అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది.
అందుకే అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండకండి. ఫోన్ కాల్స్ వెంటనే లిఫ్ట్ చేయకపోవడం, ప్రతీ ఆహ్వానానికి వెళ్లకపోవడం ద్వారా మీ విలువను పెంచుకోవచ్చు. అవసరమైనప్పుడు నిస్సందేహంగా గట్టిగా మాట్లాడటం కూడా నేర్చుకోవాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


