Dhanurmasam vratam: ధనుర్మాస వ్రతం ఎలా చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి? వ్రత మహిమ, వ్రత విధానం పూర్తి వివరాలు ఇవిగో
Dhanurmasam vratam: సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. నెల రోజులు ధనుర్మాసం ఉంటుంది. వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు. ఈ నెల అంతా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ నెల రోజులు కూడా పఠించడం జరుగుతుంది.
Dhanurmasam vratam: సూర్యుడు ప్రతినెలా తన రాశిని మారుస్తూ ఉంటాడు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. నెల రోజులు ధనుర్మాసం ఉంటుంది. వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు. ఈ నెల అంతా కూడా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ నెల రోజులు కూడా పఠించడం జరుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పాటించడం జరుగుతుంది.

మధుసూదనుడుకి పూజలు
మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో ఈ ధనుర్మాసంలో పూజిస్తారు. ధనుర్మాసంలో ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని జల్లి, దానిపై బియ్యం పిండితో ముగ్గులు పెడతారు. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఆ ముగ్గుపై ఉంచి, పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించి పూజించడం వలన ఆ కన్యకు మంచి భర్త లభిస్తాడని నమ్ముతారు. ధనుర్మాస వ్రత ప్రస్తావనను, మహత్యాన్ని బ్రహ్మాండ, భాగవత, ఆదిత్య పురాణాల్లో చెప్పబడింది.
ధనుర్మాస వ్రతాన్ని ఎలా చేయాలి?
- ఈ వ్రతాన్ని చేయాలనుకునే వారు స్తోమతను బట్టి నచ్చిన లోహంతో మహావిష్ణువు విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజ పీఠంపై పెట్టాలి.
- విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు పూర్తి చేసుకున్నాక తలస్నానం చేయాలి.
- ఆ తర్వాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. ఆవుపాలు, కొబ్బరినీళ్లు, పంచామృతాలతో విష్ణువును అభిషేకించాలి. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కటిగా వేసుకుని అభిషేకం చేయాలి.
- తులసి దళాలు, పువ్వులను స్వామి వారికి అష్టోత్తర శతనామావళితో లేదా సహస్రనామాలతో భక్తితో సమర్పించాలి.
- ధనుర్మాసం మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనాన్ని సమర్పించాలి.
- ఈ నెల అంతా విష్ణు పురాణం లేదా విష్ణు గాధను చదువుకుంటూ విష్ణువును స్మరించుకోవాలి. ఇలా ధనుర్మాసంలో ప్రతిరోజు చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు.
- ఒకవేళ నెల రోజులు చేయలేని వారు 15 రోజులు లేదా ఎనిమిది, ఆరు, నాలుగు రోజులైనా చేస్తే మంచిది. ఇలా ఈ వ్రతాన్ని ఆచరిస్తే, కోరికలన్నీ నెరవేరుతాయి. మోక్షం లభిస్తుంది.
- ఈ వ్రతాన్ని ఒక్కరోజు చేసినా 1000 సంవత్సరాల పాటు నిత్యం దేవతలందరినీ ఆరాధించినంత ఫలితం కలుగుతుంది.
- గోదాదేవి వ్రతాన్ని ఆచరించి రంగనాథుడిని భర్తగా పొందారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ శ్లోకం చెప్పుకోండి
మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా
తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా
ఈ శ్లోకాన్ని ధనుర్మాస వ్రతం పూర్తయిన తర్వాత చదివి, విగ్రహాన్ని పండితులకు దానం ఇవ్వాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


